ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
భీష్మద్రోణులు దుర్యోధనునకు బుద్ధి సెప్పుట (సం. 1-195-1)
వ. అ ప్పాండవులతోడి విగ్రహంబుసేఁత కెన్నండును నొడంబడనేరఁ; బితృపైతామహం బయిన రాజ్యంబునకు నీయట్లు వారు నర్హులు; గావున వారికి నర్ధరాజ్యం బిచ్చిన నీకును నీ బాంధవులకును లోకంబులకును బ్రియం బగు; నట్లు గానినాఁ డపకీర్తి యగుఁ; గీర్తి నిలుపుటయ కాదె రాజులకు జన్మఫలంబు. 30
ఆ. కీర్తి లేనివానికిని జీవనంబు ని | రర్థకంబ చూవె! యవనిమీఁద
నిత్య మయిన ధనము నిర్మల కీర్తియ; | యట్టి కీర్తి వడయు టశ్రమంబె?
31
క. ఇలఁ గీర్తి యెంత కాలము | గలిగి ప్రవర్తిల్లె నంతకాలంబును ని
త్యుల కారె కీర్తి గల పు | ణ్యులు; కీర్తివిహీనుఁ డెందునుం బూజ్యుండే.
32
వ. ‘కీర్తియు నపకీర్తియు జనులకు స్వర్గ నరక నిమిత్తంబులు గావున, నపకీర్తి పరిహరించి, కీర్తిం బ్రతిష్ఠించి, పైతృకం బగు రాజ్యంబు పాండవుల కిచ్చి, వారితోడ బద్ధప్రణయుండవయి కీర్తి నిలుపు’ మనిన భీష్ముపలుకులకు సంతసిల్లి ద్రోణుండు దుర్యోధనున కి ట్లనియె. 33
చ. బహుగుణ ముత్తమోత్తమము పథ్యము ధర్మ్యము సాధుసమ్మతం
బహిత బలప్రమాథివిపులార్థయుతం బగుటన్‌ భవత్పితా
మహువచనంబుఁ జేకొనుము; మానుగ వారలతోడ నీవు వి
గ్రహ మొనరింప నేమిటికిఁ గౌరవసౌబలకర్ణశిక్షలన్‌.
34
మ. విలసద్ధర్మవిశుద్ధవృత్తులు వయోవృద్ధుల్‌ కుశాగ్రీయబు
ద్ధులు మధ్యస్థులు కార్యనిర్ణయసమర్థుల్‌ మానమాత్సర్యదూ
రులు నాఁ జాలినవారిపల్కులకు వైరుద్ధ్యంబు గావించున
జ్ఞులు భూనాథున కాప్తులున్‌ సఖులు నై శోషింతు రత్యంతమున్‌.
35
చ. తనరుచు దైవయుక్తి మెయి ధర్మువు సత్యముఁ దప్పకున్న య
య్యనఘుల పైతృకం బయిన యంశము మిన్నక వజ్రపాణి కై
నను గొనఁబోలు నయ్య కురునందన! పాండుతనూజు లున్న వా
రని విని వారికిం దగు ప్రియం బొనరింపక యున్కి ధర్మువే?
36
వ. ‘వారితో విగ్రహించుట కార్యంబు గాదు; ‘కావునఁ బాండవద్రుపదధృష్టద్యుమ్నకుంతీద్రౌపదులకుఁ బ్రియపూర్వకంబున నుచితభూషణాంబరావళులు వేఱు వేఱ యిచ్చిపుచ్చి, పాండవుల నిందులకుఁ దోడ్కొనివచ్చువారుగా దుశ్శాసనవికర్ణ ప్రభృతుల సమకట్టి పంపు’ మనిన ద్రోణుపలుకు లవకర్ణించి కర్ణుం డి ట్లనియె. 37
తే. ముదుసళులు దమ కిమ్ముగాఁ జదివికొండ్రు | గాక పతులకు హిత మగు కర్జ మేల
యొలసి చెప్పుదు? రహితుఁ గలపికొనుట | ధర్ము వని; రిది నయవిరుద్ధంబు గాదె?
38
వ. ‘మంత్రులు దమ తమ బుద్ధిదోషంబులు నెట్లునుం బలుకుదురు. వారల సాధుత్వంబును నసాధుత్వంబును నెఱుంగవలయు; నె ట్లనినఁ దొల్లి నితంతు వను మగధరాజు వికలేంద్రియవర్గుం డయి శ్వాసమాత్రంబ తక్కి రాజ్యతంత్రంబునం దసమర్థుం డై యున్న నాతనిమంత్రి యేకప్రధానుం డయి రాజ్యతంత్రం బెల్లఁ దనవశంబ యగుటంజేసి వాని నవమానించి తదీయరాజ్యవిభవం బెల్లఁ జేకొనియె; వాఁడును విక్రమహీనుం డయి రాజ్యంబు గోల్పడియెం; గావున మంత్రులు హితులపోలె నుండి యహితం బాచరింతురు; మీ యిద్దఱపలుకులు మాకుం జూడ నహితంబు’ లనిన నలిగి వానికి ద్రోణుం డి ట్లనియె. 39
క. ఉడుగక యే మహితముఁ బలి | కెడు వారము; నీవు హితవు క్రియ గొనఁగాఁ బ
ల్కెడు వాఁడవు; మాకంటెను | గడు హితుఁడవు నీవ కావె కౌరవ్యులకున్‌.
40
క. నీకఱపుల నిక్కురుకుల | మాకులతం బొందు టేమి యాశ్చర్యము? సౌ
మ్యాకృతులు గానివారల | వాకులు శిక్షలు నుపద్రవంబుల కావే!
41
వ. అనుచున్న సమయంబున నయ్యిద్దఱ వారించి విదురుండు ధృతరాష్ట్రున కి ట్లనియె. 42
సీ. ధర్మార్థవిత్తముల్‌ తథ్యవాదులు వయో | వృద్ధులు మధ్యస్థవిమలమతులు
ద్రోణగాంగేయులు దురితవిదూరులు | ని న్నెద్దిగఱపిరి నెమ్మితోడ
దానిన చేయుట ధర్మువు; వారల | కంటె హితుల్‌ నీకుఁ గలరె యొరులు;
దుర్యోధనుండును దుశ్శాసనుండును | గర్ణుండు శకునియుఁ గరము బాలు;
 
ఆ. రెఱుఁగ రిదియు ధర్ము విది యధర్మం బని; | యట్టివారిపలుకు లాదరించి
వినక పాండుసుతుల వేగ రావించి వా | రలకుఁ బ్రీతి నర్ధరాజ్య మిమ్ము.
43
మ. తమకుం దార యజేయు లెవ్వరికి దోర్దర్పంబునన్‌, దానిపై
శమితారాతి బలుండు వారలకుఁ బాంచాల ప్రభుం డిప్డు సు
ట్టము దా నయ్యెఁ; దదాత్మజుండయిన ధృష్టద్యుమ్నుడున్‌ వారితో
సమవీర్యుం డొడఁగూడె నిష్ట సఖుఁ డై సంబంధబంధంబునన్‌.
44
మ. బలదేవాచ్యుతసాత్యకుల్‌ దమకు నొప్పన్‌ మిత్రులుం గూర్చు మం
త్రులుఁగా దైవము మానుషంబుఁ గల నిత్యుల్‌, నీకు దుర్యోధనా
దులకంటెం గడుభక్తు లెంతయు వినీతుల్‌, వీరు లప్పాండుపు
త్త్రులు నీపుత్త్రుల కారె! వారిఁ దగునే దూరస్థులం జేయఁగన్‌.
45
ఉ. ఆహవభూమిలోనఁ బరమార్థము పార్థుఁడు వైరివాహినీ
వ్యూహము వ్రచ్చుచోట మఘవుండును వానికి మార్కొనంగ ను
త్సాహముసేయఁ డన్న; లఘుసారు లధీర లసాహసుల్‌ నిరు
త్సాహులు ద్రోహులై యెదిరి చత్తురొ మందురొ మానవేశ్వరా!
46
ఉ. ఆయతబాహుఁ డాతనికి నగ్రజుఁ డగ్రణి పోరులందు నా
గాయుతసత్త్వుఁ డుద్ధతయుగాంతకృతాంతనిభుండు భీముఁ డ
వ్వాయుజసవ్యసాచుల నవార్యబలోన్నతిఁ బోలుచున్న మా
ద్రేయు లజేయు లెవ్వరికి దేవసముల్‌ సమరాంతరంబునన్‌.
47
క. తమ్ములయట్టుల తనకు వ | శమ్మయి ధర్మువును ధృతియు సత్యముఁ గారు
ణ్యమ్మును నొప్పఁగఁ బేర్మి ని | జమ్ముగ మను ధర్మజున కసాధ్యము గలదే!
48
వ. ‘వారల బలపరాక్రమంబు లెల్లవారికి దృష్టపూర్వంబుల; యట్టివారితోడ విగ్రహంబు సేయు దుర్బుద్ధులుం గలరె? నీపుణ్యమ్మున నమ్మహాత్ములు జననీసహితంబు లక్కయింట బ్రతికిరి; నీయందుఁ బురోచనదిగ్ధం బయిన దుర్యశః పంకంబుఁ బాండవానుగ్రహజలంబులం జేసి కడిగికొనుము; దుర్యోధనాపరాధంబున నఖిల మహీప్రజకు నపాయం బగు నని తొల్లియు నీకుం జెప్పితి; నట్లు గాకుండ రక్షింపు’ మనిన ధృతరాష్ట్రుండు విదురున కి ట్లనియె. 49
క. నీవును భీష్ముఁడు ద్రోణుఁడు | భూ వినుత విశుద్ధ ధర్మబుద్ధుల రగుటన్‌
మీ వచనమున కవజ్ఞత | గావింపఁగ నంత కార్యగతి మూఢుఁడనే?
50
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )