ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
అర్జునుండు సుభద్రాసహితుండై యింద్రప్రస్థపురంబునకుఁ జనుట (సం. 1-213-13)
వ. ఇ ట్లింద్రప్రస్థపురంబున కభిముఖుం డై యానర్తకదేశంబులకుం జని, యందు ముందఱ ముకుందప్రేషితు లయిన దాశార్హవీరులతో నగణ్యారణ్యంబులు గడచుచుఁ, బుణ్యతీర్థంబుల నాడుచు నానాజనపదంబుల విహరించుచు వచ్చి యింద్రప్రస్థపురసమీపంబున. 209
ఆ. ఘనభుజుండు నరుఁడు దనతొఱ్ఱుపట్టుల | విశ్రమించి భువనవిశ్రుతుండు
మతిఁ దలంచి యాత్మహిత మగు నట్లుగా | నిష్టమున సుభద్ర కిట్టు లనియె.
210
వ. ‘మన మివ్విధంబునఁ జనునప్పుడు నిన్నుఁ జూచి ద్రుపదరాజపుత్త్రి యప్రియంబులు వలుకునో; యప్పరమ పతివ్రతపలుకు నిక్కువం బగుం గావున, నీ వేకతంబ గోపాలబాలికలతో ముందఱ నరిగి యక్కోమలిం గను మని పనిచిన సుభద్రయు నిజేశ్వరుపంచిన మార్గంబున నింద్రప్రస్థపురంబునకుం బోయి కుంతీదేవికి ద్రౌపదికి మ్రొక్కిన. 211
తే. ‘పంకజాక్షి! నీపతి ప్రతిపక్షవీర | విజయుఁ డయ్యెడు; నీవును వీరపుత్త్ర
జనని వగు’ మని దీవించె సంతసంబు | తోడ వసుదేవపుత్త్రి నాద్రుపదపుత్త్రి.
212
వ. ఇట్లు ద్రోవదిచేత దీవనలు సేకొని కుంతీదేవియొద్ద సుభద్ర యున్నంత; నట యర్జునుండును నసంఖ్యాకదాశార్హసైన్య సమేతుం డై యనేకబ్రాహ్మణాశీర్వాదంబు లెసంగ నింద్రప్రస్థపురంబుం బ్రవేశంబుసేసి ధౌమ్యునకు ధర్మరాజునకు భీమునకుఁ గుంతీదేవికి మ్రొక్కి; తనకు మ్రొక్కిన కవలం గౌఁగిలించుకొని పరమానందంబున నుండు నంత. 213
క. చెలియలు మఱఁదియుఁ జని యి | మ్ముల నింద్రప్రస్థనగరమున నభిమతబం
ధులయొద్ద నున్నవా రని | జలశయనుఁడు విని కరంబు సంతుష్టుం డై.
214
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )