ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
పాండవులు హస్తిపురంబునకు వచ్చుట (సం. 1-199-10)
వ. అని యుధిష్ఠిరుండు వారి యనుమతంబు వడసి, తమ్ములు దానును హస్తిపురంబునకుఁ బోవ నిశ్చయించి, ద్రుపదు వీడ్కొని ప్రయాణోన్ముఖుం డయ్యె; నిట్లు విదురుండు పాండవులఁ బాంచాలిని గుంతీదేవినిం దోడ్కొని వాసుదేవ ధృష్టద్యుమ్ను లపరిమిత సేనాసమన్వితు లై తోడ రాఁగా వచ్చునంత, వారలరాక విని ధృతరాష్ట్రుండు వికర్ణ చిత్రసేన ద్రోణ కృపాచార్యుల నెదురు పుత్తెంచినం దత్‌సైన్యసమేతులయి మహోత్సవంబుతోఁ బాండవులు గజపురప్రవేశంబు సేయునప్పుడు వారలం జూచి. 62
సీ. పుర జను లెల్లను గర మనురక్తు లై | ‘ధర్మస్వరూపుఁ డీ ధర్మతనయుఁ
డనుజులుఁ దానును జనుదెంచెఁ; బాండుభూ | జనపతి జీవించి మనలఁ గావఁ
బ్రీతితోఁ దా నిప్పు డేతెంచె, మే లయ్యె; | నిమ్మహాత్ములకు దైవమ్ముఁ బురుష
కారంబుఁ గలుగంగ ధారుణీరాజ్యంబు | వాయునే యాపదల్‌ వాయుఁగాక;
 
ఆ. దాన హోమ జప విధానముల్‌ మన కివి | గలవయేని ధరణివలయరాజ్య
మింద యుండి ధర్మనందనుఁ డొనరించు | చుండుఁ గావుతమ యఖండితముగ.
63
వ. అని పౌరులెల్ల దీవించుచుండఁ బౌరవకులనందను లయిన పాండునందనులు వచ్చి, భీష్మధృతరాష్ట్రాది కురువృద్ధులకు మ్రొక్కి, సకలజనానురాగం బొనరించుచు దుర్యోధనాదులతోఁ గలసి యెప్పటియట్ల రాజ్యవిద్యా వినోదంబుల నేను సంవత్సరంబు లుండు నంత, నొక్కనాఁడు ధృతరాష్ట్రుండు భీష్మవిదురద్రోణ దుర్యోధనాదుల సమక్షంబునఁ బాండవుల కి ట్లనియె. 64
ఆ. సర్వలోక కర్మసాక్షి, యీకృష్ణుండు | సాక్షి గాఁగ మీకు సకలవృద్ధ
రాజు లొద్ద నర్ధరాజ్య మిచ్చితిఁ బాండు | రాజవిభవ మెల్ల రమణఁ గొనుఁడు.
65
వ. అని ధర్మరాజు నభిషిక్తుం జేసి. 66
క. ‘నెమ్మిఁ జని ఖాండవప్ర | స్థమ్ము నివాసమ్ముఁ జేసి తద్దయు ననురా
గ మ్మెసఁగ నుండుఁ డందుఁ ది | రమ్ముగ’ నని పనిచెఁ బాండురాజాత్మజులన్‌.
67
వ. పాండవులును ధృతరాష్ట్రుశాసనంబునను, భీష్మాదులయనుమతంబునను వాసుదేవసహితు లయి ఖాండవప్రస్థమ్మునకుం జని రంత. 68
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )