ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
బ్రహ్మసభావర్ణనము (సం. 2-11-1)
వ. ఏను దొల్లి మనుష్యలోకంబునం గొండొక కాలంబున్న నా కడకు సూర్యుండు వచ్చి పితామహు సభ వర్ణించినఁ దద్దర్శన కుతూహలుండ నయి యాదిత్యుతోడన యరిగి యక్కమలగర్భుసభం జూచితి. 79
చ. దళితవిరోధి! యిట్టి దని దాని తెఱం గెఱుఁగంగ బ్రహ్మకుం
గొలఁదియె తా నవాఙ్మనసగోచర మద్భుతరూప మీ వియ
త్తల మను కంబ మొక్కటియ తాల్పఁగ సుస్థిరమై నిజప్రభా
వలి వెలుఁగించుచుండు శశివారిజమిత్త్రుల మండలంబులన్‌.
80
వ. ‘అం దనేకవిధ జీవరాసుల సృజియించుచు నధికతపస్వుల తపఃఫలంబులు విధించుచు విశ్వకర్తలైన మన్వత్రి మరీచి భృగు భరద్వాజ దక్ష వసిష్ఠ వాలఖిల్య పులస్త్య పులహ క్రతు కశ్యప గౌతమాంగిరః ప్రచేతసులును, జంద్రాదిత్యగ్రహనక్షత్రగణంబులును, దేవగణంబులును, వసురుద్రసిద్ధసాధ్యులును, బ్రజావంతులైన పంచాశత్సహస్రమునులును, నూర్ధ్వరేతసులయిన యష్టాశీతిసహస్రమునులును. నాశ్వినులును, విశ్వదేవతలును, విశ్వకర్మయుం, బితృదేవతలునుం దన్నుం బరివేష్టించి యుండ ధర్మార్థకామమోక్షంబులును, శబ్దస్పర్శరూపరసగంధంబులును, దపశ్శమదమంబులును, ధృతి స్మృతి మేధాబుద్ధి క్షమా కీర్తులును, సంకల్ప వికల్పప్రణవంబులును, క్షణలవత్రుటి కాష్ఠా ముహూర్తాహోరాత్ర పక్షమాస ఋతు సంవత్సర యుగాత్మకంబైన కాలచక్రంబును. ఋగ్యజుస్సామాథర్వణవేదవేదాంగంబులును, బురాణేతిహాసంబులును, బహుప్రకారభాషలును, సమస్తవిద్యలును మూర్తిమంతంబులైకొలువ సరస్వతీ సమేతుండై పరమానందంబునం బరమేష్ఠి పద్మాసనంబున నుండు’ నని లోకపాలురసభలను బ్రహ్మసభను వర్ణించిన నారదునకు ధర్మరా జి ట్లనియె. 81
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )