ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
ద్రుపదునకు వ్యాసుండు పంచేంద్రోపాఖ్యానంబు సెప్పుట (సం. 1-189-1)
వ. అట వైవస్వతుండును నైమిశార్యణంబున సత్త్రయాగదీక్షితుం డయి ప్రాణిహింస సేయకుండుటం చేసి మానవు లప్రాప్తమరణు లయి వర్తించుచున్న దాని సహింపనోపక యింద్రాదిదేవతలందఱు బ్రహ్మపాలికిం జని ‘భట్టారకా! మర్త్యు లమర్త్యు లయి వర్తిల్లువా రయిన వారికిని మాకును విశేషం బెద్ది?’ యని దుఃఖించిన నయ్యమరుల కమరజ్యేష్ఠుం డి ట్లనియె. 267
క. ఎంతకుఁ గృతకార్యుం డగు | నంతకుఁ డీ రంతకును భయం బందక ని
శ్చింతమున నుండుఁ; డాతం | డంతము నొందించుఁ దొంటియట్టుల నరులన్‌.
268
క. ఆ వైవస్వతు వీర్యము | మీ వీర్యముఁ దాల్చి సూర్యమితతేజులు దా
రేవు రుదయింతు రాతని | కావించు విధానమునకుఁ గారణ మగుచున్‌.
269
వ. అనిన నమరపతి పురోగము లయిన యమరు లెల్ల నమరాపగాసమీపంబునకుం జనునప్పుడు, తత్సలిలమధ్యంబున నొక్కకన్యక యేడ్చుచున్న, దానికన్నీళ్ళు కనకకమలంబు లయినం జూచి వేల్పులుం దానును విస్మయం బంది, యింద్రుఁ డక్కన్యకయొద్దకుం జని ‘యేడ్చెద వెందుల దాన?’ వని యడిగిన నది యింద్రున కి ట్లనియె. 270
ఆ. ‘నాదు రోదనంబు, నన్ను, నెఱుంగఁగ | వలతయేని యమరవల్లభుండ!
నా పిఱుంద రమ్ము’ నావుడు నప్పు డ | వ్వనితపజ్జ నరిగె వాసవుండు.
271
వ. ఇ ట్లక్కన్యక పిఱుంద నరుగువాఁడు ముందఱ హిమవదచలకందరారచితరత్నవేదికాతలంబున సింహాసనాసీనుం డయి తరుణరూపంబున నొక్కతరుణితో జూదం బాడుచున్న యాదిదేవుం గని తరుణుండ కా వగచి సురపతి కరం బలిగి యి ట్లనియె. 272
మ. అమితస్థావరజంగమం బయిన బ్రహ్మాండంబు దా నింతయున్‌
మమతాగోచర మీ త్రిలోకములు నస్మద్బాహువజ్రానుపా
ల్యము; లే నింద్రుఁడ; నిట్టి న న్నుఱక లీలన్‌ జూదమాడంగ ను
త్తమసింహాసన మెక్క నీకుఁ జనునే దర్పించి నాముందటన్‌.
273
వ. అనిన రుద్రుం డలిగి రౌద్రాకారంబున వానిం జూచి ‘మదీయ క్రీడారసభంగంబుఁ జేసిన యిద్దుర్మదుం బట్టి తె’ మ్మని య క్కన్యకం బంచిన నప్పుడు దానికరస్పర్శనంబున విచేష్టితుం డయి మహీతలంబుపయిం బడిన యయ్యింద్రునకు రుద్రుం డి ట్లనియె. 274
క. ‘గర్వించి పలికి, తగు, నీ | గర్వము భుజవీర్యమును బ్రకాశంబుగ నీ
పర్వతవివరము దెర్చి వి | గుర్వింపుము చూత’ మనిన గోత్రభిదుండున్‌.
275
సీ. హరువచనమున నా గిరిరాజవివరంబు | గరములఁ బట్టి చెచ్చెర దినేశ
చండమయూఖముల్‌ రెండు విధంబు లై | యుండంగఁ దెర్చి యాఖండలుండు
దనయట్టివారల ఘనశరీరుల నందు | నలువుర నన్యుల వెలయఁ జూచి,
‘యే నిట్టు లేలొకో యేనుప్రకారంబు | లయితి నిం?’ దనుచు విస్మయముఁ బొంది
 
ఆ. యున్నఁ జూచి హరుఁడు గ్రన్న నయ్యింద్రుల | నేవురను మహానుభావ మెసఁగ
మనుజయోనిఁ బుట్టుఁ డని పంచె గీర్వాణ | హితము సేయుపొంటె మతిఁ దలంచి.
276
వ. ‘వారలు ధర్మానిలశక్రాశ్వినులు దమకు నాధారకర్తలుగా ధర్మజభీమార్జుననకులసహదేవు లనంగాఁ బుట్టిరి; కమలభవప్రముఖనిఖిలసురగణప్రార్థితుం డయి నారాయణుసితాసితకేశద్వయంబు బలదేవవాసుదేవు లై దేవహితార్థం బుద్భవించిన, నందు వాసుదేవుండు వారలకుఁ గార్యసహాయం డయ్యె; నయ్యింద్రుల కేవురకును నేకపత్నిగాఁ దపంబుసేసి శ్రీమూర్తి యయిన యాజ్ఞసేని యజ్ఞవేదిం బుట్టె; నమ్మవేని వీరల పూర్వదేహంబులఁ జూడు’ మని కృష్ణద్వైపాయనుండు ద్రుపదునకు దివ్యదృష్టి యిచ్చి చూపిన. 277
ఉ. చారు మణి ప్రభా పటల జాల విచిత్ర కిరీట మాలికా
భారములన్‌ సముద్యదినపావక వర్ణములన్‌ సువర్ణకే
యూర విభూషణావళుల నొప్పుచునున్న తదీయదేహముల్‌
ధీరుఁడు సూచెఁ దాళసమదీర్ఘతఁ బొల్చినవాని నేనిటిన్‌.
278
వ. మఱియు సకలలావణ్యమూర్తి యై వారల కేవురకుఁ బత్నిగాఁ దపంబు సేసిన యక్కన్యకపూర్వదేహంబును జూచి విస్మితుం డయి హర్షించి యున్న ద్రుపదునకు వెండియుం గృష్ణద్వైపాయనుం డి ట్లనియెఁ; ‘దొల్లి నితంతుం డను రాజర్షికొడుకు లనంతబలపరాక్రములు సాల్వేయ శూరసేన శ్రుతసేన బిందుసారాతిసారు లను వా రేవురుం బరస్పర స్నేహవినయంబుల నతిప్రసిద్ధు లయి పెరుఁగుచు నౌశీనరపతి కన్యక నజిత యను దాని స్వయం వరంబునఁ బడసి వివాహం బయి. 279
క. కాంతి విశేష విలాసా | నంతశ్రీఁ దనరు నజితయం దనఘులు నై
తంతువు లేవురుఁ బడసిరి | సంతానము వేఱువేఱ సత్కుల మెసఁగన్‌.
280
వ. ‘తొల్లింటి మహాత్ములయందును నిట్టి చరితంబులు గలవుం గావున బాండవుల కేవురకు ద్రౌపదిం గ్రమంబునఁ బాణిగ్రహంబు సేయింపు; మిది మన చేసినయది గాదు; దైవాధిష్ఠితం’ బని ద్రుపదు నొడంబఱచి కుంతియుఁ, బాండవులు నున్న చోటికి ద్రుపద సహితుం డయి కృష్ణద్వైపాయనుండు వచ్చి యుధిష్ఠిరున కి ట్లనియె. 281
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )