ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
చారులవలన పాండవుల యభ్యుదయమును విని దుర్యోధనుఁడు నిర్వేదించుట (సం. 1-191-1)
వ. ఇట్లు పాండవులు ద్రుపదుపురంబున నఖిలరాజ్యవిభవసమన్వితు లయి యొక్క సంవత్సరం బుండునంత నంతయు నెఱింగి దుర్యోధనగూఢచారు లరిగి కర్ణదుశ్శాసనసౌబలసోమదత్తపరివృతుం డయి యున్న దుర్యోధనునకు మ్రొక్కి యి ట్లనిరి. 9
సీ. కర్ణశల్యులు మొదల్‌గాఁ గల భూపతు | లత్యంత బలవంతు లస్త్రవేదు
లుద్ధతుల్‌ మోపెట్టనోపని చాప మ | శ్రమమున మోపెట్టి, చదలఁ దిరుగు
నయ్యంత్ర మేసి, మీయందఱముందరఁ | గృష్ణఁ దోడ్కొని యొక్క కృష్ణవర్ణుఁ
డెక్కటి రణములో నేపునఁ గానీను | నోడించి జయలీల నున్న యాతఁ
 
ఆ. డర్జునుండు; మఱిమహాబాహుబలమున | శల్యుఁ ద్రెళ్ల వైచి శత్రువరుల
నెల్లఁ దల్లడిల్ల నెగచిన యాతండు | భీమసేనుఁ డమితభీమబలుఁడు.
10
చ. ‘అనిమొన నట్లు దాఁకిన మహారథులన్‌ ధృతరాష్ట్రరాజనం
దనుల బలాఢ్యులన్‌ దళితదర్పులఁ జేసినవారు ధర్శనం
దనయము లుగ్రవీరు’ లని తద్విధమంతయు నేర్పడంగఁ జె
ప్పిన విని కౌరవప్రభుఁడుఁ బెల్కుఱి తద్దయు దుఃఖితాత్ముఁ డై.
11
వ. ‘అక్కట! పురోచనుం డొక్కరుండ లక్కయింట దగ్ధుం డయ్యెం గా కేమి; దైవానుకూల్యంబు లేక మానుషం బెంతయయ్యు నేమి సేయుఁ; బాండవు లేమిదైవసంపన్నులైరో యని వగచి, యీ యవసరంబున ద్రుపదు భేదించి పాండవుల నుత్సాదింపవలయు నె ట్లనిన. 12
ఉ. యాదవవృష్ణిభోజవరు లందఱుఁ బాండవపక్షపాతు; ల
చ్చేదివిభుండు వారలన చేకొనువాఁడగు; వీరలెల్ల నా
త్మోదయవృద్ధి పొంటెను దదున్నతిఁ గోరుదు; రట్లు గావునన్‌
భేదము సేయఁగావలయుఁ బెల్చన యందఱుఁ గూడకుండఁగన్‌.
13
వ. అని దుర్యోధనుండు పాండవ పాంచాల విభేదనోపాయంబుఁ జింతించుచుండె; నంత విదురుండు పాండవాభ్యుదయంబును బాంచాలీస్వయంవరంబును దుర్యోధనాదులు భగ్నదర్పు లగుటయు విని సంతసిల్లి, పాండవులు ద్రుపదరాజపుత్త్రిం బెండ్లి యై ద్రుపదుపురంబున సుఖంబున్న వా రని ధృతరాష్ట్రునకుం జెప్పిన నతం డి ట్లనియె. 14
ఆ. యజ్ఞసేనుకూఁతు నభిజాత నాతని | యజ్ఞవేది నుదిత యయినదాని
ననఘవిధి వివాహ మయి పాండునందనుల్‌ | మిగుల మిత్రబలసమృద్ధు లయిరి.
15
క. కొడుకుల యభ్యుదయము విని | కడు సంతస మయ్యె నిపుడు; కౌరవకుల మే
ర్పడ వెలిఁగె నెల్లరాజుల | నొడిచిన భుజవీర్యమున మహోత్సాహమునన్‌.
16
వ. అని విదురునకు మనఃప్రియంబుగాఁ బలికి, యంతఃపురంబునకుం జని యంతస్తాపం బేర్పడకుండ నుండునంత; గర్ణ దుర్యోధనులు ధృతరాష్ట్రు పాలికిం జని యి ట్లనిరి. 17
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )