ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
మయుం డొక్కసభను నిర్మించి ధర్మజున కిచ్చుట (సం. 2-1-1)
వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె: నట్లు ధర్మతనయునొద్ద వాసుదేవ సహితుం డయి యున్న యర్జునున కతిప్రీతిం గృతాంజలి యయి మయుం డిట్లనియె. 2
క. ఘనముగఁ బ్రాణము రక్షిం | చిన యుపకారికిఁ బ్రియంబు సేయుదు నన నే
ర్తునె; యైనను నీకుఁ బ్రియం | బనఘా! చేయంగ నిష్టమైనది నాకున్‌.
3
వ. ‘ఏను దానవ విశ్వకర్మ, ననేకవిధ శిల్ప కలా కుశలుండ; మీ కిష్టంబయిన దాని నిర్మించెదం బనుపుం’ డనిన నర్జునుం డచ్యుతుమొగంబు చూచి ‘యతని నెద్దియేనియు నొక్క యపూర్వం బయినదాని నిర్మింప నియోగింపు’ మనినఁ గృష్ణుండు పెద్దయుంబ్రొద్దు విచారించి మయున కిట్లనియె. 4
చ. కురుపతికిన్‌ యుధిష్ఠిరునకున్‌ సకలక్షితిపాలసేవ్యసు
స్థిర విభవాభిరామున కతిప్రమదంబుగ రత్నరాజిసుం
దర మగు దాని నొక్క సభ ధాత్రి కపూర్వముగా నొనర్చి చె
చ్చెరఁ గొనిరమ్ము నీదయిన శిల్పకలాకుశలత్వ మేర్పడన్‌.
5
వ. అనిన వాసుదేవునకు మయుం డిట్లనియె. 6
ఉ. ఇమ్మనుజేంద్రుఁ డింద్రదనుజేంద్రులకంటె మహావిలాస సౌ
ఖ్యమ్ములఁ బెద్ద యిద్ధరణిఁ గావున, నీతని పేర్మికిం దగన్‌
నెమ్మి నొనర్చెదన్‌ సభ మణిప్రభ నొప్పఁగ, దేవతావిమా
నమ్ములు నిట్టివే యని జనమ్ములు దానిన మెచ్చి చూడఁగన్‌.
7
వ. తొల్లి వృషపర్వుండను దానవేంద్రున కొక్కసభ నిర్మింప సమకట్టి వివిధ రత్నమయంబులయిన యుపకరణంబు లొడఁగూర్చి బిందుసరంబను కొలన సంగ్రహించినవాఁడ; నయ్యుపకరణంబుల దాని విచిత్రంబుగా రచియించి తెచ్చి ధర్మరాజున కిచ్చెద; మఱియును భౌమాదిత్యుండను రాజర్షిచేత నిహితంబయి సకలశత్రుఘాతినియైన దాని భీమసేనున కొక్కగదను. దారుణంబయిన దివ్యఘోషంబు గలుగు దేవదత్తంబను శంఖం బర్జునునకు నిచ్చెద’నని చెప్పి ధర్మరాజుచేత సత్కృతుండై మయుం డరిగె; నంత నిట నారాయణుండును బాండవుల వీడ్కొని పితృదర్శనలాలసుండై ద్వారవతీపురంబున కరిగె; నట మయుండును బూర్వోత్తరదిశాభిముఖుండై పోయి కైలాసంబునుత్తరంబున మైనాకశైలంబునందు హిరణ్యశృంగంబున. 8
సీ. ఎందేని సర్వభూతేశుండు సృజియించె | సచరాచరములైన జగము లెల్ల,
గంగఁ బ్రత్యక్షంబు గావింప నెందేనిఁ | గృతవాసుఁ డయ్యె భగీరథుండు.
నలినసంభవ నరనారాయణస్థాణు | వాసవప్రభృతి గీర్వాణముఖ్యు
లెందేనిఁ గ్రతువు లనేకయుగంబులఁ | జేసిరి, రత్నవిచిత్ర వితత
 
ఆ. చైత్యములు మహా విశాల హిరణ్మయ | యూపతతులు నోలి నొప్పు చుండ,
నట్టి బిందుసరమునందున్న వివిధర | త్నోపకరణచయము లొనరఁ గొనియె.
9
క. దేవబ్రాహ్మణులకు నా | నావిధపూజనలఁ దర్పణము సేసి ధరి
త్రీవనిత కపూర్వశ్రీఁ | గావింపఁ దొడంగె మయుఁడు గడు రమ్యముగన్‌.
10
క. విమల మణిమయము లగు దూ | లములం గంబముల గోడలను వేదులఁ గు
ట్టిమములఁ జుట్టిన ప్రాకా | రములను గర మొప్పుచుండ రచియించె సభన్‌.
11
వ. మఱియును. 12
సీ. సురుచిరహరినీలకిరణజలంబులఁ | బద్మరాగారుణపద్మములను
రాజితరాజీవరాజహంసావళి | నిర్మలసౌవర్ణకూర్మములను
గమనీయవైదూర్యకుముదంబులను వజ్ర | మీనమౌక్తికనవఫేనములను
మరకతశైవలోత్కరముల విలసిల్లఁ | గొల నని సన్మణిస్థలము చూచి
 
ఆ. పలుఁగురాలకుడ్యముల రుచుల్‌ గప్పిన | జలము లున్నయెడల వెలయఁ జూచి
యననుపస్థలంబు లని జను లెఱుఁగక | యుండునట్లుగా మయుండు సేసె.
13
వ. మఱియు సకలజన మనోహరంబు లైన నానావిధ యంత్రంబులును, ననవరత కుసుమఫలభరితంబు లైన తరువనంబులును, వికచ కమల కుముదాభిరామంబులైన జలాశయంబులును, వివిధ విచిత్ర పతాకావలంబిత తోరణ విటంక ప్రదేశంబులునుం గలిగి దశ కిష్కు సహస్ర ప్రమాణవృత్తాయతంబును. సహస్రకర ప్రభా ప్రసర విస్తార విభూతియును వివిధరత్న విభవాభిశోభితంబునుంగా నపూర్వ సభా భవనంబు నందుఁ బదునాలుగు నెలలు నిర్మించి, దాని నెనిమిది వేల రాక్షస కింకరుల మహాకాయుల మహాజవసత్త్వ సంపన్నుల నంతరిక్ష చరులం బనిచి మోపించికొని వచ్చిధర్మరాజున కిచ్చి, గదయును శంఖంబును భీమార్జునుల కిచ్చి, ధర్మరాజుచేత సత్కృతుండయి మయుం డరిగిన. 14
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )