ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
శ్వేతకి యను రాజర్షి వృత్తాంతము (సం. 1-215-11)
వ. జనమేజయునకు వైశంపాయనుం డి ట్లని చెప్పెఁ; దొల్లి శ్వేతకి యనురాజర్షి ఘృతసంపూర్ణదక్షిణానేకాధ్వరుం డయి శతవార్షికసత్త్రయాగంబు సేయ సమకట్టి ఋత్విజులం బ్రార్థించిన, ఋత్విజులు ‘నేము నిరంతర క్లేశంబున కోపము; నీ వనవరతయజనశీలుండవు; నీకు నీశ్వరుండ యాజకత్వంబు సేయనోపుంగాని, యొరు లోప’ రని విసివి పలికిన, నాతండును గైలాసంబున కరిగి, కైలాసవాసు నిఖిలలోకవంద్యు నిందుశేఖరు నీశ్వరు నుద్దేశించి యుగ్రతపంబు సేసినఁ బరమేశ్వరుండు ప్రత్యక్షం బయి వాని కి ట్లనియె. 243
క. ‘శ్వేతకి! నీతపమున కేఁ | బ్రీతాత్ముఁడ నయితి; నీకుఁ బ్రియ మెయ్యది వి
ఖ్యాతముగ నిత్తు దానిన; | యాతతమతి వేఁడు’ మనిన నన్నరపతియున్‌.
244
వ. ‘దేవా! నీప్రసాదంబున శతవార్షికసత్త్రయాగంబు చేసెద; నాకు నీవు ఋత్విజుండవు గావలయు’ నని ప్రార్థించినం గరుణించి’ యాజకత్వంబు బ్రాహ్మణులకు విధిదృష్టం బగుటంజేసి దాని నొరులకుఁ జేయంగాదు గావున, నింక నీవు బ్రహ్మచర్యంబునఁ బండ్రెండేండ్లు నిరంతరఘృతధారంజేసి హుతాశనుఁ దృప్తుం జేయు’ మనిన వాఁడును బరమేశ్వరుపంచిన విధంబున నగ్నితర్పణంబు సేసిన సంతుష్టుండై యీశ్వరుండు వానిపాలికి వచ్చి యప్పుడ దుర్వాసు రావించి. 245
వ. ‘ఈతఁ డనవరతయజన | ప్రీతుం; డీతనికి దురితభీతునకు మనః
ప్రీతిగ నార్త్విజ్యమ్ము మ | హాతేజో-ధికుఁడ! చేయు’ మని దయఁ బంచెన్‌.
246
వ. శ్వేతకియుఁ దనకు దుర్వాసుండు ఋషిగణంబులతో ఋత్విజుండుగా నభిమతం బయిన సత్త్రయాగంబు సేసె; న ట్లాశ్వేతకి చేసిన నిరంతరఘృతధారాకారణంబున నగ్నిదేవుండు దన కగ్నిమాంద్యంబును దేజోహీనతయు దప్పియు నైన; బితామహుపాలికిం జని తనశరీరస్థితి చెప్పినఁ బితామహుండును దాని నపరిమితఘృతోపయోగంబున నయిన మహావ్యాధిఁగా నెఱింగి యగ్నిదేవున కి ట్లనియె. 247
క. ‘ఈవ్యాధి యొంటఁ దీఱదు; | దివ్యౌషధయుక్త మైన దివిజవనంబున్‌
హవ్యాశన! భక్షింపు; మ | హావ్యాధి శమంబు దాన నగు నీ’ కనినన్‌.
248
క. చని ఖాండవంబుఁ గాల్పఁగ | మొనసి మహాహస్తియూథములఁ బోని ఘనా
ఘనములచే బాధితుఁ డయి | వనజజుకడ కరిగి హవ్యవాహనుఁ డనియెన్‌.
249
వ. ‘ఏను మీయానతిచ్చినవిధంబున ఖాండవం బుపయోగింపం బోయి, తద్రక్షకులు గావించువిఘాతంబులు వారింపనేరక యేడుమాఱులు విఫలప్రయత్నుండ నైతి; నింక నెద్ది యుపాయంబు? నాకు నెవ్విధంబున ఖాండవభక్షణంబు దొరకొను? నని దుఃఖించిన యతనిం జూచి కమలభవుండు కరుణించి, భావికార్యం బప్పుడు దలంచియుఁ; ‘గొంతకాలంబునకు నరనారాయణు లను నాదిమునులు నరలోకంబున దేవహితార్థం బర్జునవాసుదేవు లయి జన్మించి యాఖాండవసమీపంబున విహరింతురు; వారు భవత్ప్రార్థితు లై తమ యస్త్రబలంబున నఖిలవిఘ్నంబుల నపనయించి నిరాకులంబున నీకు ఖాండవోపయోగంబు ప్రసాదింతు’ రనిన, నగ్నిదేవుండు గరంబు సంతసిల్లి, కమలజువచనం బవలంబంబుగాఁ బెద్దకాలం బుండి, తద్వనమార్గంబున నప్పుడు కృష్ణార్జునులం గని ఖాండవదహనార్థంబు ప్రార్థించిన నగ్నిదేవున కర్జునుం డి ట్లనియె. 250
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )