ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయంబులం గొన్నింటి నడుగుట (సం. 2-5-7)
సీ. మీ వంశమున నరదేవోత్తములదైన | సద్ధర్మమార్గంబు సలుపుదయ్య?
ధర్మవిదుండవై ధర్మార్థకామంబు | లొండొంటి బాధింపకుండ నుచిత
కాల విభక్తముల్‌ గా లీల సేవింతె? | ధర్మువునంద చిత్తంబు నిలిపి
యిమ్ముల నపరరాత్రమ్ములం దెప్పుడుఁ | జింతింతె నిజబుద్ధిఁ జేయఁదగిన
 
ఆ. రాజకృత్యములఁ? దిరంబుగా నిఖిల ని | యోగ వృత్తులందు యోగ్యులయిన
వారిఁ గరము గారవమ్మునఁ బంచితె | నీవు వారిదైన నే ర్పెఱింగి.
26
క. అనఘుల శాస్త్ర విధిజ్ఞుల | ననురక్తులఁ బితృపితామహక్రమమున వ
చ్చిన విప్రుల మంత్రులఁగా | నొనరించితె కార్య సంప్రయోగము పొంటెన్‌.
27
క. రాజునకు విజయమూలము | రాజితమంత్రంబు; సుస్థిరంబుగ దానిన్‌
రాజాన్వయ! రక్షింతె ధ | రాజనులకుఁ గర్ణగోచరము గాకుండన్‌.
28
క. ధీరుఁడు ధర్మాధర్మ వి | శారదుఁడు బహుశ్రుతుండు సమచిత్తుఁడు వా
ణీ రమణీ శ్రిత వదన స | రోరుహుఁ డనఁ జనునె నీ పురోహితుఁ డధిపా!
29
క. జనవర! నీ యజ్ఞములం | దనవరతనియుక్తుఁ డయిన యాజ్ఞికుఁడు ప్రయో
గ నిపుణుఁడై యేమఱకుం | డునె నిజకృత్యముల నెప్పుడును సమబుద్ధిన్‌.
30
క. నానావిధరణవిజయమ | హానిపుణు లవార్యవీర్యు లనఁదగువారిన్‌
సేనాధ్యక్షులఁ జేసితె | నీ నమ్మినవారి మాననీయుల హితులన్‌.
31
చ. కడుఁ జనువాఁడునై పురుషకారియు దక్షుఁడు నైన మంత్రి పెం
పడరఁగ రాజపుత్త్రుల మహాధనవంతులఁ జేసి వారితో
నొడఁబడి పక్ష మేర్పడఁగ నుండఁడుగా, ధన మెట్టి వారికిం
గడుకొని చేయకుండునె జగన్నుత! గర్వము దుర్విమోహమున్‌.
32
క. క్షితినాథ! శాస్త్రదృష్టి | ప్రతిభను దివ్యాంతరిక్ష భౌమోత్పాత
ప్రతికారులగుచు సన్మా | నితులయి వర్తింతురయ్య నీదైవజ్ఞుల్‌.
33
క. అనిశము సేవింతురె ని | న్ననఘా! యష్టాంగమైన యాయుర్వేదం
బున దక్షులైన వైద్యులు | ఘనముగ ననురక్తులై జగద్ధితబుద్ధిన్‌.
34
క. సారమతిఁజేసి మానస | శారీర రుజావళులకు సతతంబుఁ బ్రతీ
కారములు సేయుచుండుదె | యారఁగ వృద్ధోపసేవ నౌషధసేవన్‌.
35
క. ఉపధాశుద్ధులఁ బాప | వ్యపగతబుద్ధుల వినీతివర్తుల సములన్‌
సుపరీక్ష నియోగించితె | నిపుణుల నర్థార్జనాదినృపకార్యములన్‌.
36
ఉ. ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత బుద్ధి నెఱింగి వారి న
య్యుత్తమ మధ్యమాధమ నియోగములన్‌ నియమించితే నరేం
ద్రోత్తమ! భృత్యకోటికి ననూనముగాఁ దగు జీవితంబు లా
యత్తము సేసి యిత్తె దయ నయ్యయికాలము దప్పకుండఁగన్‌.
37
క. తమ తమ కనియెడు తఱి జీ | తము గానక నవయు భటుల దౌర్గత్య విషా
దము లేలినవాని కవ | శ్యము నెగ్గొనరించు నతఁడు శక్రుం డైనన్‌.
38
క. కులపుత్త్రులైన సద్భృ | త్యులకును సత్కార మర్థితోఁ జేయుదె? వా
రలు నీప్రస్తవమున ని | మ్ములఁ గృతము దలంచి ప్రాణములు విడుతు రనిన్‌.
39
క. అనఘా! నీ ప్రస్తవమున | నని నీల్గినవీరభటుల యనుపోష్యుల నె
ల్లను బ్రోతె భోజనాచ్ఛా | దనముల వారలకు నెమ్మి దఱుఁగక యుండన్‌.
40
క. ధనలుబ్ధుల మ్రుచ్చులఁ గూ | ర్పని వారలఁ బగఱవలని వారల ధృతి చా
లని వారల దుర్జనులం | బనుపవుగా రాజకార్యభారము దాల్పన్‌.
41
క. చోరభయవర్జితముగా | ధారుణిఁ బాలింతె, యధికధనలోభమునం
జోరుల రక్షింపరుగా | వారలచే ధనముగొని భవద్‌భృత్యవరుల్‌.
42
క. ధరణీనాథ! భవద్భుజ | పరిపాలితయైన వసుధఁ బరిపూర్ణములై
కర మొప్పుచున్నె చెఱువులు | ధరణి కవగ్రహభయంబు దనుకక యుండన్‌.
43
క. హీనులగు కర్షకులకును | భూనుత! ధాన్యంబు బీజములు, వణిజులకున్‌
మానుగ శతైకవృద్ధి న | నూనముగా ఋణము లిత్తె యుత్తమబుద్ధిన్‌.
44
క. పంగుల మూకాంధుల విక | లాంగులను నబాంధవుల దయం బ్రోతె? భయా
ర్తుం గడిఁది శత్రునైనను | సంగరరంగమునఁ గాతె శరణం బనినన్‌.
45
క. కృత మెఱిఁగి కర్త నుత్తమ | మతుల సభల సంస్తుతించి మఱవక తగు స
త్కృతి సేయుదె? కృత మెఱిఁగెడు | పతియె జగజ్జనుల నెల్లఁ బరిపాలించున్‌.
46
సీ. ఆయంబునందు నాలవ భాగమొండె. మూఁ | డవ భాగమొండె, నం దర్ధమొండె
గాని మిక్కిలి సేయఁగాదు వ్యయం బని | యవధరించితె బుద్ధి నవనినాథ!
యాయుధాగారధనాధ్యక్ష్యములయందు | వరవాజివారణావళులయందు
బండారములయందుఁ బరమవిశ్వాసుల | భక్తుల దక్షులఁ బంచితయ్య?
 
ఆ. గురుల వృద్ధశిల్పివరవణి గ్బాంధవ | జనుల నాశ్రితులను సాధుజనులఁ
గరుణఁ బేదఱికము వొరయకుండఁగఁ బ్రోతె | సకలజనులు నిన్ను సంస్తుతింప.
47
క. వలయు నమాత్యులుఁ జుట్టం | బులు మూలబలంబు రాజపుత్త్రులు విద్వాం
సులు బలసియుండ నిచ్చలుఁ | గొలువుండుదె లోక మెల్లఁ గొనియాడంగన్‌.
48
క. పరికించుచు బాహ్యాభ్యం | తరజనములవలన సంతతము నిజరక్షా
పరుఁడ వయి పరమహీశుల | చరితము వీక్షింతె నిపుణచరనేత్రములన్‌.
49
క. వెలయఁగ విద్వజ్జన ము | ఖ్యులతోడ నశేషధర్మకుశలుఁడ వయి యి
మ్ముల లోకవ్యవహార | మ్ములు దయఁ బరికింతె నిత్యమును సమబుద్ధిన్‌.
50
ఆ. వార్తయంద జగము వర్తిల్లుచున్నది; | యదియు లేనినాఁడ యఖిలజనులు
నంధకారమగ్ను లగుదురు గావున | వార్త నిర్వహింపవలయుఁ బతికి.
51
ఆ. దారసంగ్రహంబు ధరణీశ! రతి పుత్త్ర | ఫలము, శీలవృత్తఫలము శ్రుతము,
దత్తభుక్తఫలము ధనము, వేదము లగ్ని | హోత్ర ఫలము లనియు నొగి నెఱుంగు.
52
చ. బహుధనధాన్యసంగ్రహము బాణశరాసనయోధవీరసం
గ్రహము నిరంతరాంతరుదకంబులు ఘాసరసేంధనౌఘ సం
గ్రహము ననేకయంత్రములుఁ గల్గి యసాధ్యములై ద్విషద్భయా
వహు లగుచుండ నొప్పునె భవత్పరిరక్ష్యములైన దుర్గముల్‌.
53
చ. వదలక బుద్ధి నంతరరివర్గము నోర్చి జితేంద్రియుండ వై
మొదలన దేశకాలబలముల్‌ మఱి దైవబలంబుఁ గల్గి భూ
విదిత బలుండవై యహితవీరుల నోర్వఁగ నుత్సహింతె దు
ర్మద మలినాంధ చిత్తులఁ బ్రమత్తుల నింద్రియనిర్జితాత్ములన్‌.
54
తే. కడిఁది రిపులపైఁ బోవంగఁ గడఁగి యున్న | నీకు ముందఱఁ జని రిపునృపులయందుఁ
దగిలి సామాద్యుపాయంబు లొగిన సంప్ర | యోగమునఁ జేసి వర్తిల్లుచున్నె చెపుమ.
55
వ. ‘మఱియు నాస్తిక్యం బనృతంబు ప్రమాదం బాలస్యం బనర్థజ్ఞులతోడి చింతనంబు క్రోధంబు దీర్ఘచింత దీర్ఘ సూత్రత యెఱుకగలవారి నెఱుంగమి యర్థంబుల యందనర్థక చింత నిశ్చితకార్యంబులు సేయమి మంత్రంబుల రక్షింపమి శుభంబులఁ బ్రయోగింపమి విషయంబులం దగులుట యనంబరఁగిన పదునాలుగు రాజదోషంబులఁ బరిహరింతె?’ యని యడిగిన నారదునకు ధర్మరా జి ట్లనియె. 56
తే. నాయథాశక్తిఁ జేసి యన్యాయపథముఁ | బరిహరించి మహాత్ముల చరితలందు
బుద్ధి నిలిపి మీ యుపదేశమున శుభంబు | లయిన వాని ననుష్ఠింతుఁ బ్రియముతోడ.
57
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )