ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
ధర్మరాజు సభాప్రవేశము కావించుట (సం. 2-4-1)
ఉ. వీరుఁడు ధర్మజుండు పదివేవురు విప్రుల కొప్పఁ బాయసా
హారము భక్తిఁ బెట్టి మఱి యందఱకుం జెఱు వేయునేసి వి
స్తారయశుండు ధేనువుల ధర్మవిధిన్‌ మణి ముద్రికాద్యలం
కార దుకూల పుష్పఫల గంధయుతంబుగ నిచ్చి లీలతోన్‌.
15
వ. అనుజసహితుం డయి దైవజ్ఞదత్తశుభముహూర్తంబున ధౌమ్యాదిభూసురాశీర్వాదపుణ్యాహనాదంబు లెసంగ సభాప్రవేశంబు సేసి యంత. 16
ఉ. మంచిగ భూరి భూసుర సమాజమునెల్లను భక్తితోడఁ బూ
జించి, యభీష్టదానములు సేసి, ధనార్థులఁ దన్పి దిక్కులన్‌
నించె యశంబు; బంధులకు నెయ్యురకున్‌ హృదయప్రియంబు గా
వించె విభూతి యేర్పడఁ బవిత్రుఁడు ధర్మసుతుండు నెమ్మితోన్‌.
17
వ. తదవసరంబున. 18
మ. మదమాతంగ తురంగ కాంచన లసన్మాణిక్య గాణిక్య సం
పద లోలిం గొని వచ్చి యిచ్చి, ముదమొప్పం గాంచి, సేవించి, ర
య్యుదయాస్తాచల సేతుశీతనగ మధ్యోర్వీపతుల్‌ సంతతా
భ్యుదయున్‌ ధర్మజుఁ దత్సభాస్థితు జగత్పూర్ణ ప్రతాపోదయున్‌.
19
వ. మఱియును 20
సీ. సుబల మార్కండేయ శునక మౌం జాయన | మాండవ్య శాండిల్య మందపాల
బక దాల్భ్య రైభ్యక భాలుకి జతుకర్ణ | గౌతమ కౌశిక కణ్వ కుత్స
సావర్ణి పర్ణాద సత్య గోపతి గోప | వేష మైత్రేయ పవిత్రపాణి
ఘటజాను కాత్రేయ కఠకలాప సుమిత్ర | హారీత తిత్తిరి యాజ్ఞవల్క్య.
 
ఆ. వాయుభక్ష భార్గవ వ్యాస జైమిని | శుక సుమంతు పైల సువ్రతాదు
లయిన మునులు నేము నరిగితి మెంతయు | రమ్యమయిన ధర్మరాజుసభకు.
21
వ. అమ్మహామునుల నెల్ల నతిభక్తిం బూజించి లబ్ధాశీర్వచనుండై ధర్మతనయుండు వారలవలన ధర్మకథలు వినుచుఁ దమ్ములుం దానును సుఖంబుండునంత నొక్కనాఁడు. 22
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )