ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
వ్యాసమహాముని ద్రుపదునియొద్దకు వచ్చుట (సం. 1-186-38)
ఉ. ఈహితకార్యసిద్ధి యిది యెట్లొకొ తా సమకూరు నంచు సం
దేహముఁ బొంది సోమక యుధిష్ఠిరు లున్నఁ, దదీయధర్మసం
దేహనివృత్తిపొంటెఁ జనుదెంచెఁ బరాశరసూనుఁ డాత్మతే
జోహృతసూర్యతేజుఁ డగుచున్‌ దిశలెల్ల వెలుంగుచుండఁగన్‌.
246
వ. ఇట్లు వచ్చిన కృష్ణద్వైపాయనునకుఁ గుంతీదేవియుఁ బాండవులును బాంచాలుండు నతిభక్తి మ్రొక్కి యమ్మహామునిం గాంచనమణిమయోచ్చాసనంబున నునిచి యర్ఘ్యపాద్యాదివిధులం బూజించి యున్న వారల కుశలం బడిగి హిత మధురసత్యసంభాషణామృతరసప్రవాహసందోహంబున నందఱం బరమానందహృదయులం జేసియున్న యమ్మునీంద్రునకు ముకుళితకరకమలుండయి ద్రుపదుం డి ట్లనియె. 247
క. తన పలుకు లోక మెల్లను | గొనియాడఁగఁ దగిన లోకగురుఁ డీ యమనం
దనుఁ డే మేవురమును నీ | తనుమధ్య వివాహ మయ్యెదము నని పలికెన్‌.
248
క. మీ రెఱుఁగనట్టి లోకా | చారము గలదయ్య? తొల్లి చన్న మహాత్ముల్‌
ధీరమతు లిట్లు సేసిన | వా రెవ్వరుఁ గలరె యాప్తవచనానుమతిన్‌.
249
క. విమలమతి యన్యులకు విష | యమె ధర్మాధర్మనిర్ణయము సేయఁగ ది
వ్యమునీంద్ర! దీని సువిచా | రము సేయుము ధర్మసంకరము గాకుండన్‌.
250
వ. అనిన నా ద్రుపదునకుఁ గృష్ణద్వైపాయను సమక్షంబున ధర్మజుం డి ట్లనియె. 251
చ. నగియును బొంకునందు వచనంబు, నధర్మువునందుఁ జిత్తముం
దగులదు నాకు నెన్నఁడును; ధర్ము వవశ్యము; నట్ల కావునన్‌
వగవక మాకు నేవురకు వారిజలోచనఁ గృష్ణ నీఁ దగుం
దగ దను నీ విచారములు దక్కి వివాహ మొనర్పు మొప్పుఁగన్‌.
252
వ. మఱియుం దొల్లి గౌతమి యయిన జటిల యను ఋషికూఁతురు తపఃప్రభావంబున నేడ్వురు ఋషులకు నొక్కతియ భార్య యయ్యె ననియును, దాక్షాయణి యను మునికన్యక యేకనామంబునఁ బ్రచేతను లనంబరఁగిన పదుండ్రకు నొక్కతియ భార్యయయ్యె ననియును గథల వినంబడు; మఱి యట్లుం గాక. 253
ఆ. ‘గురులలోనఁ బరమగురువు దల్లియ; యట్టి | తల్లి వచనమును, విధాతృకృతము
నన్యథాకరింప నలవియే?’ యనిన నం | దొఱకు నిట్టు లనియె ద్రుపదవిభుఁడు.
254
వ. ‘ధర్మసూక్ష్మత నిర్ణయింప మన కశక్యంబు; త్రిలోకవంద్యుండు త్రికాలప్రవర్తనవిజ్ఞాననిధి యీ కృష్ణద్వైపాయ నుండు విచారించి యెద్ది యాన తిచ్చె నదియ యిప్పుడు కర్తవ్యం’ బనిన విని యమ్మునివరుండు ద్రుపదున కి ట్లనియె. 255
సీ. ‘ధర్మతత్త్వజ్ఞుఁ డీ ధర్మతనూజుండు | ధర్మమార్గం బేల తప్పఁబలుకు?
దేవతామూర్తి యిద్దేవి మాధవి యేల | తా నెఱుంగక యనృతంబు పలుకు?
వీరల పలుకులు వేల్పుల మతమును | నొక్కండ కావున నొండు దక్కి
యీ యేవురకుఁ గూఁతు నిచ్చి వివాహంబుఁ | గావింపు; మఱి దీని కల తెఱంగు.
 
ఆ. వినఁగ నిష్టమేని విను ‘మని ద్రుపదు చే | యూఁది యింటిలోని కొనర నరిగి.
తాను నతఁడు నేకతమ యుండి, వాని కం | తయును జెప్పఁదొడఁగె ధర్మవిదుఁడు.
256
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )