ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
అర్జునుండు పంచతీర్థంబులం దప్సరసలను శాపవిముక్తుల నొనరించుట (సం. 1-208-1)
వ. ఇట్లుండి యొక్కనాఁడు తపోధనబ్రాహ్మణసమేతుం డై తత్సమీపంబున సముద్రతీరతీర్థంబులు చూచుచుం జని సౌభద్రం బను తీర్థంబుఁ గని యందు స్నానంబు సేయ సమకట్టిన నర్జునుం జూచి యందుల మును లి ట్లనిరి. 147
తరలము. ఇది సొరంగ నసాధ్య మెవ్వరి కిందువంశవరేణ్య! వి
న్మిదియ కా దివి యేనుతీర్థము లీసముద్రతటంబునన్‌
విదితముల్‌ దురితాపహంబులు వీని నెన్నఁడు నాడనో
డుదురు సన్మును లిందుఁ గోల్మొసళుల్‌ గొనున్‌ వడిఁ జొచ్చినన్‌.
148
వ. ‘సౌభద్ర పౌలోమ కారంధమ ప్రసన్న భారద్వాజంబు లను నామంబుల దక్షిణసముద్ర తీరంబునం బ్రసిద్ధంబు లయిన యిప్పంచతీర్థంబు లిప్పుడు నూఱేండ్లంగోలె నుగ్రగ్రాహగృహీతంబు లయి దుర్జనగృహీతంబు లయిన రాజులవిభవంబులుంబోలె సాధుజనవర్జితంబు లయి యుండు’ ననిన విని విజయుం ‘డశేషతీర్థసేవార్థి నయి వచ్చిన నాకు నీతీర్థంబు లాడకునికి పౌరుషంబు గా’ దని యందు. 149
క. సాహసికుం డై నరుఁ డవ | గాహము సేయుటయు జలము గ్రక్కదల మహా
గ్రాహము బీభత్సు బృహ | ద్బాహుబలుం బట్టికొనియెఁ బఱతెంచి వడిన్‌.
150
ఆ. దాని నశ్రమమునఁ దజ్జలాశయము వె | ల్వడఁగ వైచె నరుఁడు బాహుశక్తి;
నదియుఁ దత్‌క్షణంబ యభినవ యౌవనో | ద్భాసమాన దివ్యభామ యయ్యె.
151
ఉ. ఆ లలితాంగిఁ జూచి నరుఁ డద్భుత మంది ‘మృగాయతాక్షి! యి
ట్లేల జలేచరత్వమున నిజ్జలధిన్‌ వసియించి? తిప్పు డి
ట్లేల సురూప భామ వయి? తెందులదానవు నీవు?’ నావుడున్‌
బాలిక పాండుపుత్త్రునకుఁ బార్థున కి ట్లనియెం బ్రియంబునన్‌.
152
వ. ‘ఏను వంద యను నప్సరసఁ, గుబేరుననుంగ; నాసఖులు సౌరభేయియు సమీచియు బుద్బుదయు లతయు ననువారలు నలువురు నాయట్ల యత్తీర్థంబులం దున్నవారలు; వారిని శాపవిముక్తలం జేసి రక్షింపు’ మనిన దానికి నర్జునుం డి ట్లనియె. 153
క. ‘వనజాక్షి! యేమికారణ | మున నుగ్రగ్రాహరూపములు దాల్చితి రీ?’
రని యడిగిన వేడుక నా | తని కది యి ట్లనుచుఁ జెప్పెఁ దద్విధమెల్లన్‌.
154
వ. వినవయ్య! యే మేవురము నఖిలలోకపాలపురంబులు చూచుచు భూలోకంబునకు వచ్చి యొక్క వనంబునం దుగ్రతపంబు సేయుచున్నవాని నత్యంతశాంతు నేకాంతచారి నగ్నికల్పు నొక్కబ్రాహ్మణుం గని వానితపంబునకు విఘ్నంబు సేయ సమకట్టి. 155
క. వేడుక నమ్ముని ముందటఁ | బాడితి మాడితిమి; పెక్కుపరిహాసంబుల్‌
రూఢిగఁ బలికితి; మెట్లుం | జూడఁడు మావలను; నీరసుం డన నుండెన్‌.
156
క. ధృతిహీనులచిత్తము ల | ట్లతివలయం దేల తగులు నత్యంతదృఢ
వ్రతులమనంబులు వారల | మతులఁ దృణస్త్రైణములు సమంబుల కావే.
157
వ. ఏము రాగకారణవికారంబులు గావించిన నవి దనకుం గోపకారణంబు లయిన నతికుపితుం డయి బ్రాహ్మణుండు మమ్మేవురను మహాగ్రాహంబులుగా శపియించిన నమ్మునివరునకు ముకుళితహస్తల మై యి ట్లంటిమి. 158
చ. అలుగుదురయ్య విప్రులు ? మహాపురుషుల్‌ పరుషాపరాధముల్‌
దలిఁగెడువారు ధర్మువులు దప్పక సల్పెడువారు సత్యముల్‌
పలికెడువారు; వారల కపాయము డెందములం దలంచు మూ
ర్ఖులకు విధాతృచెయ్వున నగున్‌ దురితంబులు దుర్యశంబులున్‌.
159
వ. ‘కావున మాచేసిన యజ్ఞానంబు సహించి మాకు శాపమోక్షంబుఁ బ్రసాదింపు’ మనిన నవ్విప్రుండును గరుణించి ‘యెవ్వండేని మీచే గృహీతుం డయి మీయున్న జలాశయంబు మిమ్ము వెలువరించు నాతండ మీకు శాపమోక్షకారణుం డగు’ ననిన. 160
సీ. అట్టిమహాబాహుఁ డత్యంతబలుఁ డెవ్వఁ | డగునొక్కొ! యనుచు నే మరుగుదెంచు
వారము త్రైలోక్యవర్తి నంబుజభవ | ప్రభవు నారదుఁ గని భక్తితోడ
మ్రొక్కిన మమ్ము నమ్ముని చూచి ‘యి ట్లేల | వగఁ బొంది కందినవార?’ లనియు
నడిగి మావృత్తాంత మంతయు మాచేత | విని, ‘విప్రునలుకయు విధికృతంబుఁ
 
ఆ. గ్రమ్మఱింప లావె! కావున దక్షిణ | జలధితీరమునఁ బ్రశస్త పంచ
తీర్థములకు నేఁగి ధృతి నందు నూఱేఁడు | లుండుఁ డట్లు మీర లుండు నంత’.
161
క. ‘జననుతుఁడు పాండుతనయుఁడు | ధనంజయుఁ డశేషతీర్థదర్శనకాంక్షం
జనుదెంచి మీకు దయ న | మ్ముని చెప్పినయట్ల శాపమోక్షము సేయున్‌’.
162
వ. ‘అనిన నన్నారదువచనంబులు విని వచ్చి మహోగ్రగ్రాహముల మై భవదాగమనంబు ప్రతీక్షించుచు నిప్పంచతీర్థంబుల నుండి నేఁడు నీకారణంబునం గృతార్థుల మయితి’ మనిన నర్జునుండును గరుణాయత్తచిత్తుం డయి వంద చెప్పినయన్నలువురకు శాపమోక్షణంబు సేసిన, నమరకన్యక లతిహర్షంబున నమరేంద్రనందను దీవించి దేవలోకంబున కరిగి; రదిమొదలుగా నిప్పంచతీర్థంబులు నారీతీర్థంబులు నాఁ బరగె; నర్జునుండును గ్రమ్మఱి మణిపూరపురంబునకు వచ్చి రాజ్యలీల సుఖంబుండి చిత్రాంగదయందు బభ్రువాహనుం డను పుత్త్రుం బడసి చిత్రవాహనునకు వంశకరుంగా నిచ్చి, వాని వీడ్కొని గోకర్ణంబుఁ జూచుచుఁ బశ్చిమసముద్రపార్శ్వంబునఁ బ్రభాసం బను తీర్థంబునకుఁ జని, యందులకు ద్వారవతి పురంబు కుఱంగలి యని విని. 163
సీ. ‘అందుల కేఁగి యే నిందీవరశ్యాము | నరవిందనాభు నంబురుహనేత్రు
సన్మిత్రుఁ జూచి నాజన్మంబు సఫలంబు | సేయుదు నఘములు వాయుపొంటె;
నదియునుంగాక, మున్‌ గదుఁ డనువానిచే | వింటిఁ దిలోత్తమకంటె రూప
వతియట్టె సద్గుణాన్వితయట్టె నా కట్టి | భద్రేభగమన సుభద్రఁ జూచు
 
ఆ. వేడుకయును గలదు; విష్ణుభట్టారకు | దయ నభీష్టసిద్ధి దనరు’ ననుచుఁ
దద్ద సంతసిల్లి తద్ద్వారకాపురి | కరుగ నిశ్చయించె నర్జునుండు.
164
వ. మఱియు నప్పురంబునం ద న్నొరు లెఱుంగకుండ వలయు ననియు, యాదవులు యతుల కతిభక్తు లనియును మనంబునం దలంచి కృతకయతివేషధరుం డయి. 165
క. పరమబ్రహ్మణ్యు జగద్గురు | గరుడధ్వజు ననంతగుణు నేకాగ్ర
స్థిరమతి యై నిజహృదయాం | తరసుస్థితుఁ జేసి భక్తిఁ దలఁచుచు నుండెన్‌.
166
క. నరు నునికి యెఱిఁగి కృష్ణుడు | తిరముగ దయతోఁ బ్రభాసతీర్థమునకు నొ
క్కరుఁడ చనుదెంచె; సర్వే | శ్వరుఁ డెప్పుడు భక్తులకుఁ బ్రసన్నుఁడ కాఁడే.
167
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )