ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
శ్రీకృష్ణబలదేవాదులు పాండవులకుఁ గానుకలు తెచ్చియిచ్చుట (సం. 1-213-23)
సీ. బలదేవ సాత్యకి ప్రద్యుమ్న వసుదేవు | లాదిగా బెరసిన యాదవాగ్ర
గణ్యులుఁ దాను నగణ్యమహావస్తు | వాహనంబులు గొని వాసుదేవుఁ
డనుజకు నరణ మీ నర్థితోఁ జనుదెంచె; | హరిరాక యెఱిఁగి ధర్మాత్మజుండు
గరము గారవమునఁ గవలను గృష్ణున | కెదురు పుత్తెంచిన నింద్రలీల
 
ఆ. నిందువంశవిభుఁ డుపేంద్రుఁ డింద్రప్రస్థ | పురము సొచ్చె నతివిభూతి మెఱసి
యనుజవరులతోడ నంతఁ బ్రత్యుద్గతుం | డై యుధిష్ఠిరుండు హర్ష మెసఁగ.
215
వ. వసుదేవాది యాదవవృద్ధుల కెల్ల మ్రొక్కి బలదేవ వాసుదేవ సాత్యకి సారణ ప్రద్యుమ్నాదుల నుచితప్రియ పూర్వకంబున సత్కృతులం జేసిన. 216
ఉ. ఆనకదుందుభిప్రభృతియాదవులుం గురుముఖ్యులున్‌ మృదం
గానకదుందుభుల్‌ సెలఁగ నత్యనురాగముతో నిరంతర
శ్రీనుతు లొప్ప నుత్సవము సేసిరి సప్తదినంబు లిష్టస
మ్మానములన్‌ మహీసురసమాజసమీహితపూజనంబులన్‌.
217
వ. అంత. 218
క. నిరుపమపరార్థ్యరుచి సుం | దరరత్నావళుల శోభితము లగువానిన్‌
వరదుఁడు సహస్రసంఖ్యా | భరణంబులఁ బార్థునకు సుభద్రకు నిచ్చెన్‌.
219
వ. మఱియును. 220
సీ. అవిరళక్షరితదానార్ద్రగండస్థల | గజసహస్రంబును, గనకరత్న
రచిత మై తురగసారథిసహితం బైన | రథసహస్రంబును, రమ్యభూష
ణాలంకృతస్త్రీసహస్రంబుఁ, గాంచన | శిబికాసహస్రంబుఁ, జిత్రలలిత
గతి నొప్పు నేనూఱుగాడిదలను, సింధు | బాహ్లికకాంభోజపారసీక
 
ఆ. జాత మైన తురగశతసహస్రము, లక్ష | గోధనంబు, నధికఘోరవీర
దర్పయుక్తు లైన దశలక్షదాశార్హ | వరుల నరణ మిచ్చె వామనుండు.
221
క. క్రమమునను గొంతిదేవిని | యమనందను భీముఁ గవల నాద్రౌపది ను
త్తమరత్నాభరణాదుల | నమరఁగ వేర్వేఱ నెయ్యుఁ డయి పూజించెన్‌.
222
వ. మఱియు బలదేవాదియాదవముఖ్యు లెల్ల సుభద్రార్జునులం బూజించి, పాండవులచేతం బ్రతిపూజితు లై ద్వారవతికిం జని; రుపేంద్రుం డింద్రనందనుతోడి యిష్టవినోదంబుల నింద్రప్రస్థపురంబున నుండె నంత. 223
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )