ఇతిహాసములు భారతము ఆదిపర్వము - సప్తమాశ్వాసము
ద్రౌపదీవివాహమహోత్సవము (1-190-5)
ఆ. నేఁడు పుణ్యదినము నెమ్మితో రోహిణీ | యుక్తుఁ డయి శశాంకుఁ డున్నవాఁడు;
మంత్రవంతముగఁ గ్రమంబున నేవురుఁ | బెండ్లియగుఁడు కృష్ణఁ బ్రీతితోడ.
282
వ. అని నిశ్చయించి పంచినం బాంచాలపతియును గరం బనురాగంబునఁ బురం బష్టశోభనంబు సేయించి, సమారబ్ధవివాహమహోత్సవుం డయ్యె; నంత నిరంతర క్రముకకదళీస్తంభ శుంభత్సంభృత నవామ్రాశ్వత్థ పల్లవ మాలాలంకృత ద్వారతోరణంబులను, జందనోదక సంస్తిక ప్రాంగణ రంగవల్లీ కృత కర్పూరమౌక్తిక ప్రకరంబులను, గౌతుకోత్సవమంగళశృంగార వారాంగనా ప్రవర్త్యమాన స్వనియోగకృత్యంబులను, నుత్సవ సందర్శనాగతానేకరాజన్య సుహృద్బాంధవబ్రాహ్మణ సంకులంబుననుం జేసి యొప్పుచున్న ద్రుపదరాజ మందిరంబునం బూర్వోత్తర దిగ్భాగంబున విచిత్రనేత్ర వితత వితాన ముక్త మౌక్తిక కుసుమ మాలాలంబనాభిరామంబును, సమీచీన చీనాంశుక విరచితస్తంభ వేష్టనంబును, బ్రత్యగ్ర పల్లవ శాల్యక్షతాంచిత కాంచన పూర్ణ కలశోపశోభితంబును, లాజాజ్య సంపూర్ణ సౌవర్ణ పాత్ర నవసౌరభ బహువిధపుష్ప సమిత్కుశాశ్మశమ్యాభిరమ్యంబును, నవగోమయ శ్యామ మరకత మణి ప్రభాపటల విలిప్త హిరణ్మయవేదీమధ్యసమిద్ధాగ్నికుండమండితంబును, సర్వాలంకారసుందరంబును నయిన వివాహ మంటపంబునకుం జని నిజ పురోహితుం డయిన ధౌమ్యుం డాదిగా ననేకవిద్వన్మహీసుర నివహంబుతోఁ గరం బొప్పి. 283
సీ. అనఘులు కృతమంగళాభిషేకులు, ధృత | సముచిత వేష ప్రశస్త రత్న
భూషణుల్‌, కౌరవపుంగవు లేవురు | నేతెంచి; రంతఁ బూర్ణేందువదన
యధికవిదగ్ధ పుణ్యాంగనా విరచిత | లలిత ప్రసాధనాలంకృతాంగి
కమలాక్షి కమనీయకాంతాసహస్రంబు | తోఁ జనుదెంచె నాద్రుపదతనయ;
 
ఆ. భూరి భూసురేంద్ర పుణ్యాహరవమును | మంగళ ప్రగీత మధురరవము
వివిధతూర్యవేణు వీణారవంబును | విస్తరిల్లె దిశల విభవయుక్తి.
284
క. వితత ప్రదక్షిణావ | ర్తితదీప్త శిఖానలమున ధృతి వేల్చెఁ బురో
హితుఁ డగు ధౌమ్యుఁడు బుధ స | మ్మతుఁడు వివాహప్రయుక్త మంత్రాహుతులన్‌.
285
వ. ఇట్లు వేల్చి ముందఱ ధర్మపుత్రునకు ద్రుపదరాజపుత్త్రిం బాణిగ్రహణంబు సేయించి, తొల్లి యేవురకు వివాహంబు సేయునప్పుడు కన్యాత్వంబు దూషితంబు గాకుండ నీశ్వరువరంబునం గౌమారంబు వడసిన యక్కన్యకం గ్రమంబున భీమార్జున నకుల సహదేవులకుం బాణిగ్రహణంబు సేయించిన. 286
తే. జనుల ఆశీరవంబును జదలఁ దివురు | దేవ దుందుభినాదంబు దివ్యగంధ
మందగంధవహామోదమానకుసుమ | వృష్టియును మహాముదముతో విస్తరిల్లె.
287
వ. అని వైశంపాయనుండు జనమేజయునకుం జెప్పె నని. 288
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )