ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
కృష్ణార్జును లగ్నిహోత్రునిచే ఖాండవంబు దహింపఁజేయుట (సం. 1-216-28)
వ. అని తత్ప్రభావప్రకారంబు చెప్పినఁ గృష్ణార్జునులు సంతసిల్లి, సన్నద్ధు లయి రథం బెక్కి, యగ్నిదేవుం జూచి ‘సురాసుర పరివృతుండయి సురపతి వచ్చినను జయింతు’ మింక శంకింపక ఖాండవదహనార్థం బుపక్రమింపు మనిన నగ్నిదేవుండు హర్షించి తైజసంబయిన రూపంబు ధరియించి. 258
చ. పెడిలి సువర్ణపర్వతము పెక్కుదెఱంగుల వ్రయ్యునట్టు ల
ప్పుడు వివిధప్రకారముల భూరిశిఖావలి ఖాండవంబు న
ల్గడఁ గడుఁబర్వఁగాఁ బెఱిఁగి కాల్పఁదొడంగె హుతాశనుండు సే
డ్పడఁగ వనంబులోని మృగపక్షిభుజంగమభూతసంఘముల్‌.
259
వ. అంత. 260
సీ. చక్రధరుం డయ్యు జలరుహనాభుండు | గాండీవధరుఁ డయ్యుఁ బాండవుండు
నుండి రవ్వనమున కుభయపార్శ్వంబులఁ | దొల్లింటి యట్టులు పెల్లు రేఁగి
యనలంబు నార్పంగ నార్చుచుఁ బఱతెంచి | వనరక్షకులు పార్థు సునిశితాస్త్ర
ధారల నపగతదర్పు లై యరిగిరి | యమసదనంబున కమితబలులు;
 
ఆ. శిఖియు నుగ్రదీర్ఘజిహ్వలు సాఁచి యు | ద్ధురసమీరణంబు తోడు సేసి
కొని యుగాంతకాల కుపితానలాకారుఁ | డయ్యె ఖాండవమున కద్భుతముగ.
261
మ. ఘనధూమధ్వజ దహ్యమాన లవలీ కర్పూర తక్కోల చం
దన కాలాగరు సల్లకీతరుల యుద్యద్ధూమధూపానువా
సన నొప్పెన్‌ సురభీకృతంబు లగుచున్‌ సంక్రీడమానామృతా
శనవిద్యాధరసద్విమానవితతుల్‌ సావిత్రవర్త్మంబునన్‌.
262
చ. జ్వలన శిఖాలియున్‌ విజయుసద్విశిఖాలియుఁ జుట్టుముట్టినం
దలరి భయాకులంబు లగు తద్వనజీవులయార్తనాద మం
దులియుచు నొక్కపెట్ట దివి నుద్గుత మయ్యె నమందమందరా
చలపరివర్తనప్రసభసంక్షుభితార్ణవఘోషఘోర మై.
263
క. నెగయుడు నెగసి పిఱుందం | దగిలెడు మిడుఁగుఱులచేత దగ్ధచ్ఛద మై
గగనమునఁ బఱవ నోపక | ఖగనివహము వహ్నియంద కడువడిఁ బడియెన్‌.
264
క. తనతేజోజాలము ప | ర్విన దగ్ధము లగు ననేకవిధదేహుల దే
హనికాయంబుల బహువిధ | తనువులు గలవాఁడవోలె దహనుం డొప్పెన్‌.
265
చ. అమితకృశానుదగ్థ మగు నయ్యమరేంద్రువనంబులోని యు
త్తమసలిలాశయావళుల తప్తజలంబులయం దపేతజీ
వము లయి తేలుచుండె వరవారిచరంబులు వారిపక్షులుం;
గమరె నశేషకోకనదకైరవపంక్తులు శైవలంబులున్‌.
266
క. అలుగుల పడి ఖాండవమునఁ | గల యాశీవిషమహోరగము లెల్ల విషా
గ్నులు గ్రక్కుచు నత్యుగ్రా | నలబహులజ్వాలలందు నాశము వొందెన్‌.
267
వ. అంత దేవత లెల్ల మహావహ్నిశిఖాహతికి వెఱచి దేవేంద్రుపాలికిం బోయి ఖాండవవనంబున కైనయకాండ ప్రళయంబు సెప్పిన విని యదరిపడి యింద్రుండు తక్షకరక్షణాపేక్ష ననేకధారాధరనివహంబుతో నతిత్వరితగతి ఖాండవంబునకు వచ్చి హుతాశనుమీఁద మహావారిధారలు గురియించిన. 268
క. ఆ వారిధార లెల్ల మ | హావహ్ని శిఖాహతంబు లయి శుష్కము లై
లావఱి నడుమన యడఁగుటఁ | బావకు పయి నొక్కచినుకుఁ బడదయ్యె వడిన్‌.
269
క. ఉఱుముచు మెఱుముచుఁ బిడుగులు | వఱలఁగ నలుగడలఁ బడ నవారితవృష్టుల్‌
గుఱుకొని కురియఁగఁ బంచెను | మఱియును నయ్యనలుమీఁద మఘవుం డలుకన్‌.
270
క. పాండుసుతుఁ డంత నానా | కాండసహస్రముల నేసి ఘనముగఁ జేసెన్‌
ఖాండవగృహము నఖండా | ఖండలధారలకు దూఱఁ గాకుండంగన్‌.
271
వ. ఇట్లు కావించిన. 272
తే. దాని వెల్వడనేరక తద్వనంబు | జీవులెల్లను బావకశిఖలఁ జేసి
దగ్ధు లగుచున్నఁ దక్షకతనయుఁ డశ్వ | సేనుఁ డను భుజంగమ మగ్నిశిఖల కపుడు.
273
ఆ. వెఱచి తల్లిఁదోఁకఁ గఱపించుకొని దివిఁ | బఱచువానిఁ జూచి పార్థుఁ డలిగి
వానితల్లిశిరముతోన తత్పుచ్ఛంబు | దునిసి యగ్నిశిఖలఁ దొరఁగ నేసె.
274
వ. వెండియు నశ్వసేను నేయసమకట్టిన యప్పార్థునకుఁ దత్‌క్షణంబ మోహిని యను మాయ గావించి యమరేంద్రుఁ డశ్వసేను విడిపించి యందుఁ దక్షకుండు దగ్ధుం డయ్యెను కా వగచి కడు నలిగి. 275
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )