ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
కుబేర సభావర్ణనము (సం. 2-10-1)
క. ధనదుసభ యింద్రసభతో | నెనయగుచు మహావిభూతి నెంతయు నొప్పుం
దన దివ్యశక్తి నాతం | డొనరఁగ నిర్మించె దాని నుత్తమమణులన్‌.
74
వ. అదియును నూఱుయోజనంబుల నిడుపును డెబ్బదియోజనంబుల వెడల్పునుం గలిగి సితప్రభంబయి గగనచరంబయి కనకమయతరులతాలంకృతం బయి తటిల్లతావిచిత్రశరదంబుదంబు ననుకరించు చుండు. 75
క. అందుఁ గుబేరుఁడు పరమా | నందంబున నుండు ధర్మనందన! విలస
న్మందార పారిజాతక | నందన మందానిలాభినందితుఁ డగుచున్‌.
76
వ. అతని ననవరతంబును నరకిన్నర నాములైన గంధర్వులును, వరాహకర్ణ గజకర్ణ మాణిభద్ర హేమనేత్ర విభీషణ పింగళక ప్రవాళకాదులయిన యక్షులును, నలకూబరుండును, నూర్వశీతిలోత్తమా ఘృతాచీ మేనకా విభావరీ రంభా ప్రభృతులయిన యప్సరసలును సేవింతు; రే నెప్పుడు ననేక దేవర్షి గణంబులతో నరిగి చూచుచుండుదు. 77
ఉ. వానికి నెయ్యుఁడై యమరవంద్యపదాంబుజుఁ డంబికా బృహ
త్పీనపయోధరాగ్ర పరిపీడితవక్షుఁడు భూషణీకృతా
హీనుఁ డశేషలోకగురుఁ డీశ్వరుఁ డెప్పుడు నంద యుండు నా
నా నిశితాయుధాయుతసనాథమహాద్భుతభూతకోటితోన్‌.
78
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )