ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
అభిమన్యు ప్రభృతుల జననము (సం. 1-213-58)
ఉ. ధన్యుల కా సుభద్రకు శతక్రతుపుత్త్రున కుద్భవించె స
మ్మాన్య యశుండు పుత్త్రుఁ డభిమన్యుఁడు వైన్యనిభుం డనన్యసా
మాన్యపరాక్రమప్రబలమాన్యుఁడు పుణ్యచరిత్రుఁ డన్యరా
జన్యభయంకరుండు రణశౌర్యుఁడు పాండవవంశకర్త యై.
224
చ. సుతజననోత్సవంబున విశుద్ధయశుండు యుధిష్ఠిరుండు సం
భృతహృదయప్రమోదుఁ డయి పెంపున నిచ్చె సువర్ణభూషణ
ప్రతతులు గోధనాయుతము బ్రాహ్మణముఖ్యులకున్‌ నిరంతర
వ్రతులకు వేదవేదులకు వారిజసంభవునట్టివారికిన్‌.
225
వ. ఇ ట్లుదయించిన యభిమన్యుండు దల్లిదండ్రులకు సకల జనులకు నానందం బొనరించుచు ధౌమ్య నిర్మిత జాతకర్మ చౌలోపనయనుం డయి పెరుఁగుచు. 226
మత్తకోకిల. ఆదిఁగోలెను గృష్ణుచే దయ నావృతుం డయి ధౌమ్యుతో
వేద మంగయుతంబుగాఁ జదివెన్‌, ధనంజయుతో ధను
ర్వేద మిమ్ముగ నభ్యసించెఁ; బ్రవీరవైరిపతాకినీ
భేదమార్గము లెల్ల నేర్చె నభేద్యవిక్రమసంపదన్‌.
227
వ. అంత ద్రుపదరాజనందనయుం గ్రమంబునఁ బాండురాజనందనులవలనఁ బ్రతివింధ్య శ్రుతసోమ శ్రుతకీర్తి శతానీక శ్రుతసేను లనువారిఁ బంచోపపాండవులను సుపుత్త్రులం బడసిన. 228
క. సుతవంతు లయి విశుద్ధ | శ్రుతనయవంతు లయి పాండుసుతు లతులగుణా
న్వితులు జగజ్జన నుత వి | శ్రుతులు మహారాజ్యలీల సుఖ మున్నంతన్‌.
229
చ. ఉరుతర దావపావక శిఖోత్కలిత శ్వసనంబులున్‌, సితే
తరగతి తీవ్రతిగ్మకరధామ సహస్రములున్‌, బహుప్రవా
హరహితనిమ్నగాతతులు నై, కడుదీర్ఘము లై, నిదాఘవా
సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దారుణంబు లై.
230
వ. అట్టి ఘర్మ దివసంబులు సహింప నోప కర్జునుం డొక్కనాఁడు కృష్ణున కి ట్లనియె. 231
చ. జలరుహనాభ! రమ్యగిరిసానువనంబుల వేఁటలాడుచున్‌
జలుపుద మీనిదాఘదివసంబుల నీవును నేను నున్మిష
న్నలిన రజస్సుగంధి యమునాహ్రద తుంగ తరంగ సంగతా
నిలశిశిరస్థలాంతరవినిర్మితనిర్మలహర్మ్యరేఖలన్‌.
232
వ. అని పురందరనందనుండు గోవిందు ననుమతంబు వడసి మిత్రామాత్యభృత్యసమేతులయి యిద్దఱు నరిగి యథారుచి ప్రదేశంబుల విహరించుచు నొక్కనాఁడు ఖాండవవనసమీపంబున నొక్కచందనలతాభవన చంద్రకాంతవేదికయందు మందశీతలసురభిమారుతం బనుభవించుచు నిష్టకథావినోదంబుల నుండునంత. 233
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )