ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
పాండవులను దోడ్తేర ధృతరాష్ట్రుండు విదురునిఁ బంచుట (సం. 1-198-3)
వ. ‘మీపంచినవిధంబున నప్పాండవుల కర్ధరాజ్యం బిచ్చెద’ నని భీష్మవిదురద్రోణాదు లయిన బాంధవప్రధానులయు దుర్యోధనాదు లయిన పుత్త్రులయు సమక్షంబున నిశ్చయించి, యప్పుడ పాండవులం దోడ్తేర విదురుం బంచిన, నాతండును ధృతరాష్ట్రుశాసనంబున ద్రుపదుపురంబునకుం జని, పుత్త్రభ్రాతృపరివృతుం డై యున్న ద్రుపదుని వాసుదేవసహితులై యున్న పాండవులనుం గాంచి ధృతరాష్ట్రుండు పుత్తెంచిన వివిధరత్నభూషణాదుల వేఱువేఱ యిచ్చి తానును వారిచేతఁ బ్రతిపూజితుం డై కేశవపాండవసమక్షంబున విదురుండు ద్రుపదున కి ట్లనియె. 51
మ. అభిజాతుండవు ధర్మశీలుఁడవు నీయం దైన సంబంధ మిం
దభిరమ్యం బనురూప మిష్ట మని సౌహార్దంబునన్‌ జాహ్నవీ
ప్రభవుండున్‌ ధృతరాష్ట్రుఁడుం గృపుఁడుఁ గుంభప్రోద్భవుండున్‌ యశో
విభవాలంకృత! సంతసంబువడి రుర్వీవంద్యు లిష్టంబునన్‌.
52
ఉ. తల్లియుఁ బుత్త్రులేవురు నుదాత్తమతుల్‌ దమయొద్ద వాసినం
దల్లడమంది యందఱును దద్దయు దుఃఖితచిత్తు లైరి, నీ
యల్లురఁ బాండుపుత్త్రులఁ బ్రియంబునఁ జూడఁగఁ గోరుచున్న వా
రెల్ల జనంబులుం గురుకులేశ్వరుఁ డాదిగ బంధువర్గమున్‌.
53
క. గురుగుణయుతు లగు కొడుకులఁ | గురుకులము వెలుంగ నయిన కోడలిఁ గృష్ణం
బరమపతివ్రత గొంతిని | గరుణను రాఁ బనిచె రాజు గజపురమునకున్‌.
54
వ. ‘నీచేత ననుజ్ఞాతు లై కాని వీరలు రా నేరరు గావున వీరలం బుత్తెంచు నది’ యనిన విదురునకు ద్రుపదుం డి ట్లనియె. 55
చ. రవినిభతేజుఁ డైన ధృతరాష్ట్రుఁడు పంపఁగ నీవు కార్యగౌ
రవమున వచ్చినప్పుడ తిరంబుగ వీరికి నిష్టసిద్ధి దా
నవు టది యేమి సందియమె; యంబుజనాభుఁడు నీవుఁ బాండవ
ప్రవరుల కెల్లప్రొద్దును శుభంబ తలంతురుకాదె నెమ్మితోన్‌.
56
క. నీవును ద్రోణుండును వసు | దేవతనూజుండు భీష్మధృతరాష్ట్రులు స
ద్భావమున నెద్ది సేయం | గా వగచితి రది హితంబ కా కొం డగునే?
57
వ. అనిన వాసుదేవుం డి ట్లనియె. 58
క. ఎవ్వరును నేమి సేయుదు | రివ్విదురుఁడు పాండవులకు హిత మొనరింపన్‌
నెవ్వగ నొండు దలంపకుఁ | డివ్వీరుల కగు నభీష్ట మిది మొదలుంగాన్‌.
59
వ. అనిన నందఱకు ధర్మనందనుం డి ట్లనియె. 60
క. కురు ముఖ్యులు ధృతరాష్ట్రవి | దుర భీష్ములు గురులు మాకు; ద్రుపదప్రభుఁడున్‌
గురుఁడు; మురాంతకుఁడు జగ | ద్గురుఁ; డిందఱ మతమునను నగున్‌ శుభయుక్తుల్‌.
61
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )