ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
అర్జునుండు ద్వారకానగరంబునకుఁ జనుట (సం. 1-210-4)
వ. ఇట్లు దనకడకు వచ్చిన యాదిదేవునకు దేవకీనందనునకు నతిసంభ్రమంబున నమస్కరించి పురందరనందనుం డానందజలభరితనయనుం డయి యి ట్లనియె. 168
ఉ. ద్వాదశమాసికవ్రతము ధర్మవిధిం జలుపంగ నేఁగి గం
గాదిమహానదీహిమవదాదిమహాగిరిదర్శనంబు మీ
పాదపయోజదర్శనముఁ బన్నుగఁ జేయుటఁ జేసి పూర్వసం
పాదిత సర్వపాపములుఁ బాసె భృశంబుగ నాకు నచ్యుతా!
169
వ. అనిన విని నగుచు నబ్జనాభుం డర్జును నతిస్నేహంబునం గౌఁగిలించుకొని యెల్లవారల కుశలంబును నడిగి, యాతని తీర్థాభిగమననిమిత్తంబును సుభద్రయందు బద్ధానురాగుం డగుటయు నుపలక్షించి, ద్వారకాపురంబునకుఁ దోడ్కొని యరిగి. 170
ఉ. భ్రాజితశాతకుంభగృహపంక్తులఁ బుష్పితవల్లివేల్లితో
ర్వీజవనావృతిన్‌ విమలవిద్రుమవజ్రవిచిత్రవేదికా
రాజిఁ గరంబు రమ్య మగు రైవతకాచలకందరంబునన్‌
రాజకులైకసుందరుఁ బురందరనందను నుంచి లీలతోన్‌.
171
క. శ్రీపతి గడునెయ్యంబున | నాపోవక పార్థునొద్ద నారాత్రి ప్రియా
లాపములఁ దగిలి యుండెను | దీపమణుల్‌ వెలుఁగ భువనదీపుఁడు దానున్‌.
172
వ. ఇట్లు పరమపురుషు లయిన నరనారాయణులు దమ పూర్వజన్మ సహవాసంబున య ట్లప్పుడు పరమానందంబునఁ బరస్పరప్రియమధురసంభాషణంబుల నొక్కటనుండి యారాత్రి సలిపి; రంతఁ బ్రభాతంబ వాసుదేవుండు వాసవనందను నంద యుండం బంచి కాంచనరథారూఢుం డయి పురంబునకుం జని పౌరజనప్రధానసమక్షంబున రైవతకమహోత్సవంబు ఘోషింపం బంచిన. 173
చ. పొలుపుగఁ బూసి కట్టి తొడి భూరివిభూతిప్రకాశితంబుగాఁ
గలయఁగఁ దత్పురీజనులు కాంస్యమృదంగముకుందవేణుకా
హలపటహధ్వనుల్‌ చెలఁగ నాటలుఁ బాటలు నొప్పె నెల్లవా
రలుఁ జని చేసి రర్చనలు రైవతకాద్రికి నుత్సవంబుతోన్‌.
174
చ. గురు కుచ యుగ్మముల్‌ గదలఁ గ్రొమ్ముడులందుల పుష్పముల్‌ పయిం
దొరఁగ నిదాఘబిందువితతుల్‌ చెదరన్‌ మదిరామదంబునన్‌
బరవశ లయ్యు నింపెసఁగఁ బాడుచుఁ దాళము గూడ మెట్టుచుం
దరుణియ లొప్ప నాడిరి ముదంబునఁ దమ్ము జనాలి మెచ్చఁగన్‌.
175
సీ. సారణ సత్య కాక్రూర విదూరథ | సాంబ సంకర్షణ శంబరారి
భాను సుషే ణోగ్రసేన శైనే యాని | రుద్ధ హార్దిక్య గ దోద్ధవాది
యాదవు లధికప్రమోదు లై యొక్కటఁ | దరుణులుఁ దారును గరికరేణు
హయశిబికారూఢు లయి తదుత్సవమున | కరిగిరి; మఱి జగద్గురుఁడు గృష్ణుఁ
 
ఆ. డింద్రలీలతో నుపేంద్రుండు రుక్మిణీ | దేవి మొదలుగాఁగ దేవు లెల్ల
నొప్పుతోడ రాఁగ నప్పర్వతమునకుఁ | జనియె సకలజనులుఁ దనకు నెరఁగ.
176
వ. ఇ ట్లరిగి జనార్దనుండు ధనంజయుం దలంచి, తత్సమీపగతుం డై తోడ్కొని, యాతనికి న ప్పర్వత రమణీయ ప్రదేశంబులం జూపుచు విహరించి, యిద్దఱు నొక్కవిమలమణివేదికయం దభిమతసంభాషణంబుల నుండు నంత. 177
చ. క్వణదణుకింకిణీకలితకాంచనకాంచికలాపమున్‌ రణ
న్మణికలనూపురంబులు సమధ్వని నొప్పఁగ భక్తిఁ బాదచా
రిణి యయి కన్యకాజనపరీత సుభద్ర తదద్రిపూజన
ప్రణతులు సేసె నింద్రసుతుఁ బార్థు నిజేశ్వరుఁగాఁ దలంచుచున్‌.
178
ఉ. దాని సుభద్రఁగా నెఱిఁగి తత్‌క్షణజాతమనోజసంచల
న్మానసుఁ డైన యవ్విజయు మానుగఁ జూచి ‘మునీంద్ర! నీకుఁ జ
న్నే నలినాక్షులందు మది నిల్పఁగ’ నంచును మందహాసగ
ర్భాననుఁ డై రథాంగధరుఁ డాతని కి ట్లనియెం బ్రియంబునన్‌.
179
వ. ‘నీవు సుభద్రయందు బద్ధానురాగుండ వగుట తొల్లియు నే నెఱుంగుదు; నోడకుండుము; నీ కోర్కి వసుదేవ దేవకీ దేవులకుం జెప్పి సఫలంబు సేయుదు’ నని యర్జునునకు హృదయానందంబుగాఁబలికి, యప్పుడ వడిగల చారుల రావించి ద్వారవతియం దర్జునుం డున్న వాఁ డనుకుశలవార్త ధర్మజున కెఱింగింప నింద్రప్రస్థపురంబునకుం బుచ్చియున్నంత; నచ్చటికి వచ్చి బలదేవాదియాదవు లతిభక్తులై యతియకా వగచి యర్జునునకు నమస్కరించి యాతనివలన సర్వతీర్థంబులుఁ దత్సేవాఫలంబులును విని సంతసిల్లి, యి వ్వర్షాకాలంబు మాయంద యుండి చాతుర్మాస్యంబు సేసి మమ్ముం గృతార్థులం జేయుం డని ప్రార్థించి, పార్థుం దోడ్కొని చని, వానికి నన్నపానాది విధులం బరిచరింప సుభద్రం బంచి, కన్యాపురంబునందు నివాసంబు సేసిన. 180
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )