ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
అర్జునుండు యతిరూపంబున కన్యాపురంబున నుండుట (సం. 1-114-64)
క. అందు ధృతిమందరుండు పు | రందర నందనుఁడు దనకు రమణి గుణశ్రీ
సుందరి సుభద్ర నెయ్యం | బొందఁగఁ బరిచర్య సేయుచుండఁగ నుండెన్‌.
181
క. ధీరుఁడు యతిరూపంబున | నారఁగ నిందున్నయాతఁ డర్జునుఁ డని స
త్యారుక్మిణులకుఁ జెప్పె ము | రారాతి రహస్యమున ననంత ప్రీతిన్‌.
182
చ. అలయక నాఁడు నాఁటికి లతాంగి యపూర్వము లైన భోజనం
బులు గడుభక్తిఁ బెట్టుచు, నపూర్వము లైన వపుర్విలాస యు
క్తులు వెలయించుచున్‌, ముదముతోఁ బెనిచెన్‌ మరి నాఁడునాఁటి క
గ్గల మగుచుండ నెయ్యమును గామవికారము సవ్యసాచికిన్‌.
183
వ. మఱియును. 184
సీ. అలినీలకుంతలుం డనియును హరినీల | సమవర్ణుఁ డనియు నాజానులంబి
తాయతస్థిరబాహుఁ డనియును రక్తాంత | నలినదళాకారనయనుఁ డనియు
నుత్తుంగఘనవిశాలోరస్కుఁ డనియును | గవ్వడి యనియును గరము వేడ్క
వివ్వచ్చు నెప్పుడు వినియెడునది; దన | వినినట్ల యతిఁ జూచి, ‘వీఁడు విజయుఁ
 
ఆ. డొక్కొ!’ యనుచు సంశయోపేతచిత్త యై | యుండి, యుండ నోప కొక్కనాఁడు
భోజనావసానమున నున్న యమ్ముని | కిందువదన ప్రీతి నిట్టు లనియె.
185
వ. మునీంద్రా! నీ యాడనితీర్థంబులుం జూడనిపురంబులు నెఱుంగనిరాజకులంబును లే వని విచారింతు. 186
సీ. ‘అమరావతికి నెన యనఁగ నివ్వసుమతిఁ | బరఁగు నింద్రప్రస్థపురవరంబు
చూచితిరే? పాండుసుతు లందు సుఖ మున్న | వారె? మాయత్త యంభోరుహాక్షి
కుంతీమహాదేవి కుశలయే? యమ్మహా | వీరుఁ డర్జునుఁడు జితారి తీర్థ
గమనోత్సుకుం డయ్యెఁ; గ్రమ్మఱి వచ్చెనే? | యెఱుఁగుదురేని నా కెఱుఁగఁ జెప్పుఁ ’
 
ఆ. డనిన నేన చూవె యయ్యర్జునుండ; నీ | యొద్ద నివ్విధమున నున్నవాఁడఁ;
దరుణి! నీకు నాకు ధరణీధరుం డను | జలజభవుఁడు సేసె సంగమంబు.
187
వ. ‘బ్రాహ్మంబు మొదలుగాఁ గల యెనిమిది వివాహంబులయందును గాంధర్వరాక్షసంబులు క్షత్త్రియులకు నుత్తమ వివాహంబులు గావున నిది గాంధర్వ వివాహంబున కవసరం’ బనిన సుభద్ర లజ్జావనతవదన యయి. 188
తే. ‘నన్ను నీ నర్హు లెల్ల నిం దున్నవారు; | వార యెఱిఁగి చేయుదురు వివాహ’ మనుచు
వనజనేత్ర యంతఃపురంబునకుఁ జనియె;| నరిగెఁ దన లతాగృహమున కర్జునుండు.
189
వ. అయ్యిరువుర యన్యోన్యప్రణయంబులు దనదివ్యజ్ఞానంబునం జేసి దివ్యపురుషుండు పురుషోత్తముం డెఱింగి, యర్జునునకు భోజనవిధు లమర్ప రుక్మిణీదేవిం బంచి, యొక్కనాఁ డేకాంతంబున దేవకీవసుదేవప్రద్యుమ్న సాంబసంకర్షణసారణసాత్యకు లకు నర్జును స్థితియును’ నాతనియందు సుభద్రనెయ్యంబును నెఱింగించి, తమతొల్లింటి విచారంబున కనుగుణం బగుటకు సంతసిల్లి, బలదేవాదు లెఱుంగకుండ సుభద్రార్జునుల వివాహంబు సేయ సమకట్టి, తమనిశ్చయం బయ్యిరువురకుం జెప్పి, పశుపతిపూజా మహోత్సవవ్యాజంబున నఖిలయాదవ భోజాంధకవృష్ణివరులతో నంతర్ద్వీపంబునకుం జని. 190
వ. అం దమరబృందవంద్యున | కిందుకళాభరణునకు నుమేశ్వరునకు నా
నందం బొందఁగ నందఱ | నందకధరుఁ డుత్సవం బొనర్పఁగఁ బంచెన్‌.
191
క. తగఁగ వివాహం బెన్నం | డగునొకొ, యెన్నండు సంగమావాప్తియు మా
కగునొకొ యని యెడఁ గోరుచు | నొగి నిట యుండిరి సుభద్రయును విజయుండున్‌.
192
క. హరిఁ దలఁచె సుభద్ర; పురం | దరుఁ దలఁచె ధనంజయుండు; దడయక వా ర
య్యిరువురఁ బెండిలి సేయఁగ | వరదులు తద్ద్వారవతికి వచ్చిరి ప్రీతిన్‌.
193
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )