ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
పాండవులు ద్రుపదరాజుపురంబున నిష్టోపభోగంబు లనుభవించుచు సుఖంబుండుట (సం. 1-190-25)
వ. అ క్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె; నట్లు పాండవు లేవురకుం బాంచాలిం బరమోత్సవంబున వివాహంబు సేయించి ద్రుపదుం డయ్యేవురకు వేఱువేఱ యనర్ఘ్యమణిఖచితంబులైన యాభరణంబులను నపరిమితంబు లైన యర్థరాసులను, సౌవర్ణంబు లయిన శయ్యాసనపరికరంబులను, నూఱేసిభద్రగజంబులను, నూఱేసి కాంచనరథంబులను, వేయేసికాంభోజహయంబులను, పదివేవురేసి వరవస్త్రాభరణభూషితు లగు దాసదాసీజనంబులను, నూఱేసివేలు పాఁడిమొదవులను నగ్నిసాక్షికంబుగా నరణం బిచ్చిన. 2
క. చతురుదధివలయ నిఖిల | క్షితితలసామ్రాజ్యలక్షి క్మిని మూలం బై
సతి యాజ్ఞసేని పతులకు | నతిముద మొనరించెఁ దుల్యమగు శుశ్రూషన్‌.
3
సీ. కోడలి యుత్తమ గుణముల కెంతయు | సంతుష్టచిత్త యై కుంతిదేవి
‘లలితాంగి! హరియందు లక్ష్మిని, మఱి చంద్రు | నందు రోహిణి, నింద్రునందు శచిని
నవ్వసిష్ఠమునీంద్రునం దరుంధతిఁ బోలి | సుందరి! నీపతులందుఁ బ్రీతిఁ
బతిభక్తి యొప్ప నపత్యంబుఁ బడయుము; | గురు వృద్ధబాంధవాతుర విశిష్ట
 
ఆ. జనుల నతిథిజనుల సతతంబుఁ బూజింపు, | మన్నదానమున ధరామరేంద్ర
వరులఁ దనుపు, మఖిలవసుమతీప్రజ కెల్లఁ | గరుణ గలుగు మమ్మ కమలనేత్ర!
4
ఉ. పూని పరాక్రమం బెసఁగ భూతలనాథుల నోర్చి, వీరు లై
యీ నవఖండమండితమహీతల మేలుచు, నీపతుల్‌ పయో
జానన! రాజసూయమఖ మాదిగ నధ్వరపంక్తి సేయుచో
మానుగఁ బత్ని వీ వగుము మానితధర్మవిధానయుక్తితోన్‌.
5
క. ‘ఇందీవరలోచన! నీ | యం దే నభినందితాత్మ నైనట్టులు నీ
నందనులయందుఁ బౌత్రుల | యందును నభినంద్య వగుమ’ యని దీవించెన్‌.
6
వ. అట వాసుదేవుండు ద్రౌపదిని బాండవు లేవురు వివాహం బగుట విని సంతసిల్లి, వా రేవురకు వజ్ర వైడూర్య మరకత మౌక్తిక విభూషణంబులును, నానాదేశవిచిత్రవస్త్రంబులును, ననేకకరితురంగరథరత్న శిబికావిలా సినీనివహంబులుం బుత్తెంచిన. 7
చ. విలసిత రాజ్యలీలఁ బరవీరభయంకరు లై గుణంబులన్‌
వెలయుచుఁ బాండవుల్‌ విదితవిక్రము లుండుటఁజేసి దేవతా
దులవలనన్‌ భయంబు ద్రుపదుం డెఱుఁగండ; తదీయదేశముల్‌
దలరక యొప్పె రోగ భయ తస్కర డామర వర్జితంబు లై.
8
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )