ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
అర్జునుండు సుభద్రను వివాహంబగుట (సం. 1-144-270)
వ. ఇట్లు వాసుదేవుండు వసుదేవాక్రూరసారణసాంబసాత్యకిసహితంబుగా నంతర్ద్వీపంబుననుండి వచ్చిన యనంతరంబ యమరావతినుండి యమరసిద్ధసాధ్యమునిగణపరివృతుం డై యమరేంద్రుండు వచ్చె; నంత బృహస్పతి యిచ్చిన యుత్తమలగ్నంబున నగ్నియమనిరృతివరుణవాయుధనదేశానాదిసురవరులు, నత్రిభృగు నారద వసిష్ఠవామ దేవప్రభృతి మహామునులును సదస్యులుగాఁ, గశ్యపప్రజాపతి హోమకర్తగా, నరుంధతియు శచియు సత్యభామయు రుక్మిణియు నప్సరోగణంబులతోడం బురంధ్రీకార్యంబులు నిర్వహింప సుభద్రార్జునుల వివాహమహోత్సవం బతిరమ్యం బయ్యె నంత. 194
తరువోజ. అనిమిషప్రభుఁడు నిజాత్మజు ననఘు | నర్జునుఁ బ్రీతితో నభిషిక్తుఁ జేసి
మనుజేంద్రుఁ గాంచనమణిమయోత్తుంగ | మకుటవిభూషణమస్తకుఁ జేసి
యనుపమకేయూరహారాదిభూష | ణాభిశోభితుఁ జేసి యప్పు డానంద
జనితాంబుకణికార్ద్రచక్షుస్సహస్ర | జలరుహంబులు దాల్చె సమ్మదం బెసఁగ.
195
మాలిని. నరునకు దయ ని ట్లానంద మొందించి యింద్రుం
డరిగె దివికి దివ్యానంతరత్నాంశుజాల
స్ఫురితసురవిమానంబుల్‌ నభోభాగ మెల్ల
న్మెరసి వెలుఁగుచుండన్‌ నిర్జరశ్రేణితోడన్‌.
196
వ. ఇట్లు నారాయణుండు నిజారంభంబు సఫలం బగుటకు సంతసిల్లి, సంప్రాప్తమనోరథుం డయిన యప్పార్థుం గౌఁగిలించుకొని, ‘యక్షయబాణతూణీరబాణాసనసనాథం బయి పవనజవనహయంబులం బూన్చిన యక్కాంచనరథం బెక్కి సుభద్రం దోడ్కొని యింద్రప్రస్థపురంబున కరుగు’ మని పంచి, యనంతరం బంతర్ద్వీపంబున కరిగిన. 197
క. హరి పంచిన మార్గంబునఁ | గురువిభుఁడు సుభద్రఁ దోడుకొని చనునెడఁ ద
త్పురపరిరక్షకు లతిభీ | కరులు పృథుశ్రవసుఁ డాదిగాఁ గల వీరుల్‌.
198
ఉ. ‘వీరుఁడు వీఁడు పాండవుఁడు వృష్ణికులోత్తము లైన సీరిదై
త్యారు లెఱుంగకుండఁగ మహారథుఁ డై తరుణిన్‌ సుభద్ర నం
భోరుహనేత్రఁ దోడ్కొనుచుఁ బోయెడి; నీతనిఁ బోవనిచ్చినన్‌
ధీరుఁడు మాధవుండు బలదేవుఁడు నల్గుదు’ రంచు నడ్డ మై.
199
క. వీఁకఁ బఱతెంచి నలుగడఁ | దాఁకినఁ గడు నలిగి ఘోరతరశరహతి న
మ్మూఁకలు విరియఁగ నర్జునుఁ | డాఁకరమున నేసె నుగ్రుఁ డయి రణభూమిన్‌.
200
చ. హరితనయుండు పార్థుఁడు రయంబున నందఱ నాహవక్రియా
విరతులఁ జేసి యప్పురమువీథుల వేదుల రమ్యహర్మ్య గో
పురములఁ దద్గిరీంద్రమణిభూముల భూరితటాకపంకజా
కరనవనందనావళులఁ గాండమయంబులఁ జేసె నీసునన్‌.
201
క. అమరేంద్రసుతుఁడు దనకుం | గమలాక్షి సుభద్ర రథముఁ గడపఁగ ననిలో
నమిత యదుసైన్యముల న | శ్రమమున నోడించి లబ్ధ జయుఁ డయి యరిగెన్‌.
202
వ. అంత సభాపాలుండు ప్రబల జలధార ధ్వాన గంభీరభేరీధ్వనిచే నర్జునుపరాక్రమం బెఱింగించిన దాని విని యంతర్ద్వీపంబున నున్న బలదేవాదియాదవులందఱు నాక్షణంబ పురంబునకు వచ్చి సభాసీను లయి. 203
క. యాదవుల నాదరింపక | యాదవిఁ దోడ్కొని కిరీటి యరిగెను గంభీ
రోదధిఁ గరముల నీఁదం | గా దనక కడంగె నధికగర్వోద్ధతుఁ డై.
204
మత్తకోకిల. ఏల పార్థుపరాక్రమంబు సహింప? నాతని నాహవ
వ్యాలు నిప్పుడ పట్టి తెత్తము; వాతధూతదవానల
జ్వాలకున్‌ వనరాశివేల కసంఖ్యయాదవసేనకున్‌
దేలిపోవక చక్కనయ్యెడు ధీరు లెవ్వరు పోరిలోన్‌.
205
వ. అని విజృంభించి విలయసమయ సముద్ధూత వారాశియుంబోలె ఘూర్ణిల్లుచున్న యాదవవీరుల వారించి వాసుదేవుం జూచి, బలదేవుం డి ట్లనియె. 206
క. ‘నీ వెఱుఁగకుండ గర్వము | తో విజయుఁడు దా సుభద్ర దోడ్కొని బలిమిం
బోవఁగ నంతసమర్థుఁడె’ | నావుడుఁ గృష్ణుండు రామునకు ని ట్లనియెన్‌.
207
సీ. భరతకులాగ్రణి పాండవసింహంబు | సర్వధర్మజ్ఞుఁ డాసవ్యసాచి
దనమేనమఱఁదలి ధవళాక్షిఁ దోడ్కొని | చనియె; నాతని కది చనదె చెపుఁడ!
యప్పార్థుపిఱుఁద మీ రరుగంగ వాఁ డంత | యశ్రమసాధ్యుఁడె యాహవమున?
నఖిలాస్త్రవిదుఁడు ద్రోణాచార్యశిష్యుండు | జితకాశి యని వానిఁ జెప్ప వినరె?
 
ఆ. వలవ దుడుగుఁ’ డనిన వామను పలు కను | వేలఁ గడవదయ్యె వృష్ణిభోజ
యాదవాంబురాశి యట ధనంజయుఁ డవి | జేయుఁ డభిమతార్థసిద్ధిఁ బొంది.
208
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )