ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
కృష్ణుఁడు ధర్మజునికి జరాసంధుని సామర్థ్యము నెఱిఁగించుట (సం. 2-13-1)
క. కురువృషభ! సర్వగుణముల | సురుచిర తేజమున రాజసూయాఖ్య మహా
ధ్వరమునకు నీవ యర్హుఁడ | వరిసూదనశౌర్యు లయిన యనుజులబలిమిన్‌.
109
వ. తొల్లి జమదగ్నిసుతుం డయిన రామునిచేత ధాత్రి యపగతక్షత్త్రం బయిన నంతనుండి యైలవంశంబును నిక్ష్వాకువంశంబును దక్కఁ దక్కిన క్షత్త్రియవంశంబు లెల్లం గృత్రిమంబులు గాని విమల మకుటార్హంబులుగా; వీ రెండు వంశంబులవలన నేకోత్తరశతవంశంబు లయ్యె; మఱి యయాతి భోజ వంశంబులవలనం జతుర్దశ వంశంబు లయ్యె; నిట్టి సకలక్షత్త్రంబునెల్ల జయించి జరాసంధుం డున్నవాఁడు; వాని సామర్థ్యంబు చెప్ప నశక్యంబు. 110
క. అతిదర్పోద్ధతుఁడు మహా | ద్భుతభూరిబలుండు చేదిభూపతి సేనా
పతి యయి శిశుపాలుఁడు సం | తతమును నాతనిన కొలుచుఁ దద్దయు భక్తిన్‌.
111
క. ఆయతభుజవీర్యులు మా | యాయోధులు హంసడిభకు లనువార లని
ర్జేయులు పరస్పర స్నే | హాయత్త సుచిత్తు లతని యాప్తు లధీశా!
112
వ. అయ్యిద్దఱును గౌశిక చిత్రసేను లను నామంబులతో మహాసేనాన్వితులై వానికి వామదక్షిణ భుజంబులుంబోలె సర్వసాధనసమర్థు లయి వర్తిల్లుదురు; మఱియు వరుణు నంతియ బలవంతుండు పశ్చిమ దిఙ్మహీపతి భగదత్తుం డనువాఁడు పాండురాజుసఖుం డగుటంజేసి నీకు మనంబున భక్తుం డయ్యును భయంబున జరాసంధునకు వాక్కర్మంబులం బనిసేయుచుండుఁ; జేదిపతులలోనఁ బురుషోత్తముండును నంగ వంగ పుండ్ర కిరాతపతులలోనఁ బౌండ్రకవాసుదేవుండు మదీయ నామంబులు దాల్చి జరాసంధుం గొలుతురు; ప్రాగ్దక్షిణ దిగ్భూముల రాజులు పురుజితుండును గరూశ కలభ నకుల సంకర్షణ సూపహిత మనోదత్త చక్ర సాల్వేయ యవనులును వానిన సేవింతు; రుదీచ్యులయిన యష్టాదశక్షత్త్రకులంబుల వారును నుత్తరపాంచాల శూరసేన పుష్కర పుళింద కళింగ కుంతి మత్స్యదేశంబుల రాజు ల్లెలను దద్భయంబునఁ దమ తమ దేశంబుల విడిచి యున్నవారలు మఱియును. 113
ఉ. ఘోరరణంబులోన నధికుం గృతబంధు జనాపకారు నే
దారుణ లీలఁ గంసు నతిదర్పితుఁ జంపుటఁ జేసి, యమ్మహా
క్రూరుఁడు కంసుభార్య దన కూఁతురు గావున, దానిసంతత
ప్రేరణ నా కుపద్రవముఁ బెక్కు విధంబులఁ జేసె నీసునన్‌.
114
క. భూమీశ! హంసడిభకులు | నా మగధాధీశ్వరుండు నమ్మువ్వురు ను
ద్దామ భుజవీర్య సంపద | తో మూఁడుజగములు నోపుదురు సాధింపన్‌.
115
వ. ఆ జరాసంధుండును నాయుధనిహతులు గాని హంసడిభకులతో వచ్చి మధురపై విడిసిన నతి వీరులయిన యదు వృష్ణిభో జాంధక వరు లష్టాదశ సహస్ర రథవ్రాతంబులతో నేమును సమకట్టి మహాయుద్ధంబు సేయుచు వాని నెట్లును జయింపరాకున్న నుపాయంబున హంసుండు సమరనిహతుం డయ్యె నని డిభకునకుం జెప్పంబంచిన నప్పలుకులు నిక్కువంబ కా వగచి. 116
చ. ‘అనవరతంబు నిష్టుఁడగు హంసుఁడు లేని జగంబులోని జీ
వన మది యేల నా’ కనుచు వారినిమగ్న శరీరుఁ డై క్షణం
బున డిభకుండు మృత్యుగతిఁ బొందె; ఘనంబుగ; దాని నక్కడన్‌
విని మృతుఁడయ్యె హంసుఁ డతివీరుఁడు తద్గత సౌహృదంబునన్‌.
117
వ. అట్లు కౌశిక చిత్రసేనులు పరలోకగతులైన నసహాయుండై జరాసంధుండు మగిడి మగధపురంబునకుం జనియె; నేమును వానితోడి వైరంబు బలవంతంబైన, నమ్మధుర నుండ నొల్లక కుశస్థలంబునకు వచ్చి రైవతక పర్వతంబున ఘనంబుగా దుర్గంబు నిర్మించికొని భవదాశ్రయంబున సుఖంబున్నవారము. 118
చ. ఖలుఁడు బృహద్రథాత్మజుఁడు గర్వితుఁడై మహిలోని రాజులం
బెలుకుఱఁ బట్టి తెచ్చి చెఱఁబెట్టి గిరివ్రజమ న్పురంబులోఁ
జొలయక నిత్య మొక్కొకని సూనరివోలె వధించి నేమమున్‌
బలిమియు నేర్పడం గడఁగి భైరవపూజ యొనర్చు నుగ్రుఁడై.
119
క. ధరణీశ! వానిఁ జంపుడు | నురుతర సామ్రాజ్య విభవ మున్నతితో సు
స్థిరమగు నీకును; మఱి భా | సురముగ సమకూరు రాజసూయము సేయన్‌.
120
సీ. రక్షణంబున భగీరథుఁడు, జయంబున | నయ్యౌవనాశ్వుండు, నత్యుదగ్ర
బాహుబలంబున భరతుండు, తపమునఁ | గార్తవీర్యుండును, గరముబుద్ధి
నమ్మరుత్తుండును, నఖిల సామ్రాజ్యంబుఁ | బడసిరి తొల్లి భూపాల! యిప్పు
డిన్ని గుణంబులు నెన్నంగఁ గలవు నీ; | కిది యేమి దుర్లభ, మిద్దురాత్ముఁ
 
ఆ. డెంత బలియుఁడయ్యు, నెంత గర్వితుఁడయ్యుఁ | దన కఠోర దుష్ప్రతాపమునను
విగతవిభవుఁ డగు; వివేకవిహీనుల | కైన లక్ష్మి సుచిర మగునె యెందు?
121
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )