ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
అగ్నిదేవుఁడు ఖాండవసమీపమున విహరించుచున్న కృష్ణార్జునులకడకు వచ్చుట (సం. 1-214-29)
మాలిని. అసితపథుఁడు విప్రుం డై మహాశ్రాంతలీలన్‌
మసృణకపిలకేశశ్మశ్రు లొప్పంగఁ దేజం
బెసఁగ ముదముతో నయ్యిద్దఱన్‌ డాయవచ్చెన్‌
వసునిభు లగు వారిన్‌ వాసవిన్‌ వాసుదేవున్‌.
234
వ. వారు న వ్విప్రు నతిభక్తిఁ బూజించిన, వారలకు నవ్విప్రుం డి ట్లనియె. 235
క. ఏ నమితభోజనుండ న | హీనాగ్నిబలుండ నాకు నిష్టాన్నము స
మ్మానముగఁ బెట్టుఁ డోపుదు | రేని సుతృప్తుండ నగుదు నే న ట్లయినన్‌.
236
వ. అనిన ‘నీ కెద్దిభోజనం బిష్టంబు, దానిన పెట్టెద’ మడుగు; మనిన వారికి నవ్విప్రుం డి ట్లనియె. 237
ఆ. అగ్ని నేను; నాకు నాహార మయ్యింద్రు | ఖాండవంబు; దీనిఁ గాల్పఁ గడఁగి
యెగువఁ బడితి ముంద రింద్రుపంచిన మహా | దారుణాంబుధరశతంబుచేత.
238
వ. తక్షకుం డను పన్నగేంద్రుఁ డింద్రున కిష్టసఖుం డయి ఖాండవంబునం దుండుటంజేసి దీని నమృతంబు రక్షించున ట్లతిప్రయత్నంబున నింద్రుండు రక్షించుకొనియుండు; నది నిమిత్తంబుగా సర్వసత్త్వంబులు నిందు సుఖం బుండు; మీరు మహాసత్త్వుల రఖిలాస్త్రవిదుల; రమరేంద్రుండు గావించువిఘాతంబులు మీయస్త్రబలంబున వారింపనోపుదు; రేనును దీని ననాకులంబున నుపయోగించి కృతార్థుండ నగుదు. 239
క. అని యగ్నిదేవుఁ డయ్య | ర్జునదామోదరుల శౌర్యశోభితులఁ బ్రియం
బునఁ బ్రార్థించెను బలసూ | దనరక్షితఖాండవప్రదాహోత్సుకుఁ డై.
240
వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 241
ఆ. ‘ఏమి కారణమున నింద్రుఖాండవ మగ్ని | దేవుఁ డట్లు గాల్పఁ దివిరె? దీని
విప్రముఖ్య నాకు వినఁగ వేడుకయయ్యె; | నెఱుఁగఁ జెప్పుమయ్య యిదియు’ ననిన.
242
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )