ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
శ్రీకృష్ణుం డింద్రప్రస్థపురంబునకు వచ్చుట (సం. 2-12-30)
వ. అయ్యుధిష్ఠిరు సందేశంబున దాశార్హుండును దద్దర్శనోత్సుకుం డయి ద్వారవతి గదలి యతిత్వరితగతిం జని నిరంతర ప్రయాణంబుల నింద్రప్రస్థపురంబునకు వచ్చి. 101
ఉ. కుంతికి ధర్మనందనునకున్‌ వినయంబున మ్రొక్కి, భీము ధీ
మంతునిఁ గౌఁగిలించుకొని, మధ్యమపాండవు మాద్రిపుత్త్రులన్‌
సంతతభక్తినమ్రులఁ బ్రసాదనయోత్కటదృష్టిఁ జూచి, తా
నెంతయుఁ బ్రీతి నెత్తికొనియెన్‌ మహినెత్తిన పుణ్యుఁ డున్నతిన్‌.
102
వ. తదనంతరంబ ధర్మతనయుండు. 103
క. పరమాసనమున నునిచి య | పరిమిత హర్షంబుతో సపర్యావిధులన్‌
గురుఁ బూజించిన విధమునఁ | గురువృషభుఁ డశేషలోకగురుఁ బూజించెన్‌.
104
క. ఏమఱక జనుల యోగ | క్షేమంబుల నడపుచున్న కృష్ణుని యోగ
క్షేమంబు లడిగి యపుడు మ | హాముదమున ధర్మసుతుఁడు హరి కి ట్లనియెన్‌.
105
క. ధ్యేయుఁడవు సకల లోక | స్థేయుండవు నమ్రులకు విధేయుఁడవు నయో
పాయజ్ఞుఁడ విజ్జగముల | నీ యెఱుఁగని యవియుఁ గలవె నీరజనాభా!
106
వ. అయినను నాయర్థిత్వంబునంజేసి నీ కెఱింగించెద. 107
సీ. ‘పాండుమహీపతి పనిఁజేసి నారద | ముని వచ్చి వీ రెల్ల వినుచు నుండ
రాజసూయంబు తిరంబుగాఁ జేసి నీ | పితృపితామహులకు హితము సేయు
మని పంచె నన్ను; నెయ్యముననో, నాకట్టి | బలము సామర్థ్యంబుఁ గలుగు టెఱిఁగి
పంచెనో, తత్క్రతు ప్రారంభమున కొడం | బడితి వీ రిందఱుఁ గడఁగి దీని
 
ఆ. నిత్యసత్యవచన! నిపుణనిర్మలబుద్ధి | నిర్ణయించి పనుప నీ నియోగ
కాంక్ష నున్నవాఁడఁ గమలాక్ష!’ యనిన ధ | ర్మాత్మజునకు నిట్టు లనియెఁ జక్రి.
108
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )