ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
ధర్మరాజు నారదవచనప్రబోధితుండై రాజసూయయజ్ఞంబు సేయుటకు నాలోచించుట (సం. 2-12-1)
క. పితృసంకల్పము సేయఁగ | సుతుల కవశ్యమును వలయు; సుతజన్మఫలం
బతిముదమునఁ బితృవరులకు | హిత మొనరించుటయ కాదె యెంతయు భక్తిన్‌.
94
క. ‘పరలోకనిలయు లగు మీ | గురులకు దీనన హితం బగున్‌ లోకభయం
కరసంగరమును గాలాం | తరమున నగు’ నని విరించితనయుఁడు సెప్పెన్‌.
95
క. పితృగణహితార్థముగ స | త్క్రతు వొనరింపంగ బుద్ధిగలదు, ప్రజా సం
హృతి తత్క్రతువున నగు నని | మతి నాశంకయును గలదు మానుగ నాకున్‌.
96
వ. ఏమి సేయుదు నని డోలాయమాన మానసుం డయి యున్న ధర్మరాజునకు ధౌమ్యప్రభృతు లి ట్లనిరి. 97
ఉ. చేయుము రాజసూయ మెడసేయక; దానన చేసి దోషముల్‌
వాయు నిలేశ! భూప్రజకుఁ; బార్థివులెల్ల భవత్ప్రతాపని
ర్జేయులు; సర్వసంపదలు చేకొనఁగాఁ దఱియయ్యెఁ గౌరవా
మ్నాయలలామ! నీ కెనయె మానవనాథులు మానుషంబునన్‌.
98
వ. అనిన వారల వచనంబుల కనుగుణంబుగా ననుజానుమతుండయి ధర్మరాజు రాజసూయంబు సేయ సమకట్టి, ‘దీని నిర్విఘ్నంబున నిర్వహించుట కనాదినిధనుం డాదిపురుషుండు పురుషోత్తముండు పుండరీకాక్షుం డజుం డయ్యును జగద్ధితార్థంబుగా మర్త్యంబున జనియించిన యమ్మహాత్ముండు వాసుదేవుండ యోపుంగాని యన్యుల కశక్యం’ బని యప్పుడ యాప్తచరులం బిలువంబనిచి. 99
క. అనిలజవాశ్వంబులఁ బూ | నిన యరదం బెక్కి ధారుణీధరు మధుసూ
దను దోడ్తెం డని ముదమునఁ | బనిచి తదాగమనకాంక్షఁ బార్థివుఁ డుండెన్‌.
100
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )