ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
నారదప్రేరితులయి పాండవులు సమయము సేయుట (సం. 1-204-27)
సీ. అనిన నారదమహామునిపల్కు చేకొని | దమలో నొడంబడి విమలబుద్ధి
నేవురయందును ద్రోవది ప్రీతితో | నొక్కొక్కయింట దా నొక్కయేఁడు
క్రమమున నుండను; గమలాక్షి యెవ్వరి | యింటఁ దా నుండె నయ్యింటివలనఁ
బెఱవారు చనకుండ; నెఱుఁగక చనిరేని | వెలయఁగఁ బండ్రెండునెలలు తీర్థ
 
ఆ. సేవ సేయుచును విశేషవ్రతంబులు | ధీరవృత్తిఁ జలుపువారుగాను
సన్మునీంద్రునొద్ద సమయంబు సేసిరి | రాజనుతులు పాండురాజసుతులు.
115
వ. ఇట్లు హితోపదేశంబు సేసి నారదుం డరిగినం బాండవులు దమచేసినసమయస్థితిం దప్పక సలుపుచు సుఖంబుండఁ; గొండొకకాలంబున కొక్కనాఁ డొక్కబ్రాహ్మణుండు మ్రుచ్చులచేతఁ దనహోమధేనువు గోల్పడి వచ్చి యాక్రోశించిన, నశ్రుతపూర్వం బయిన యయ్యాక్రోశంబు విని విస్మితుం డయి విజయుండు విప్రులకయిన బాధ దీర్పక యుపేక్షించుట పాతకం బని యప్పుడ యవ్విప్రు రావించి ‘యిది యేమి కారణం?’ బని యడిగిన నర్జునునకు విప్రుం డి ట్లనియె. 116
క. యమతనయు ధర్మరాజ్యము | తమరాజ్యమ యని మహాముదంబున విప్రో
త్తము లున్నచోటనే బ | న్నమువడి కోల్పడితి గోధనము మ్రుచ్చులచేన్‌.
117
సీ. ‘వదలక మ్రుచ్చుల వధియించి నాహోమ | ధేనువుఁ గ్రమ్మఱఁ దెచ్చియిమ్ము
జననుత! దానివత్సంబు నిన్నటఁగోలె | నుడుగక యఱచుచునున్నయదియ;
పలుకుల కెడ లేదు; బాణాసనము గొని | చనుదెమ్ము నాతోడఁ జట్ట’ ననిన
ద్రౌపదీసహితుఁ డై ధర్మరాజాయుధా | గారంబునం దున్న గార్ముకంబుఁ
 
ఆ. బుచ్చికొనఁగఁ దనకుఁబోలమి యెఱిఁగియు | విప్రునార్తరవము వినఁగ నోప
కర్జునుండు నిజశరాసనగ్రహణార్థ | మాయుధాలయమున కరిగె నపుడు.
118
క. ‘ధరణీసురవరులకుఁ గడు| సెరగై నెడ నెఱిఁగి యెడయుఁ జేయుదురె మహా
పురుషు’ లని నరుఁడు విలుగొని | యరిగెను మ్రుచ్చులపిఱుంద నవ్విప్రుపనిన్‌.
119
వ. ఇ ట్లరిగి యర్జునుం డతివీరు లయిన చోరుల వధియించి, బ్రాహ్మణునకు గోధనంబు నిచ్చి క్రమ్మఱి వచ్చి ధర్మజునకు మ్రొక్కి, ‘లోకంబులమర్యాదలు విచారించి రక్షించుచున్న మనయందు మర్యాదాభంగం బయ్యె నను నింతకంటె దుర్యశం బొండెద్దియు లేదు గావున నాకు ద్వాదశమాసికవ్రతంబు సలుపవలయు’ నని పోవ సమకట్టి యున్న నర్జునునకు యుధిష్ఠిరుం డి ట్లనియె. 120
ఆ. క్రూర కర్ము లయ్యు గో బ్రాహ్మణుల కగు | బాధ లుడుచుజనులఁ బాపచయము
లెట్టియెడలఁ బొంద వింద్రనందన! నీకు | సమయభంగభీతిఁ జనఁగ నేల?
121
వ. ‘మఱి యట్లుంగాక తస్కరవధోపేక్షల నశ్వమేధ భ్రూణహత్యల ఫలం బగు నని వేదంబులయందు వినంబడుఁ; దస్కరుల వధియించి బ్రాహ్మణహితంబు చేసినవాఁడవు; నీకు సమయోల్లంఘనప్రాయశ్చిత్తంబు సేయ నేల?’ యనిన నర్జునుం డి ట్లనియె. 122
క. భూజనపరివాదం బ | వ్యాజంబునఁ బరిహరింపవలయును మనకున్‌
వ్యాజమున ధర్మలోపం | బాజిజయా! పరిహరింతురయ్య మహాత్ముల్‌.
123
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )