ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
అర్జునుండు చిత్రాంగదను వివాహంబగుట (సం. 1-207-14)
వ. పదుమూఁడగు మాసంబున మణిపూరపురంబునకుంజని, యందున్న రాజుఁ జిత్రవాహనుం గని, వానిచేతం బూజితుం డయి, తత్పుత్త్రిఁ జిత్రాంగద యనుదాని వివాహంబుగా నపేక్షించిన, నయ్యర్జునునభిప్రాయం బాప్తులవలన నెఱింగి చిత్రవాహనుం డర్జునున కి ట్లనియె. 140
క. ధన్యుండ నైతి నీ కీ | కన్యక నీఁ గాంచి; యైనఁగలతెఱఁగు జగ
న్మాన్య! యెఱిఁగింపవలయు; న | నన్యమనస్కుండ వయి దయన్‌ విను మనఘా!
141
క. మా కులమునందుఁ దొల్లి ప్ర | భాకరుఁ డను రాజవరుఁ డపత్యము దనకున్‌
లేకున్న నుమేశ్వరునకుఁ | బ్రాకటముగ భక్తితోఁ దపం బొనరించెన్‌.
142
వ. పరమేశ్వరుండును వానికిం గరుణించి నీకు నొక్కపుత్త్రుం డుద్భవించు; నీకులంబున వారికెల్ల సంతానం బిట్ల యగు నని వరం బిచ్చిన; నది మొదలుగా మావంశంబునవారికెల్ల నొక్కొక్కపుత్త్రుండ కా జన్మించుచు వచ్చిన నిప్పుడు నాకు నిక్కన్యక పుట్టె; నేను దీనిం బుత్త్రీకరణంబునం బెనిచితి. 143
తే. ఇందుఁ బుట్టినసుతుఁడు మా కిందువంశ్య! | వంశవిస్తారకుండు గావలయు; నిదియ
యీలతాంగికి నుంకు; వి ట్లీఁగనోపు | దేని పెండిలియగుమ యీయింతిఁ బ్రీతి.
144
వ. అనిన నర్జునుండు చిత్రవాహనువచనంబున కొడంబడి చిత్రాంగద వివాహం బై. 145
ఉ. అంగజరాజ్యలక్షి పొడవైనదియొక్కొ యనంగ నొప్పు చి
త్రాంగదయందుఁ బార్థుఁడు మహాప్రణయప్రవణాంతరంగుఁ డై
యంగజభోగసంగమున నమ్మణిపూరపురిన్‌ సమస్తలో
కాంగణరంగసంగతవిహారయశోంగదుఁ డుండె లీలతోన్‌.
146
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )