ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
శ్రీకృష్ణుఁడు ధర్మజునకు జరాసంధుని జననక్రమ మెఱిఁగించుట (సం. 2-16-12)
వ. అని యడిగిన ధర్మరాజునకుఁ గృష్ణుం డిట్లనియె. 135
సీ. అతిసమర్థుండు బృహద్రథుం డనువాఁడు | మగధాధినాథుఁ డున్మార్గదూరుఁ,
డక్షౌహిణీ త్రితయంబు బలంబునఁ | బరుల నోడించిన బలిమికాఁడు,
కాశిరా జనువానిగాదిలికూఁతులఁ | గవల వారల నతికాంతిమతుల
నమరంగఁ బెండ్లి యై యనుపమప్రీతి న | య్యిరువురయందు భోగేచ్ఛ సలిపి
 
తే. యం దపత్యంబు వడయుదు నని తలంచి | విప్ర ముని దేవ పూజల వివిధవిధులఁ
బుత్త్రకామేష్టులను నొండు పుణ్యకర్మ | యుక్తులను జేసి పడయంగ నోప కలసి.
136
వ. ‘పుత్త్రుండు లేని విభవంబు లన్నియు నేల?’యని నిర్వేదించి పత్నీద్వయ సమేతుండయి వనంబున కరిగి. 137
ఉ. ఆ విపినాంతరంబున నిరంతర నిష్ఠ ననంత మోక్షకాం
క్షావిధి నొక్క బాల సహకార మహీజము క్రింద నుజ్జ్వల
త్పావకతేజుఁడై తపము పాయక చేయుచు నున్న ధన్యుఁ గా
క్షీవతుఁ గాంచె గౌతము నకిల్బిషమానసుఁ జండకౌశికున్‌.
138
క. ధరణీశ్వరుఁ డమ్మునివరుఁ | బురాతనమునిన్‌ నిరాశుఁ బుణ్యాత్ము నిరం
తర కృత నియమ సపర్యా | వరివస్యుం డగుచు భక్తి వదలక కొలిచెన్‌.
139
వ. ఇ ట్లుపాస్యమానుం డయి చండకౌశికుండు బృహద్రథునకు మెచ్చి ‘నీ కిష్టంబు చెప్పు మిచ్చెద’ ననిన వినయ వినమితోత్తమాంగుం డయి వాఁ డి ట్లనియె. 140
ఉ. సంతతమైన సర్వ సుఖ సంపద గల్గియు దానికిం దగన్‌
సంతతి లేమిఁ జేసి యది సర్వము హేయమ కాఁ దలంచి ని
శ్చింతుఁడనై ధృతిం దపము సేయఁగవచ్చితిఁ బుత్త్రజన్మమై
నంతన యేను మీ దయఁ గృతార్థతఁ బొందుదు సన్మునీశ్వరా!
141
వ. అనినం గరుణించి మునివరుండు పరమధ్యానముకుళిత నయనుండై యున్నంత. 142
క. పవనవిధూతము శుకచం | చు విలూనముఁ గాక యొక్క చూతఫలం బ
య్యవనిజమువలన నమ్ముని | ప్రవరుపృథూత్సంగతలముపై వడిఁ బడియెన్‌.
143
వ. దానిం బుచ్చికొని యభిమంత్రించి చండకౌశికుండు బృహద్రథున కిచ్చి ‘యీ ఫలంబువలన నీకొక్క పుత్త్రుం డుద్భవిల్లు’ నని చెప్పిన నాతండును గృతార్థుండై క్రమ్మఱి నిజపురంబునకు వచ్చి, తన యిద్దఱు భార్యలకు నప్పండు సమంబుగా విభాగించి పెట్టినం దత్ఫలోపభోగంబున నయ్యిద్దఱు గర్భిణులయినఁ బదియగు మాసంబున నొక్కనాఁటి రాత్రియందు వారలకు. 144
క. ఒక్కొక కన్నును జెవియును | జెక్కును జను బొడ్డు మూఁపుఁ జెలువగు చేయున్‌
బ్రక్కయుఁ గుఱువును గాలును | నక్కజముగ మనుజ శకలమై యుదయించెన్‌.
145
క. అమ్మానిసి వ్రయ్యలు గని | యమ్ముదితలు వెఱచి ‘వీని నాత్మజుఁ డని నె
య్యమ్మున నెట్టులు చూపుదు | మిమ్మనుజేశ్వరున?’ కనుచు నెంతయు లజ్జన్‌.
146
వ. ‘వీని నెవ్వరును నెఱుంగకుండ వెలుపల వైచిరం’ డని తమదాదులం బంచిన, వార లా రెండు వ్రయ్యలుం గొనిపోయి రాజగృహ ద్వారతోరణ సమీపంబునఁ జదుకంబునొద్ద నొక్కచోట వైచిన, నచ్చదుకంబున నుండెడు రాక్షసి జర యనునది దాని బలియకా వగచి పఱతెంచి. 147
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )