ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
ఇంద్రుండు కృష్ణార్జునులతోఁ బోరుట (సం. 1-218-13)
ఉ. ఆ నరుమీఁద ఘోరనిశితాశని వైచె నఖండ చండ ఝం
ఝానిలజర్జరీకృతమహాజలధారలతో నిరంతరా
నూన పయోధరప్రకర ముద్ధత మై హరిదంతరంబులన్‌
భానుపథంబు నొక్కమొగిఁ బర్వి భయంకరలీలఁ గప్పఁగన్‌.
276
ఉ. అ న్నవవారివాహ నివహమ్ములఁ జూచి భయప్రపన్నుఁ డై
యున్నహుతాశనున్‌ విజయుఁ డోడకు మంచును మారుతాస్త్రమ
త్యున్నతచిత్తుఁ డేసె; నదియున్‌ విరియించె రయంబుతో సము
త్పన్నసమీరణాహతి నపార పయోద కదంబకంబులన్‌.
277
వ. అంత. 278
సీ. బలవైరి కృష్ణుపైఁ బార్థుపై గడునల్గి | పంచినఁ గలయంగఁ బన్ని కడఁగి
సురగరుడోరగాసురసిద్ధగంధర్వు | లార్చుచుఁ దాఁకి యుగ్రాహవంబు
సేసిన నమరులఁ జెచ్చెరఁ బార్థుండు | భంజించెఁ దనదివ్యబాణశక్తిఁ;
జక్రధరుండును జక్రబలంబున | గరుడోరగాసురఖచరవరులఁ
 
ఆ. దత్‌క్షణంబ విగతదర్పులఁ జేసె; న | య్యిద్దఱకు సురాసురేశు లెల్ల
భీతు లగుట చూచి పెద్దయు విస్మిత | హృదయుఁ డయ్యె సురగణేశ్వరుండు.
279
వ. మఱియును వారల బల పరాక్రమంబు లెఱుంగ వేఁడి శక్రుండు శిలావర్షంబుఁ గురియించిన. 280
క. నిశితశరవర్షమున ను | గ్రశిలావర్షమ్ముఁ జిత్రగతి నస్త్రకలా
కుశలుఁడు నరుఁ డశ్రమమునఁ | బ్రశాంతిఁ బొందించె నమరపతి వెరఁగందన్‌.
281
క. కొడుకుభుజవిక్రమమునకుఁ | గడుసంతసపడియుఁ దృప్తిగానక చల మే
ర్పడఁగ హుతాశను నార్పం | గడఁగి మహారౌద్రభంగిఁ గౌశికుఁడు వడిన్‌.
282
చ. అరుదుగ దివ్యరత్ననివహంబులఁ జేసి వెలుంగుచున్న మం
దర శిఖరంబు నెత్తికొని తద్దహనార్చు లడంగునట్లుగాఁ
దెరలఁగ వైచినం దపనతేజుఁడు పాండుసుతుండు దానిజ
ర్జరితము సేసె వజ్రమయశాతశిలీముఖచండధారలన్‌.
283
క. ధరణీధరుచక్రమునకుఁ | బురుహూతతనూజుబాణముల కనిలో నె
వ్వరు మార్కొ ననోపరు సుర | గరుడోరగ సిద్ధసాధ్యగణములలోనన్‌.
284
వ. అంత నొక్కయశరీరవాణి పాకశాసనున కి ట్లనియె. 285
క. పరమమును లయిన తొల్లిటి | నరనారాయణులు కృష్ణనామంబుల ను
ర్వర నుదయించిరి; నీ క | య్యిరువుర పేర్మియును వింతయే దివిజేంద్రా!
286
చ. అలఘులు కృష్ణపార్థులు మహాత్ములు యాదవకౌరవాన్వయం
బులు వెలుఁగించుచున్న నృపపూజ్యులు; వీరల నీకు నోర్వఁగా
నలవియె? వీరు దొల్లియు సురాసుర యుద్ధమునాఁడు దైత్యులన్‌
వెలయఁగ నోర్చియున్న రణవీరులు గావుట ము న్నెఱుంగవే?
287
వ. నీయిష్టసఖుం డయిన తక్షకుం డిం దుండక ముందరన కురుక్షేత్రంబున కరిగి ఖాండవప్రళయంబునకుఁ దప్పె; ఖాండవం బగ్నిచేత దగ్ధం బగు నని తొల్లి బ్రహ్మవచనంబు గలుగుటం జేసి యిది హుతాశనున కశనం బయ్యె; నింక దీనికి వగవం బనిలే; దనిన దాని విని సురపతి సురగణంబులతో మరలిన. 288
క. బలయుతులు మనుజసింహులు | నలిఁ గృష్ణార్జునులు సింహనాదముల వియ
త్తలమును దిక్కులు బధిరం | బులుగాఁ జేసిరి త్రిలోకములు భయ మందన్‌.
289
వ. అట్టియవసరంబున నముచి యను దనుజుననుజుండు మయుం డనువాఁడు ఖాండవంబు వెలువడనేరక తక్షకుగృహంబునఁ బరిభ్రమించుచున్నంతఁ ద న్నగ్ని చుట్టుముట్టిన నచ్యుతుండును జంప వచ్చిన నతిభీతుం డై యర్జునుమఱువు సొచ్చిన. 290
వ. శరణాగతరక్షణత | త్పరుఁడు ధనంజయుఁడు మయునిప్రాణము గాచెం;
గరుణను శరణాగతులగు | పురుషుల రక్షించునంత పుణ్యము గలదే.
291
తే. మయుఁడు నశ్వసేనుండును మందపాల | సుతులు నలువురు శార్ఙ్గకు లతులదావ
దాహభీతి కయ్యార్వురుఁ దప్పి రన్య | జీవులెల్ల నం దపగతజీవు లైరి.
292
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )