ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
యమసభావర్ణనము (సం. 2-8-1)
క. ధర్ముసభ లోక ధర్మా | ధర్మ వివేకాస్పదంబు, తైజసము; లస
ద్భర్మమణితతుల దానిన్‌ | నిర్మించెను విశ్వకర్మ నిపుణత యొప్పన్‌.
68
వ. అది శతయోజనవిస్తారాయామరమణీయంబును గామగామియును సూర్యతేజోనిభశుభతేజంబును సర్వసుఖసంపాదనంబు నయి చూడనొప్పుచుండు; నట్టి సభయం దగస్తిమతంగాదిసిద్ధమునులును బితృదేవతలును గాలకింకరులును మూర్తిమంతులైన కాలచక్రక్రతుదక్షిణదిగ్దేవతలును నుగ్రతపంబులును గృతవీర్యజనమేజయజనకబ్రహ్మదత్తపృషదశ్వశంతనువైన్యభూరిద్యుమ్నేంద్రద్యుమ్నమన్మథ మధుకంఠోపరిచరులును మీ జనకుండయిన పాండుమహారాజును నాదిగాఁ గల యనేకరాజఋషులు నుందురు; వీరిచేత ననవరతంబు సేవితుండయి యమరాజు సమస్తజీవుల శుభాశుభకర్మంబు లారయుచుండు. 69
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )