ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
హరిశ్చంద్రుమాహాత్మ్యము (సం. 2-11-48)
మధ్యాక్కర. పరమధర్మాత్మకుఁ డయిన పాండుభూపతిఁదొట్టి సకల
ధరణీశులెల్ల యముసభ నుండంగఁ, దా నేమి పుణ్య
చరితఁ బ్రవర్తిల్లెనయ్య దేవేంద్రసభ హరిశ్చంద్రుఁ
డురుతరమహిమతో దేవపూజ్యుఁడై యుండంగఁ గనియె?
82
వ. అని యడిగిన ధర్మరాజునకు హరిశ్చంద్రు మహిమాతిశయంబు నారదుం డి ట్లని చెప్పె. 83
ఉ. దీపితసత్యసంధుఁడు ధృతిస్మృతిధర్మపరాయణుం డయో
ధ్యాపురనాయకుండు జలజాప్తకులైకవిభూషణుండు వి
ద్యాపరమార్థవేది శరదబ్జసముజ్జ్వలకీర్తిచంద్రికా
స్నాపితసర్వలోకుఁడు త్రిశంకునరేంద్రసుపుత్త్రుఁ డున్నతిన్‌.
84
సీ. జయశీలుఁడయి హరిశ్చంద్రుండు దొల్లి స | ప్తద్వీపములఁ దన బాహుశక్తిఁ
జేసి జయించి నిశ్శేషితశత్రుఁడై | ధారుణిలోఁ గల ధరణిపతుల
నిజశాసనంబున నిలిపి నిత్యంబైన | మహిమతో సకలసామ్రాజ్య మొప్ప
రాజసూయంబు తిరంబుగా నొనరించి | తనరి యథోచితదక్షిణలకు
 
ఆ. నేనుమడుఁగు లర్థ మిచ్చి యాజకులఁ బూ | జించి భక్తితో విశిష్ట విప్ర
జనుల కభిమతార్థసంప్రదానంబులఁ | దృప్తిసేసె వంశదీపకుండు.
85
క. ఉరుతరధనసంతర్పిత | ధరణీసురు లతని నతిముదంబున దీవిం
చిరి ‘రాజులందు లోకో | త్తరతేజోధర్మయుక్తిఁ దనరుమ’ యనుచున్‌.
86
వ. వాఁడును బ్రాహ్మణ వచనంబునం జేసి యెల్ల రాజులకు నధికుండయి రాజసూయమహాయజ్ఞకరణంబునం జేసి దేవేంద్రుసాలోక్యంబు వడసె; నట్టి హరిశ్చంద్రు మహిమాతిశయంబు రాజసూయ నిమిత్తంబున నయినదిగా నెఱింగి రాజలోకంబుతో వైవస్వతసభ నుండు భవజ్జనకుండు పాండురాజు నాతో ని ట్లనియె. 87
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )