ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
ఇంద్రసభావర్ణనము (సం. 2-7-1)
క. శతమఖుసభ శుభరత్నాం | చితకాంచనరచిత, మతివిచిత్రము, లోక
త్రితయాఖిల లక్ష్మీ సం | శ్రిత; మలవియె దానిఁ బొగడ శేషున కయినన్‌.
62
వ. అదియును నూఱుయోజనంబుల వెడల్పును, నూటయేఁబది యోజనంబుల నిడుపును, నేను యోజనంబుల తనర్పునుం గలిగి, వైహాయసంబయి, కామగమనంబయి, వ్యపేతశీతాతపంబయి, సకల కాల కుసుమ ఫలభరిత పాదపవన సంకీర్ణ సరోవర విరాజితంబయి, తపఃప్రభావంబున నమరేంద్రుచేత నిర్మితంబయి కరం బొప్పుచుండు; నట్టి సభయందు. 63
చ. అతుల విభూతితో మణిమయాభరణద్యుతు లొప్పఁగా శత
క్రతుఁడు శచీసమేతుఁడయి కాంచన చారు విమానమాలికా
గత దివిజోత్తముల్‌ గొలువఁగాఁ గొలువుండు వరాప్సరోంగనా
యత విలసత్కటాక్ష కుసుమార్చిత సుందర వక్త్ర చంద్రుఁడై.
64
వ. మఱియును. 65
సీ. వదలక యేలినవాని ప్రస్తవమునఁ | బోరిలో నీల్గిన వీరభటులుఁ,
దమకుల ధర్మముల్‌ దప్పక సలిపిన | గృహమేధులును, జగన్మహితకీర్తిఁ
బరఁగిన ధన్యులుఁ, బరహితవ్రతులైన | పురుషులు, రుగ్జరా మరణ శోక
భయ బుభుక్షార్తి పిపాసా వ్యపేతులై | కొలుతురు సురరాజు నొలసి యర్థ
 
ఆ. ధర్మకామములు సదక్షిణ క్రతువులు | శ్రీ విలాసములు విశేషయజ్ఞ
వాహమంత్ర తతులు వచ్చి సేవింతురు | మూర్తిమంతు లగుచు ముదముతోడ.
66
వ. మఱియు శుక్రబృహస్పతులు నగ్నీషోములు నాశ్వినులు విశ్వదేవతలును ధాతయు విధాతయు హరిశ్చంద్రుం డను రాజర్షియు సురేంద్రసభ నుండుదురు. 67
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )