ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
దుర్యోధనుఁడు తండ్రితోఁ బాండవపాంచాలవిభేదనోపాయంబు నాలోచించుట (సం. 1-192-25)
క. రేయును బగలును విదురుఁడు | నీయొద్దన యునికిఁజేసి నేరము పలుకన్‌
మాయిష్టం బెఱిఁగింపఁగ | ధీయుత! యెడఁ గంటి మిన్ని దివసంబులకున్‌.
18
క. విదురుఁడు పాండవహితుఁ డని | మొదలన యెఱిఁగియును నతి విమోహంబున న
వ్విదురువచనంబ నిలుపుదు | హృదయంబున; నతఁడు పెద్దయిష్టుఁడు మీకున్‌.
19
వ. అనిన వారలకు ధృతరాష్ట్రుం డి ట్లనియె. 20
సీ. ‘పలుకులఁ జెయ్వులఁ బాండవులకుఁ బ్రీతి | గలయట్ల యుండుదుఁగాని నాదు
హృదయంబు విదురున కెన్నండు నెఱిఁగింప | నేను మీతలఁచిన యివ్విధంబ
తలఁచుచు నుండుదు; దైవసంపద గల | వారలఁ బాండవవరుల నేమి
సేయంగ నగు? నెద్ది చెప్పుఁ డిష్టం బింక?’ | ననిన విచిత్రవీర్యాత్మజునకు
 
ఆ. దుష్టచేష్టితుండు దుర్యోధనుం డిట్టు | లనియెఁ ‘జిత్తగింపు మవనినాథ!
పాండురాజసుతులఁ బాంచాలపతియొద్ద | నుండకుండఁ జేయు టుచిత మిపుడు’
21
వ. అది యె ట్లనినం బుత్త్ర మిత్త్ర బాంధవ బలసంపన్నుం డైన ద్రుపదునొద్దఁ బాండవు లుండువా ‘రైన వారలం గృష్ణబలదేవులు యదువృష్ణిభోజాంధకవర్గములతో వచ్చి కూడిన నెవ్వరు సాధింపనోపరు; గావున, నెడసేయక ద్రుపదుండు పాండవుల విడుచునట్లుగా భేదింత; మొండె, వలనుగలవారలం బంచి కౌంతేయమాద్రేయులను దమలో విరక్తు లగునట్లుగాఁ జేయింత; మొండె నతిలలితప్రమదాజనంబులఁ బ్రత్యేకంబ యేవురకుం బ్రయోగించి ద్రౌపదివలన విరక్తిఁ బుట్టింత; మొండె, నేవురకు నొక్కతియ యా లగుట కష్టం బని ద్రోవదిఁ బాండవులవలన విగత స్నేహఁ గావింత; మొండె, నుపాంశుప్రయోగంబుల భీము వధియించి తక్కినవారల బలహీనులం జేయుదము. 22
ఆ. గాడ్పుచూలి పిఱుఁదుఁ గావంగ నర్జును | నోర్వ నమరులైన నోప రాజి;
నతఁడు నిహతుఁ డగుడు నశ్రమంబునఁ | బార్థు నొక్కరుండ కర్ణుఁ డోర్వ నోపు.
23
వ. ‘ఈ యుపాయంబులలో నెయ్యది యుచితంబును నపగతదోషంబును నదీర్ఘసూత్రంబును నగు నట్టి దానిం జెచ్చెర ననుష్ఠించు నది’ యనినఁ గర్ణుం డి ట్లనియె. 24
సీ. ఆర్యవృత్తుండు రాజాన్వయసమ్మతుఁ | డభిమతసంబంధుఁ డయినవాఁడు
గుణవంతు లగుచున్న కొడుకులు గలవాఁడు | పాంచాలుఁ డేల యప్పాండుసుతుల
వినయసంపన్నుల విడుచువాఁడగు?; మఱి | పాండునందను లేకపత్నియంద
కర మనురక్తులు గావునఁ దమలోన | నేల భేదిల్లుదు?; రెన్నఁడయ్యు
 
ఆ. నొక్కసతికిఁ బతులు పెక్కండ్రు రగు టిది | సతులకోర్కిగాన యతివ కృష్ణ
సుందరాంగి వారియం దేల యపరక్త | యగు మనోముదంబుఁ దగులుఁ గాక.
25
వ. మఱి భీమసేనుండు దొల్లి మీచేసిన యుపాంశువధల నేమి యయ్యె? నింకను నట్ల కావున నీ యుపాయప్రయోగంబు లన్నియు నుడిగి యిప్పుడ పాండవులయందు విక్రమంబు ప్రయోగించుట కార్యంబు. 26
చ. ఘన మగు విక్రమంబునన కాదె జగత్త్రితయంబుఁ బాకశా
సనుఁడు జయించె; భూతలము సర్వము మున్‌ భరతుండు విక్రమం
బునన జయించె; విక్రమము భూరి యశఃప్రియు లైన రాజనం
దనులకు సర్వసాధనము, ధర్మువు శత్రునిబర్హణంబులన్‌.
27
వ. ‘కావునఁ జతురంగ బల సాధనసన్నద్ధుల మయి యుద్ధంబునం బాంచాలు భంజించి పాండవుల నొండుగడ నుండనీక తోడ్కొనితెత్త’ మనినఁ గర్ణుపలుకు లాకర్ణించి ధృతరాష్ట్రుం ‘డిది యకార్యం బగు; నయినను మతిమంతులతో విచారించి చేయుద మని భీష్మద్రోణవిదురశల్యకృపాశ్వత్థామసోమదత్తాదులం బిలువంబంచి యంతయు నెఱింగించిన భీష్ముండు దుర్యోధనుం జూచి యి ట్లనియె. 28
మత్తకోకిల. ధీరు లౌ ధృతరాష్ట్రపాండు లతిప్రశస్తగుణుల్‌ ప్రసి
ద్ధోరుకీర్తులు; నాకు నిద్దఱు నొక్కరూప; తలంపఁగా
వీరు వా రను నట్టిబుద్ధివిభేద మెన్నఁడు లేదు గాం
ధారిపుత్త్రశతంబునందుఁ బృథాతనూజులయందునున్‌.
29
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )