ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
నారదుఁడు పాండవులపాలికి వచ్చుట (సం. 1-200-8)
తరలము. ప్రవిమలాగమతత్త్వవేది తపఃప్రభాసి జగత్త్రయీ
శివకరుండు హితోపదేశము సేయఁగాఁ గడువేడ్కతో
దివిజవంద్యుఁడు ప్రీతితోఁ జనుదెంచె నారదుఁ డంబుజో
ద్భవతనూజుఁడు భానుతేజుఁడు పాండవేయులపాలికిన్‌.
90
మానిని. తమ్ములుఁ దానును ధర్మతనూజుఁడు తత్‌క్షణసంభృతసంభ్రముఁ డై
యమ్మునినాథవరేణ్యునకున్‌ వినయమ్మున మ్రొక్కి సమున్నతపీ
ఠమ్మున నుంచి యథావిధి పూజ లొడంబడఁ జేసి మునీశ్వర నె
య్యమ్మున నీ విట వచ్చుటఁజేసి కృతార్థుల మైతిమి యిందఱమున్‌.
91
వ. ‘మాపుణ్యంబునంజేసి భవద్దర్శనంబు సంభవించె’ నని పరమప్రీతిహృదయులై పలికి, పరమభక్తిం బాంచాలి మ్రొక్కించి యున్నంత, నందఱ నాశీర్వచనంబుల నభినందించి వారల కుశలం బడిగి నారదుండు ద్రౌపదిం బోవం బనిచి, వా రేవురకు నేకాంతంబున ని ట్లనియె. 92
సీ. సర్వధర్మజ్ఞుల రుర్వీశపూజ్యుల | రన్యోన్యనిత్యసౌహార్దయుతుల
రగణితగుణయుక్తిఁ బొగడంగఁ దగువార | లిట్టి మీ కేవుర కిపుడు ద్రుపద
సుత యొక్కతియ ధర్మమతి ధర్మపత్ని యై | నది; యీక్రమంబు లోకాగమంబు
లందు విరుద్ధ; మీసుందరికారణం | బున మీకు విప్రీతి పుట్టకుండ
 
ఆ. నుండవలయుఁ; బ్రియసహోదరుల్‌ దొల్లి సుం | దోపసుందు లొక్కయువతి కడరి
విగ్రహించి యసురవీరులు దమలోనఁ | బొడిచి మృత్యునిలయమునకుఁ జనిరి.
93
క. అనిన నది యెట్టు లని యమ | తనయుఁడు గడువేడ్కతోడఁ ద న్నడిగిన నా
తనికిఁ దదీయానుజులకు | నినసన్నిభుఁ డమ్మునీంద్రుఁ డి ట్లని చెప్పెన్‌.
94
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )