ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
సుందోపసుందోపాఖ్యానము (సం. 1-201-1)
వ. తొల్లి దితిపుత్త్రుండైన హిరణ్యకశిపువంశంబున నికుంభుం డనువానికి సుందోపసుందు లన నిద్దఱుగొడుకులు పుట్టి, నియతాత్ములయి తపంబునన కాని సర్వంబునుం బడయంగా దని యేకనిశ్చయులై, వింధ్యాచలంబున కరిగి నిగృహీతేంద్రియు లై నిదాఘకాలం బెల్లఁ బంచాగ్నిమధ్యంబున నిలిచి, వానకాలంబును శీతకాలంబును జలాశయంబుల వసియించి, మఱియు వాయుభక్షులు నేకపాదస్థితులు నూర్ధ్వబాహులు నధోముఖులును నై పెద్దకాలంబు తపంబు సేసిన. 95
సీ. వారిదారుణతపోవహ్నిదాహంబున | వింధ్యాద్రిదరుల నావిర్భవించి,
యత్యుచ్చ మయి ధూమ మాకాశమెల్లను | గప్పిన, నమరులు గరము వెఱచి,
రత్నంబులను వధూరత్నంబులను జేసి | తత్తపోవిఘ్నవిధాననిరతు
లయి ప్రబోధింపంగ నలవిగాకున్నఁ, దో | యజుగర్భుపాలికి నరిగి యసుర
 
ఆ. వరులతపముఁ జెఱుపవలయు నావుడుఁ, గమ | లాసనుండు త్రిభువనార్చితుండు
సురహితంబుపొంటె సుందోపసుందుల | కడకు వచ్చె వరము కరుణ నీఁగ.
96
వ. ఇట్లు పితామహుండు సుందోపసుందులతపంబునకు మెచ్చి సన్నిహితుం డయి ‘మీ కిష్టం బైన వరం బిచ్చెద వేఁడుం’ డనిన వారలు వారిజాసనునకు ముకుళితకరకమలు లయి ‘దేవా! మాయిష్టంబు దయసేయ మీ కిష్టం బేని, మాకుఁ గామరూపత్వంబును గామగమనత్వంబును సకలమాయావిత్వంబును నన్యులచేత నవధ్యత్వంబును నమరత్వంబునుం బ్రసాదింపుం’ డనిన. 97
ఆ. కమలభవుఁడు వారి కమరత్వ మొక్కటి | దక్కఁ గోర్కులెల్ల నక్కజముగఁ
గరుణ నిచ్చె, నిట్లు సరసిజగర్భుచే | వరము వడసి యసురవరులు పెఱిగి.
98
క. అనుపమరాజ్యవిభూతిం | దనరి జగద్విజయకాంక్ష దైత్యులకు ముదం
బొనరఁగ నకాలకౌముది | యను నుత్సవ మొప్పఁ జేసి రగణితబలు లై.
99
క. సురగరుడోరగకిన్నర | పురములు వడిఁ జూఱకొనుచు భూలోకమునం
బరఁగిన రాజర్షి మహీ | సురవరులకు బాధసేయుచును గర్వమునన్‌.
100
క. ద్విజవరవినిర్మితము లగు | యజనస్వాధ్యాయకవ్యహవ్యతపోదా
నజపంబులఁ బితృదేవత | లజస్రమును దృప్తు లగుదు రని కడునలుకన్‌.
101
వ. పుణ్యవంతుల నిత్యనైమిత్తికకర్మంబులకు విఘ్నంబులు సేయుచు, సింహవ్యాఘ్రగజరూపధరు లై వనంబులం దిరుగుచు, మునిపల్లియలు సొచ్చి మునులకుఁ బ్రాణభయంబు సేయుచున్న వారలక్రూరకర్మంబులకు వెఱచి వేల్పులును మునులును బురాణముని యైన బ్రహ్మపాలికిం జని కృతాంజలు లయి జగంబులకు సుందోపసుందులు సేయు నుపద్రవంబులు సెప్పిన విని విశ్వగురుండు విస్మితుం డయి వార లన్యులచేత వధ్యులు గారు గావున పరస్పర యుద్ధంబునఁ బంచత్వంబుఁ బొందవలయు నని విచారించి, విశ్వకర్మ రావించి ‘రూపలావణ్యవతియైన యొక్క యువతి సృజియింపు’ మని పంచినఁ బ్రసాదం బని మ్రొక్కి యప్పుడు. 102
పృథ్వీవృత్తము. తిలాణుమణికోటి సంఘటిత దివ్యదేహంబుతోఁ
దిలోత్తమ యనంగ నొక్కయువతీలలామంబు ను
త్పలాక్షి నొనరించె సర్వగుణభాసిరూపక్రియా
కలావిదుఁడు విశ్వకర్మ తనకౌశలం బేర్పడన్‌.
103
వ. అదియును సురేంద్రప్రముఖ బృందారక మునిబృంద పరివృతుండై యున్న పరమేష్ఠికిం బరమభక్తిం బ్రణమిల్లి పనియేమి యని ముందట నిలిచిన, నరవిందసంభవుం డాసుందరిం జూచి ‘సుందోపసుందు లను దైత్యులు దర్పితు లయి జగంబుల కహితంబులు సేయుచు వింధ్యాచలకందరంబున నున్నవారు; వార లిద్దరు నీకారణంబునం దమలో నొండొరులతోఁ బొడిచి దండధరుపురంబున కరుగునట్లుగాఁ జేయు’ మని పంచిన వల్లె యని. 104
సీ. అబ్జజు వీడ్కొని యది దేవసభకుఁ బ్ర | దక్షిణం బొనరించెఁ; దత్‌క్షణంబ
తద్రూపసౌందర్యదర్శనలోలుఁ డై | యజుఁడు నాలుగుదిక్కులందుఁ దనకు
గావించుకొనియె ముఖంబులు; మఱిరెండు | కన్నులఁ జూచినం గాదు తృప్తి
యని సురేంద్రుండు సహస్రాక్షుఁ డయ్యె; న | య్యమరులు కామమోహాంధు లైరి;
 
ఆ. ముదిత యిట్లు సర్వమోహిని యై మర్త్య | భువనమునకు మెఱుఁగుఁ బోలె నొప్పి
యరుగుదెంచె సుందరాంగి వింధ్యాచల | విపినదేశ మెల్ల వెలుఁగుచుండ.
105
క. అమ్ముదితఁ జూచి యన్నయుఁ | దమ్ముఁడు నొక్కట మనోజతాడితు లై, రా
గమ్మున నన్యోన్యస్నే | హమ్ములు చెడి దృష్ట్టు న్లిలిపి రయ్యువతిపయిన్‌.
106
క. ఘను లయ్యిరువురు నేకా | సనభోజనయాననిలయశయనక్రియలం
దనరెడువా రేకస్త్రీ | వినిహితకాము లయి రపుడు విధినియమమునన్‌.
107
క. ఇది నావల్లభ యిది నా | హృదయేశ్వరి యనుచుఁ గోరి యిరువురు మదనో
న్మదు లయి పరిగ్రహించిరి | తదీయ కమనీయ సవ్యదక్షిణకరముల్‌.
108
వ. ఇట్లు పట్టుకొని 109
క. ‘సుందరి! మాయిద్దఱలో | నిం దెవ్వరి వలతు చెప్పు మీ’ వనవుడుఁ బూ
ర్ణేందుముఖి వారి కను ‘మీ | యం దెవ్వఁడు వొడిచి యొడుచు నతనిన వలతున్‌’.
110
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )