ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
వరుణసభావర్ణనము (సం. 2-9-1)
క. వరుణసభ సర్వలోకో | త్తర ముజ్జ్వలమణిమయము సితప్రభ మతిసుం
దర మందుండు వరుణుఁడును | వరుణానీసహితుఁడై ధ్రువంబగు మహిమన్‌.
70
వ. అది యమరాజు సభయంతియ విస్తారాయామ రామణీయకంబులును గామగామిత్వంబునుం గలిగి విలసిల్లు; జలస్తంభంబు సేసి జలంబులలో నుండి విశ్వకర్మ దాని రమణీయంబుగా రచియించె. 71
సీ. అందు సుఖాసీనుఁడైన యవ్వరుణేంద్రు | నంబుధుల్‌ నాల్గును నధికభక్తిఁ
గాళింది నర్మద గంగ గోదావరి | విదిశ విపాశ కావేరి కృష్ణ
వేణి సరస్వతి పెన్న యైరావతి | యనఁగఁ బ్రసిద్ధంబులయిన నదులు
సరసీతటాక నిర్ఝర దీర్ఘికాదులు | దిక్కులు నఖిల ధాత్రీధరములు
 
ఆ. వసుమతియును దేహవంతంబులై వచ్చి | మకర కూర్మ శింశుమార సింహ
శరభ సామజాది జలచర స్థలచర | తతులతోడ సంతతంబుఁ గొలుచు.
72
వ. మఱియు వాసుక్యైరావతాది నాగరాజులును బ్రహ్లాద విరోచన బలి నరక నముచి విప్రచిత్తి కాలకంఠ కైటభ ఘటోదర దశగ్రీవ విశ్వరూప విరూపాక్షాదులయిన దైత్యదానవ వరులును వరుణు సేవించుచుండుదురు. 73
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )