ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
విశ్వకర్మ యింద్రప్రస్థపట్టణమును నిర్మించుట (1-199-28)
క. హరి యింద్రుఁ దలఁచె; నింద్రుఁడు | కర మనురాగమున విశ్వకర్మను బనిచెన్‌
‘సురపురమున కెన యగు పుర | మరుదుగ నిర్మింపు ముర్వి’ నని కడుఁ బ్రీతిన్‌.
69
సీ. ద్వైపాయనుండును ధౌమ్యుండు నాదిగా | భూసురుల్‌ సూత్రవిన్యాస మమరఁ
జేసి, శాంతికవిధుల్‌ సేయంగ, సుప్రశ | స్తం బైన రమ్యదేశంబునందు,
వాసవాదిష్టుఁ డై వసుధకు నేతెంచి | పేర్మితో నవ్విశ్వకర్మ పురము
నిర్మించె, నదియును నిరుపమలీలలఁ | దనరి యింద్రప్రస్థ మనఁగ నింద్రు
 
ఆ. పురముతోఁ గుబేరుపురముతో వరుణేంద్రు | పురవరంబుతోడ నురగరాజ
పురవిభూతితోడ నురువిలాసంబుల | సరి యనంగ నొప్పు ధరణిమీఁద.
70
ఉ. ఇమ్ముగ విశ్వకర్మ రచియించిన కాంచన హర్మ్య తుంగ శృం
గమ్ముల రశ్మిరేఖలు ప్రకాశములై కడుఁ బర్వి, తత్సమీ
పమ్మునఁ బాఱుచున్న ఘన పంక్తులయం దచిరద్యుతి ప్రతా
నమ్ములఁ గ్రేణి సేయుచు ననారతమున్‌ విలసిల్లుఁ దత్పురిన్‌.
71
చ. అలఘుతరంబు లై తుహినహారిసుధారుచి నిందురోచిరా
కులశశికాంతవేది పృథుకుంజగళ జ్జలనింఝరంబులన్‌
విలసిత జాహ్నవీ విమలవీచి విలోల లసత్పతాకలం
బొలుపగుఁ దత్పురీభవనముల్‌ హిమశైలముఁ బోలి యున్నతిన్‌.
72
చ. వననిధిలోని రత్నములు వాసుకిమూర్ధజరత్నసంఘముల్‌
గొనఁగ నవశ్యమున్‌ జనులకున్‌ సమకూరదు గాన నెప్పుడుం
గొనుఁడు పరార్థ్యరత్నములు గోరినవానిన యిత్తు మన్తెఱం
గునఁ బచరింతు రంగడులఁ గోమటు లప్పురి నిద్ధరత్నముల్‌.
73
సీ. వలరాజు సచివుల వడువున బెడఁగగు | కర్కశస్తనములఁ గరమువాఁడి
చూడ్కుల నతిరాగసురుచిరాధరముల | మదవిలాసాలసమందగతుల
వక్రాలకంబుల వలుఁదపిఱుందుల | దర్పగద్గదభాషితములఁ జేసి
జనులచిత్తములకు సంక్షోభ మొనరించు | కామినీజనములు గలిగి, సకల
 
తే. కామభోగములకు సదేకాంతగృహముఁ | బోలి పొలిచియు, ధర్మార్థములకు నిదియ
యాస్పదంబు నా వర్గత్రయావిరుద్ధు | లైన జనుల కెంతయు నొప్పు నప్పురంబు.
74
క. శరనిధినినాదనిభ మగు | పురఘోషముఁ గీడుపఱిచి పొలుపగుఁ గర మ
ప్పురి బ్రహ్మపురి మహీసుర | వరవేదాధ్యయనరవ మవార్యం బగుచున్‌.
75
చ. పరిఘజలంబులం దమలపంకరుహోత్పలకైరవాదిసుం
దరకుసుమంబులున్‌ ఘనపథంబున నుజ్జ్వలతారకానిరం
తరకుసుమంబులున్‌ వెలయుఁ దత్పురవప్రము పాదపీఠికా
శిరముల కొప్ప నర్చనలు సేసిన పువ్వుల యవ్విధంబునన్‌.
76
చ. తమము నడంచుచున్‌ వెలుఁగుతత్పురగోపురశాతకుంభకుం
భముల విచిత్రసన్మణిగభస్తివితానములన్‌ విచిత్రవ
ర్ణములగు నాత్మవాహముల నమ్మక పల్మఱుఁ జూచి యన్యవా
హము లని సంశయప్రణిహితాత్ముఁ డగున్‌ హరిదశ్వుఁ డెప్పుడున్‌.
77
చ. సరళ తమాల తాల హరిచందన చంపక నారికేళ కే
సర కదలీ లవంగ పనస క్రముకార్జున కేతకీలతా
గరుఘనసార సాల సహకార మహీరుహరాజ రాజి సుం
దర నవనందనావళులఁ దత్పురబాహ్యము లొప్పుఁ జూడఁగన్‌.
78
మ. అనిలం బప్పురిఁ బౌరచిత్తముల కత్యానంద మొందంగ నం
దిని యన్నేటితరంగలం బెనఁగుచున్‌ దివ్యద్రుమాకీర్ణ నం
దనసందోహముఁ దూఱుచున్‌ వికచకేతక్యాదినానాలతాం
తనవామోదముఁ బొందుచున్‌ సుడియు నిత్యంబుం గరం బిష్ట మై.
79
వ. ఇట్టి యింద్రప్రస్థపురంబున నింద్రవిలాసంబుతో వ్యాసవాసుదేవానుమతుం డై ధర్మతనయుండు ధౌమ్యపురస్సర మహీసురప్రవరవేదఘోషంబులు, సకలజనాశీర్వాదనాదంబులు, మృదుమధుర మంగళ సంగీత రవంబులు, వివిధ తూర్యధ్వనులు నతిసమృద్ధంబులై యెసంగ వర్గచతుష్టయంబునుం బోని యనుజవర్గంబుతో శుభముహూర్తం బునం బురప్రవేశంబు సేసి సర్వప్రకృతిజనానురాగకరుం డయి. 80
చ. అనుజులు నల్వురుం దనకు నత్యనురాగమునన్‌ విధేయు లై
తనరుచు నుండ వేదవిహితం బగు యజ్ఞమపోలె సర్వపా
వనశుభమూర్తి యై భువనవంద్యుఁడు ధర్మపరుండు ధర్మనం
దనుఁడు ధరాధిరాజ్యము ముదంబునఁ జేయుచునుండెఁ బేర్మితోన్‌.
81
సీ. అనఘు వేదాధ్యయనాసక్తు నారభ్య | మాణమహాధ్వరు మనుచరిత్రు
సర్వవర్ణాశ్రమసంరక్షణక్షము | సత్యసంధాను నజాతశత్రు
భరతవంశోత్తముఁ బ్రభు ధర్మనందను | రాజుఁగాఁ బడసి సురాజ యయ్యె
వసుధ, యధిష్ఠానవతి యయ్యె మఱి లక్ష్మి | బంధుమంతం బయ్యెఁ బరమధర్మ,
 
ఆ. మన్నరేంద్రునందు నాపూర్ణతరశర | దైందవాతపంబునందుఁ బ్రీతి
సమమ కా సమస్తజనులచిత్తంబు లా | నందరసభరంబు నొందఁ దాల్చె.
82
క. ధరణిప్రజ ధర్మసుతు సు | స్థిరనిర్మలధర్మచరితఁ జేసి రుజా త
స్కరపరరాష్ట్రవిబాధలఁ | బొరయక సంతతసమృద్ధిఁ బొందె విభూతిన్‌.
83
క. తనరిరి తద్దేశంబున | ననవరతము యజనయాజనాధ్యయనాధ్యా
పనదానములుఁ బ్రతిగ్రహ | మును నను షట్కర్మములను భూసురవంశ్యుల్‌.
84
క. పంబి యజనాధ్యయన దా | నంబుల వర్తిల్లె బ్రాహ్మణప్రియ మయి ధ
ర్మ్యం బయి క్షత్రియవైశ్యకు | లం బవిరతపుణ్యకర్మలాలస మగుచున్‌.
85
క. పరమద్విజశుశ్రూషా | పరు లయి శూద్రాదు లవనిఁ బరగిరి ధర్మ
స్థిరమతు లయి ధర్మజు ధ|ర్మరాజ్య మభివృద్ధిఁ బొందె మహిమాన్విత మై.
86
వ. అంత. 87
క. ‘నారదుఁడు వచ్చుఁ; దద్వచ | నారంభుల రగుఁడు మీర’ లని కఱపి మహో
దారుఁడు వారల వీడ్కొని | నారాయణుఁ డరిగెఁ దత్‌క్షణమ తనపురికిన్‌.
88
వ. పాండవులును పరాక్రమ, ప్రణయ, వశీకృతాఖిలరాజన్యు లయి సుఖం బుండు నంత నొక్కనాఁడు. 89
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )