ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
ఉలూచి యర్జునునిఁ గామించుట (సం. 1-206-12)
సీ. వేల్వంగ సమకట్టి వెలువడ నున్న న | య్యింద్రనందను రుచిరేంద్రనీల
సుందరశ్యామాంగు సురరాజకరికరా | కారమహాబాహుఁ గఱ్ఱిఁ జూచి
నలినాక్షి యం దొక్కనాగకన్యక కామ | పరవశ యై వానిఁ బట్టి తిగిచి
కొని నాగపురమునకును జని నిజరమ్య | హర్మ్యంబునందు నెయ్యమున నునిచె;
 
ఆ. నందు నగ్ని తొంటియట్టు లభ్యర్చితం | బయి వెలుంగుచున్న నర్జునుండు
హోమకార్య మొప్ప నొనరించి యప్పు డ | య్యింతిఁ జూచి నగుచు నిట్టు లనియె.
128
క. ‘తామరసనేత్ర! నీ పే | రేమీ? యెవ్వరితనూజ; వి ట్లేల మహా
వ్యామోహిత వై?’ తనవుడుఁ | గోమలి సురరాజపుత్త్రకున కి ట్లనియెన్‌.
129
వ. ఏ నులూచి యను నాగకన్యక; నైరావతకులసంభవుం డయిన కౌరవ్యుకూఁతుర; నిన్నుం జూచి మనోజబాణబాధిత నయితి; నామనోరథంబు సలుపుము. 130
క. నీ గుణములు దొల్లియు నా | గీగీతములందు విని తగిలి యిపుడు మనో
రాగమునఁ జూడఁ గంటిని | భాగీరథియందు నిన్నుఁ బరహితచరితా!
131
వ. అనిన దాని కర్జునుం డి ట్లనియె. 132
మధ్యాక్కర. ద్వాదశమాసికవ్రతము సలుపుదుఁ దరుణి! మాయన్న
యాదేశమునఁ జేసి సర్వతీర్థము లాడుచు బ్రహ్మ
వాదులసంగతి బ్రహ్మచర్యసువ్రతుఁడ నై యుండి
నీదుమనోరథ మెట్లు సలుపంగనేర్తు నే నిపుడు?
133
వ. అనిన నవనతానన యయి నాగకన్యక యర్జునుం జూచి ‘ ద్రుపదరాజపుత్త్రియందు మీచేసిన సమయంబును, భవత్తీర్థాగమననిమిత్తంబును వ్రతంబును నెఱుంగనిదానఁ గాను; సర్వతీర్థసేవనంబును సర్వవ్రతంబులు సలుపుటయును సర్వదానధర్మక్రియలును బ్రాణదానంబుతో సమానంబులు గావు; నామనోరథంబు విఫలం బయిన మనోజానలంబునం బ్రాణపరిత్యాగం బగుం గావున నన్ను రక్షింపుము; దీన నీకు వ్రతభంగంబు గా’ దనిన నర్జునుండు దానిమనోరథంబు సలిపి యారాత్రి నాగభువనంబున వసియించి నాగకన్యకయందు సద్యోగర్భంబున నిరావంతుం డను కొడుకుం బడసి, నాగలోకంబు వెలువడి యాదిత్యోదయంబుతోడన గంగాద్వారంబునకు వచ్చి, తద్‌వృత్తాంతం బంతయుఁ దనసహాయు లయిన విప్రులకుం జెప్పి, వారలకు హృదయానందంబు సేయుచు. 134
క. వితతయశుఁ డరిగి హిమప | ర్వతపార్శ్వంబున నగస్త్యవటమును నత్యు
న్నతభృగుతుంగముఁ జూచుచు | ధృతి నేఁగి హిరణ్యబిందుతీర్థంబునకున్‌.
135
వ. అందును గోదాన భూదాన హిరణ్యదానంబు లాదిగాఁ బెక్కుదానంబులు సేసి, యజ్ఞార్థంబుగా భూసురోత్తములకు గోసహస్రంబు లిచ్చి, ప్రాగ్దేశంబున కరిగి నైమిశారణ్యంబునందు జగన్నాథునారాయణు నారాధించి యుత్పలినియుఁ గౌశికియు నందయు నపరనందయు గయయు గంగయు గంగాసాగరసంగమంబును జూచుచు. 136
క. ఏలావనరమ్యము లగు | వేలావనములను బవనవిచలద్వీచీ
లాలితసముద్రవిద్రుమ | మాలాపులినస్థలముల మసలుచు లీలన్‌.
137
వ. కళింగవిషయంబు సొచ్చు నంతఁ దోడిబ్రాహ్మణులు కొందఱు కళింగద్వారంబునఁ గ్రమ్మఱి యుత్తర కురుదేశంబులకుం జనిన; నందుం గతిపయబ్రాహ్మణసహాయుం డయి పార్థుం డరిగి పూర్వసముద్రతీరంబునఁ బురుషోత్తమదేవరకు నమస్కరించి మహేంద్రపర్వతంబు చూచుచు. 138
సీ. దక్షిణగంగ నాఁ దద్దయు నొప్పిన | గోదావరియు, జగదాది యైన
భీమేశ్వరంబును, బెడఁగగుచున్న శ్రీ | పర్వతంబును జూచి, యుర్విలోన
ననఘ మై శిష్టాగ్రహారభూయిష్ఠ మై | ధరణీసురోత్తమాధ్వరవిధాన
పుణ్యసమృద్ధమై పొలుచు వేంగీదేశ | విభవంబుఁ జూచుచు విభుఁడు దక్షి
 
తే. ణాంబురాశితీరంబున కరిగి, దురిత | హారి యైన కావేరీమహాసముద్ర
సంగమంబున భూసురేశ్వరుల కభిమ | తార్థదానంబుఁ జేసి కృతార్థుఁ డగుచు.
139
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )