ఇతిహాసములు భారతము ఆదిపర్వము - అష్టమాశ్వాసము
మందపాలోఖ్యానము (సం. 1-220-1)
వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 293
క. మయభుజగమోక్షణము ని | ర్ణయముగ నెఱిఁగితి, నెఱుంగ నా కర్థిత్వం
బయినది నలుగురు శార్ఙ్గకు | లయు మోక్షణ మెట్లు నిర్మలజ్ఞాననిధీ!
294
వ. అని యడిగిన జనమేజయునకు వైశంపాయనుం డి ట్లనియె. 295
క. జనపాల! మందపాలుం | డనుమునిముఖ్యుండు దొల్లి యత్యుగ్రతపం
బొనరించె బ్రహ్మచర్యం | బున దివ్యసహస్రవర్షములు నైష్ఠికుఁ డై.
296
క. అమ్ముని యోగాభ్యాసవ | శమ్మున దేహంబు విడిచి చని పుణ్యు లలో
కమ్ములు సొరఁ గానక వడిఁ | ద్రిమ్మరి దేవతలఁ గాంచి ధృతి ని ట్లనియెన్‌.
297
వ. ‘నాకుఁ బుణ్యలోకంబులు లేకుండ నే నేమి దుష్కృతంబు సేసితి?’ ననిన నమ్మునీంద్రునకు దేవత లి ట్లనిరి. 298
క. ఎంతతపం బొనరించియు | సంతానము లేనివారు సద్గతిఁ బొందం
గాంతురె? నీతప మేటికి | సంతానమువడయు మరిగి సన్మునినాథా!
299
వ. అనిన విని మందపాలుండు మర్త్యలోకంబునకుఁ దిరిగివచ్చి ‘నాకుం జెచ్చెరం బెక్కండ్రుపుత్త్రుల నెవ్విధంబునం బడయనగునో’ యని చింతించి, పక్షులయందు వేగంబ యపత్యంబు పెద్ద యగుటం జూచి, తానును శార్ఙ్గకుండై, జరిత యను లావుక పెంటియందు రమియించి, దానివలన జరితారి సారిసృక్కస్తంబమిత్ర ద్రోణు లనువారల నలువురఁ గొడుకులఁ బరమబ్రహ్మవిదులం బడసి, వారల ఖాండవవనంబునం బెట్టి, తనపూర్వభార్యయైన లపితయుం దానును విహరించుచు నొక్కనాఁడు ఖాండవదహనోద్యతుండై వచ్చుచున్న యగ్నిభట్టారకుం గని, యగ్నిసూక్తంబుల స్తుతియించి యి ట్లనియె. 300
క. నీ వఖిల ధర్మమూర్తివి; | నావీర్యప్రభవు లయిన నలువురుసుతులన్‌
లావుకలఁ గరుణఁ గావుము | పావక! భువనోపకారపర్యాప్తమతీ!
301
వ. అనిన నమ్మందపాలుప్రార్థనంజేసి యానలువురు శార్ఙ్గకులను నగ్నిదేవుండు రక్షించువాఁ డయ్యె; నంత నిట 302
క. తనయుల నజాతపక్షుల | ననలశిఖాభీతిచంచలాత్ముల నెటయుం
జననేరనిబాలకులను | జననియు వీక్షించి శోకసంతాపిత యై.
303
క. వీరలఁ దోడ్కొనిపోవఁగ | నేరను బాలకులఁ బెట్టి నిర్దయబుద్ధిన్‌
వీరలతండ్రిక్రియం జన | నేరను; విధికృతము గడవనేరఁగ లావే.
304
చ. ఇది ప్రళయాగ్నివోలె దెసలెల్లను గప్పఁగ విస్ఫులింగముల్‌
వదలక వాయుసారథిజవంబునఁ దా నిట వచ్చె నేమి సే
యుదు సుతులార! యీబిలము నొయ్యన పోయి చొరుండు దీనిఁ గ
ప్పెద ఘనపాంసుజాలముల భీమశిఖావళి దాఁకకుండఁగన్‌.
305
చ. కొడుకుల బ్రహ్మవిత్తములఁ గోరినయట్టుల వీరి నల్వురం
బడసితి; నిమ్మహాత్ముల నపాయము నొందకయుండఁ బెంచుచున్‌
నడపుమటంచు నన్ను మునినాథుఁడు మీజనకుండు పంచి యి
ప్పుడ యెటయేనిఁ బోయె హుతభుక్‌ప్రళయంబు దలంప కక్కటా!
306
వ. అని దుఃఖిత యై యున్న తల్లిం జూచి యగ్రతనయుం డైన జరితారి యి ట్లనియె. 307
తే. బిలము సొచ్చితిమేని నం దెలుక చంపు; | నింద యుండితిమేనిఁ దా నేర్చు నగ్ని;
యెలుకచేఁ జచ్చుకంటె నీజ్వలన శిఖలఁ | గ్రాఁగి పుణ్యలోకంబులఁ గాంతు మేము.
308
వ. మఱియు మాంసపిండంబుల మయియున్న మాకు బిలప్రవేశంబున మూషకభయంబు నియతం బింద యుండిన నగ్నిభయంబు సంశయితం బె ట్లనిన. 309
క. జ్వలనంబు వాయువశమునఁ | దొలఁగుడు జీవనము మాకు దొరకొనుఁ; గృచ్చ్రం
బుల సంశయయుతకార్యం | బులు గర్తవ్యములు; నియతములు వర్జ్యమ్ముల్‌.
310
వ. ‘కావున నీవు మెచ్చినచోటికిఁ బోవనోపము; మావలని మోహంబు విడిచి యరుగు; మేము దహనక్లేశంబునం బొందినను నీవు జీవించి పుత్త్రులం బడయనోపుదువు; నీపుణ్యవశంబున మాకు నగ్నిభయంబు దొలంగెనేని నీవు మాయొద్దకు వచ్చి యెప్పటియట్ల రక్షింతు’ వని కొడుకు లెల్ల మ్రొక్కినం జూచి, జరితయు బాష్పపూరితనయన యై యాసన్నతరుగుల్మగహనదహనమహోత్సాహుం డయి వచ్చు హవ్యవాహనుం జూచి, ప్రాణభయంబున గగనంబున కెగసి చనె నంత. 311
క. నలుగురు నాలుగు వేద | మ్ములమంత్రము లొప్ప బ్రహ్మముఖములు వోలెన్‌
వెలయంగ సంస్తుతించుచు | నలఘులు మా కభయ మభయ మని రయ్యనలున్‌.
312
వ. అగ్నిదేవుం డప్పుడు మందపాలుప్రార్థనం దలంచి యన్నలువురు శార్ఙ్గకులు నున్న వృక్షంబు భక్షింపక పరిహరించిన జరితయు దానిం జూచి సంతసిల్లి కొడుకులయొద్దకు వచ్చి సుఖం బుండె; నంత నక్కడ మందపాలుండు పురందరువనంబు దహనుచేత దగ్ధం బగుట యెఱింగి, యం దున్న జరితను బుత్త్రులం దలంచి యతిదుఃఖితుం డయి లపిత కిట్లనియె. 313
క. తరుణుల నజాతపక్షులఁ | జరణంబులు లేనివారి శార్ఙ్గేయుల న
ల్వుర నొక్కతె యెట దోడ్కొని | యరుగంగా నేర్చు జరిత యాపద గడవన్‌.
314
క. మఱచునొకొ! మఱవకుండియు | నెఱుఁగక యుండునొకొ! యనలుఁ దెఱిఁగియు నెడ నే
మఱునొకొ! పుత్త్రులఁ గావక | గుఱుకొని; నమ్మంగ నగునె క్రూరాత్మకులన్‌.
315
వ. అనిన విని లపిత యిట్లనియె. 316
క. నాయొద్దన ప్రార్థించిన | వాయుసఖుం డపుడు నీకు వరదుం డయి శా
ర్ఙ్గేయుల నలువురఁ గాతును | ధీయుత! యని పలికె మఱచితే మునినాథా!
317
వ. ‘ఆలికి నెయ్యుండ వయి దానియోగక్షేమం బరయం దలంచి; తది పులుఁ గెటయేనియుం బఱచుం గా కేమి యయ్యెడు; వగవకుండు’ మనిన మందపాలుండు మందస్మితవదనుం డగుచు ‘వసిష్ఠు నట్టి పురుషు నైన నరుంధతియట్టి భార్య యైనను నిర్నిమిత్తంబున స్త్రీవిషయంబునందు సంశయింపకుండ’ దిది స్త్రీలకు నైజంబ యని పలికి లపిత వీడ్కొని, ఖాండవంబునకు వచ్చి పుత్త్రసహిత యయి కుశలిని యయి యున్న జరితం జూచి సంతుష్టుండై నిజేచ్ఛ నరిగె; నగ్నిదేవుండు నిట్లు నిర్విఘ్నంబున ఖాండవవనౌషధంబు లుపయోగించి విగతరోగుండయి కృష్ణార్జునుల దీవించి చనియె; నంత. 318
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )