ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
నారదుఁడు పాండురాజువచనంబులు ధర్మజుని కెఱింగించుట (సం. 2-11-65)
క. జనపతులు రాజసూయం | బొనరించిన వారు శక్రునొద్దను సురపూ
జన లొందుచుండుదురు కో | రిన కోర్కులు వడయుచును హరిశ్చంద్రుక్రియన్‌.
88
చ. గొనకొని మర్త్యలోకమునకుం జని సన్మునినాథ! యిందు నా
యునికిని రాజసూయమఖ మున్నతిఁ జేసిన ధన్యు లింద్రునం
దునికియు నా తనూజున కనూనయశోనిధి యైన ధర్మనం
దనునకుఁ జెప్పి వాని నుచితస్థితిఁ బన్పుఁడు దానిఁ జేయఁగన్‌.
89
చ. అనుపమశక్తిమంతులు మదాత్మజు లేవురు దేవతావరం
బున నుదయించి యున్న కృతపుణ్యులు; వారలలోన నగ్రజుం
డనఘుఁడు రాజసూయము మహామతిఁ జేయఁగ నోపు శత్రుసూ
దనుఁ డయి సార్వభౌముఁ డయి తమ్ముల బాహుబలంబు పెంపునన్‌.
90
వ. అట్లేని నాకు నస్మత్పితృ పితామహ నివహంబుతోడ నాకాధిపలోక సుఖావాప్తి యగు ననిన నప్పాండురాజు
వచనంబు నీ కెఱింగించు వేడుక నిట వచ్చితి.
91
క. న్యాయమున రాజసూయము | సేయుము; నీ పితృగణంబుఁ జెచ్చెర నధిక
శ్రీయుత సురగణపూజ్యులఁ | జేయుము; శక్రుసభ నుండఁ జేయుము వారిన్‌.
92
వ. ‘దిగ్విజయోపార్జితంబులయిన ధనంబుల బ్రాహ్మణసంతర్పణంబును ధర్మమార్గంబునం జాతుర్వర్ణాశ్రమ రక్షణంబునుం జేసి సామ్రాజ్యంబు పూజ్యంబై యొప్పం బ్రకాశింపుము; మఱి రాజసూయంబు బహు విఘ్నంబు, బ్రహ్మరాక్షసులు దానిరంధ్రంబ రోయుచుండుదు; రదియును నిర్విఘ్నంబున సమాప్తం బయ్యెనేని నిఖిల ప్రజాప్రళయ కారణంబయిన రణంబగు’నని చెప్పి నారదుం డరిగినఁ దమ్ములంజూచి ధర్మతనయుండు ధౌమ్య ద్వైపాయన సుహృద్బాంధవ మంత్రి సమక్షంబున ని ట్లనియె. 93
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )