ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
ద్రుపదునకు వేదవ్యాసుండు ఇంద్రసేనయను పతివ్రతకథ సెప్పుట (సం. 1-100-60)
వ. ఇది తొల్లి నాలాయని యైన యింద్రసేన యనంబరఁగిన పరమ పతివ్రత; మౌద్గల్యుం డను మహామునికి భార్య యయి, కర్మవశంబున నమ్మునిం గుష్ఠవ్యాధిబాధితత్వగస్థిభూతకష్టశరీరు వయోవృద్ధు వలిపలితధరు దుర్గంధవదను దుఃఖజీవు నతికోపను విశీర్యమాణనఖత్వచుం బరమభక్తి నారాధించి తదుచ్ఛిష్టంబు కుడుచుచున్న నొక్కనాఁడు. 257
తే. కుడుచునెడ వాని పెనువ్రేలు కూటిలోనఁ | దునిసి పడియున్న వ్రేల్‌ వుచ్చి తోయజాక్షి
యేవగింపక యుచ్ఛిష్ట మిష్టలీలఁ | దగిలి కుడుచుచున్నంత నత్తరుణిఁ జూచి.
258
వ. దానిదయిన పతిభక్తి గుణంబునకు మెచ్చి మౌద్గల్యుండు ప్రసన్నుం డయి ‘నీ కెద్ది యిష్టంబు వేఁడు మిచ్చెద’ ననిన నది యి ట్లనియె; ‘మునీంద్రా! నాకుం గామోపభోగేచ్ఛ పెద్ద గలదు; నీవునుం దపశ్శక్తిఁ గామరూప ధరుండ వయి యీ బీభత్సంబగు రూపం బుడిగి, మనోహరం బయిన రూపంబునం బంచధా విభక్తుండవయి నన్ను రమియించి కామభోగంబులం దనుపు’ మనిన దాని కిష్టంబైనవిధంబున నేను దేహంబులు దాల్చి మర్త్య దేవలోకంబులయందు బ్రహ్మర్షిదేవర్షిపూజితుం డై సూర్యరథం బెక్కి చని యాకాశగంగాజలంబుల నాప్లుతదేహుం డయి శీతాంశునంశు జాలంబుల వసియించి మేరుకైలాసంబులయందుఁ గ్రీడించుచు ననేకస్థానంబుల ననేక సహస్రవర్షంబులు నాలాయని యైన యింద్రసేన నుపభోగించి తృప్తుం డై, మౌద్గల్యుండు దాని విడిచి ఘోరతపంబు సేసి బ్రహ్మమయుం డై బ్రహ్మలోకంబునకుఁ జనిన; నది కామభోగములందుఁ దనియక కాలవశంబున శరీరము విడిచి కాశిరా జను రాజర్షికిం బుట్టి పెరుగుచుం గన్యాత్వమునఁ బెద్దకాలం బుండి తన దౌర్భాగ్యమునకు నిర్వేదించి, పతిం గోరి పశుపతి నుద్దేశించి యుగ్రతపంబు సేయుచున్నంత. 259
తే. దానికడకుఁ బ్రత్యేకంబ ధర్మవాయు | వాసవాశ్వినుల్‌ ప్రీతు లై వచ్చి దాని
నాత్మ దేహాంశజులకు దేహాంతరమునఁ | బత్నిగాఁ గోరి రధికసౌభాగ్యయుక్తి.
260
వ. అదియును గొండొకకాలంబు జలానిలాహార యై, కొండొకకాలంబు నిరాహార యై, కొండొకకాలం బేకపాదంబున నిల్చి, కొండొకకాలంబు పంచాగ్నిమధ్యంబున నుండి యత్యుగ్రతపంబు సేసిన నీశ్వరుండు ప్రసన్నుం డయి వరంబు వేఁడు మనిన, నక్కన్యక ‘నాకు బతిదానంబుఁ బ్రసాదింపు’ మని యర్థిత్వంబున నేనుమాఱులు వేఁడినం గరుణించి యీశ్వరుండు ‘నీకు దేహాంతరంబున నేవురుపతు లగుదు’ రనిన నది యి ట్లనియె. 261
ఆ. సతికి నొక్కరుండ పతిగాక యెందును | బతులు పలువు రవుట కతలఁ గలదె?
లోకనాథ! యిట్టి లోకవిరుద్ధంపు | వరము వడయ నమరవరద! యొల్ల.
262
వ. అనిన దానికి రుద్రుం డి ట్లనియె. 263
క. నా వచనంబున నీ క | య్యేవురు పతులందు ధర్ము వెడపకయుండుం
గావున నిట్టి వరం బిం | దీవరదళనేత్ర! యిచ్చితిని దయతోన్‌.
264
వ. ‘అనిన నది యట్లేని నయ్యేవురుపతులయందును బ్రత్యేకసంగమంబునను నాకుఁ గౌమారంబును బతిశుశ్రూషా సిద్ధియుఁ గామభోగేచ్ఛయు సౌభాగ్యంబునుం బ్రసాదింప వలయు’ ననిన రుద్రుండు దాని కోరిన వరంబు లెల్ల నిచ్చి, గంగాతీరంబున నున్న యింద్రు నాయొద్దకుం దోడ్కొని ర మ్మని పంచిన వల్లె యని. 265
క. దక్షాధ్వరమథనునకుఁ బ్ర | దక్షిణపూర్వముగ మ్రొక్కి తడయక చని ప
ద్మేక్షణ సహస్రచక్షుఁ బ్ర |తీక్షించుచు నుండె సురనదీతీరమునన్‌.
266
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )