ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
భీమసేనార్జునులు ధర్మరాజున కుత్సాహంబు గలిగించుట (సం. 2-14-7)
వ. అనిన విని భీమసేనుండు ధర్మరాజున కిట్లనియె. 122
క. ఆరంభరహితుఁ బొందునె | యారయ సంపదలు? హీనుఁ డయ్యును బురుషుం
డారంభశీలుఁ డయి యకృ | తారంభుల నోర్చు నెంత యధికుల నయినన్‌.
123
క. కడు నధికుతోడఁ దొడరినఁ | బొడిచిన నొడిచినను బురుషు పురుషగుణం బే
ర్పడుఁగాక, హీను నొడుచుట | కడిఁదియె? పౌరుషము దానఁ గలుగునె చెపుమా!
124
క. ఈహరి కరుణయు నర్జును | సాహాయ్యముఁ గలుగ నీ ప్రసాదమున జగ
ద్ద్రోహు జరాసంధు మహా | సాహసు వధియింతు నుగ్ర సంగ్రామమునన్‌.
125
తే. అనఘ! యేము మువ్వురము మూఁడగ్నులట్లు | నీ మహాయజ్ఞ కార్యంబు నిర్వహింతు
మా జరాసంధ పశువున నఖిల శాత్ర | వాహుతులఁ జేసి తృప్తుల మగుచు బలిమి.
126
వ. అనిన భీమసేను విక్రమవచనంబుల కనుగుణంబుగా నర్జునుం డిట్లనియె. 127
ఉ. భూభుజులన్‌ జయింపుము, విభూతి నొనర్పుము రాజసూయమున్‌,
నాభుజ వీర్య విక్రమ గుణంబులకుం దగుచున్న యీ ధను
ర్లాభము, దివ్య బాణరథలాభము, శోభితమైన యీ సభా
లాభము నొండుపాట సఫలత్వముఁ బొందునె కౌరవేశ్వరా!
128
క. కలరూప గుణ ద్రవ్యం | బులు విక్రమవంతునందు భూవిదితములై
నిలుచు నవిక్రమునకు నవి | గలిగియు లేని క్రియ నప్రకాశంబు లగున్‌.
129
వ. ‘మఱియు రాజసూయ మహాధ్వరంబు కారణంబుగాఁ బరాక్రమంబున జరాసంధు వధియించి నిఖిల క్షత్త్రియ నిగ్రహ మోక్షణంబు సేయునంతకంటె మిక్కిలి యశోధర్మంబు లొండెవ్వి?’ యనిన భీమార్జునుల పలుకులకు సంతసిల్లి నారాయణుం డి ట్లనియె. 130
క. వెలయ విధిదృష్ట నయమున | వలయుఁ బరాక్రమము సేయ వసుధేశ్వర య
గ్గల మగు బుద్ధియుఁ గడఁకయుఁ | గల పురుషుల కిదియె చూవె కర్తవ్య మిలన్‌.
131
వ. ‘కావున మేము మువ్వురముఁ గ్రమంబునం బరాక్రమించి జరాసంధుడాసి నదీప్రవాహంబులు వృక్షోన్మూలనంబు సేయునట్లు క్రమంబున వాని నిర్మూలితుం జేసెద; మద్దురాత్ముండు భూతంబులయం దంతరాత్మయుం బోలెఁ దన యంతరం బెఱుంగక యేకాంతశీలుఁడై సుఖం బనుభవించుటం జేసి వాని యంతికంబున కరుగుట యశ్రమం’ బనిన నారాయణునకు ధర్మరా జిట్లనియె. 132
క. దనుజాహిత! నీ కాహవ | మున నెదిరి మహోగ్ర దహనమునఁ బడియును గా
లని మిడుత వోలె నతికో | పనుఁడు జరాసంధుఁ డెట్లు బ్రదుకఁగ నేర్చున్‌?
133
క. అట్టి యతి దారుణత్వము | నట్టి యజేయ భుజ విక్రమాధిక్యము వాఁ
డెట్టి క్రియఁ బడసె; నాతని | పుట్టిన విధ మెట్లు చెప్పు పొలుపుగ నాకున్‌.
134
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )