ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
అగ్నిదేవుండు కృష్ణార్జునులకుఁ జక్రకార్ముకాదు లొసంగుట (సం. 1-215-12)
సీ. వారణహస్తానుకారంబు లగు వారి | ధారలు గురియు దుర్వారఘోర
తరవారివాహప్రకరములు వారింప | సురనివహంబుతో సురగణేశు
నైన నోర్వ సుశక్త మైన మహాదివ్య | శరసంచయము నా కపరిమితంబు
గల; దట్టిసాయకావలికి నాదగు భుజ | బలశీఘ్రసంధానములకుఁ దగిన.
 
ఆ. ధనువు సర్వవహనఘనరథాశ్వములుఁ గృ| ష్ణునకు నాయుధములు ననఘ! యిపుడు
లేమిఁ జేసి చూవె యీమహాకార్యంబు | గడఁగకున్నవార మెడయుఁ జేసి.
251
వ. అనిన నగ్నిదేవుండును నప్పుడ వరుణుం దలంచి వానిం దనకు సన్నిహితుం జేసికొని, ‘తొల్లి నీకు సోముం డిచ్చిన బ్రహ్మనిర్మితకార్ముకంబు నక్షయతూణీరయుగళంబును, గంధర్వజహయంబులం బూన్చిన రథంబు నియ్యతిరథుం డయిన యర్జునున కిమ్ము; మఱి చక్రంబును గదయును వాసుదేవున కి’ మ్మని పంచిన. 252
మ. అమరాహీంద్రవియచ్చరాదుల కజేయం బప్రధృష్యం బభే
ద్యము వజ్రస్థిర మన్యసాధనభిదాదక్షంబు నై సర్వలో
కమనోజ్ఞం బయి దివ్య మై వెలుఁగు నగ్గాండీవ మన్‌ చాప ర
త్నము నిచ్చెన్‌ వరుణుండు పార్థునకు నుద్యద్విక్రమోద్భాసికిన్‌.
253
వ. మఱియుఁ బ్రతిపక్ష సంక్షయకరంబులయిన యక్షయబాణంబులు గల తూణీరంబులును, వివిధాయుధభరితం బై, సింహలాంగూలకపిధ్వజవిరాజమానంబై, మహాంబుధరధ్వానబంధురంబై, మనోవాయువేగసితవాహవాహ్యమానం బై, రణితరమణీయమణికింకిణీకలాపాలంకృతం బై, సకలదిగ్విజయాధిష్ఠానంబై యొప్పుచున్న దివ్యరథంబు నర్జునున కిచ్చి, సహస్రకరసహస్రదుస్సహమహఃపటలభాసురం బగుచు దేవదైత్యదానవయక్షరాక్షసపిశాచోరగప్రశమనంబయి వెలుంగుచున్న సుదర్శనం బను చక్రంబును, గౌమోదకి యను గదయును నారాయణున కిచ్చె; నట్లు సంప్రాప్తదివ్య చాపరథాయుధు లయి యున్న నరనారాయణులం జూచి యగ్నిదేవుం డి ట్లనియె. 254
క. ఘనభుజ! యిది గాండీవం | బనఁబరఁగిన ధనువు దీని నస్త్రావలి పె
ల్చన తాఁకి భగ్న మగు న | త్యనుపమవజ్రాభిహతశిలావలి వోలెన్‌.
255
క. ఈ రథ మప్రతిహతము, స | మీరజవోపేతహయసమేతము; దీనిన్‌
భూరిబలుఁ డెక్కి సోముఁడు | ధీరుం డయి తొల్లి యెల్లదిక్కుల నొడిచెన్‌.
256
క. ఈ చక్రము మధుసూదన! | నీచేత విముక్త మగుచు నీరిపులఁ ద్రియా
మాచరులఁ జంపి క్రమ్మఱ | నీచేతికి వచ్చు దేవనిర్మితశక్తిన్‌.
257
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )