ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
జరయను రాక్షసి బాలకునిఁ దెచ్చి బృహద్రథుని కొసంగుట (సం. 2-16-38)
ఆ. ఎత్తికొని చనంగ నిమ్మగు నట్లుగా | మెదలుచున్న వ్రయ్య లదిమి రెంటిఁ
గూడఁబట్టె; నవియుఁగూడి యొండొంటితోఁ | జక్క నంటి రెండు నొక్కఁడయ్యె.
148
క. ఆ రాక్షసి కెత్తికొనన్‌ | భారముగా వజ్రకఠిన బంధురతనుఁ డై
ధీరుఁడు బాలకుఁ డేడ్చె మ | హారవమున దాని చేతు లాడకయుండన్‌.
149
వ. అబ్బాలకు రోదన ధ్వని విని యంతిపురంబున నున్న ముదుసలి యవ్వలెల్లం బఱతెంచి మహాహర్షంబుతో వాని నెత్తికొని; రట్టి సంభ్రమం బెఱింగి బృహద్రథుండు వచ్చి తేజోధికుండయి తామ్రతలముష్టిం దనముఖపద్మంబునం బెట్టికొని దిక్కులు సెలంగ నేడ్చుచున్న కొడుకుం జూచి కృతార్థీకృత లోచనుం డయ్యె; నట్టి యవసరంబున నా రాక్షసి కామరూపిణి గావున మనుష్య స్త్రీరూపధారిణి యయి యమ్మగధరాజున కి ట్లనియె. 150
తే. ఏను జరయను రాక్షసి, నిప్పురంబు | చదుకమునఁ బాయకుండుదు, సంతతంబు
నీకు నిష్టంబు సేయంగ నెమ్మితోడఁ | గోరుచుండుదు, నది సమకూరె నేఁడు.
151
వ. ‘నీ యిద్దఱు దేవులకు నుద్భవిల్లిన యిమ్మనుష్య శకలంబులు రెండును నీదాదులు దెచ్చి యిచ్చదుకంబు నొద్ద నొక్కచో వైచి పోయిన నేను వానిం గూడఁబట్టుడు నప్పుడు వజ్రఘన ఘటిత కఠిన శరీరుండై యిక్కుమారుండు మేరుగిరి శృంగంబునుంబోలె నా కెత్తికొన నశక్యుం డయ్యె; వీని నొప్పుగొను’ మనిన విని బృహద్రథుండు ముదితహృదయుం డయి దాని కి ట్లనియె. 152
ఉ. ఇచ్చకు వచ్చు పూజనల నెంతయు సంతసమంది తొల్లి నా
కిచ్చె మునీశ్వరుండు దయ నిత్తనయున్‌; మఱి యిప్డు నెమ్మితో
నిచ్చితి వీవు రాక్షసివె! యిక్కులమెల్లను నుద్ధరింపఁగా
వచ్చిన పుణ్యదేవతవు వారిరుహాయతచారులోచనా!
153
వ. అని దాని నతిప్రీతిం బూజించి కొడుకు నెత్తికొని దేవీద్వయంబునకు నిచ్చి, జర యను రాక్షసిచేత సంధింపఁబడినవాఁడు గావున జరాసంధుం డను పేరిడి. పురం బష్టశోభనంబు సేయించి, యా రాక్షసి కేఁటేఁట మహోత్సవంబు సేయించుచుం గొడుకు నతి గౌరవంబునం బెంచిన. 154
క. ఈహిత విధానముల లో | కాహిత దుస్సహనతేజుఁ డయి వాఁడు మహో
త్సాహముతో వర్ధిల్లె ఘృ | తాహుతులఁ బ్రవృద్ధి నొందు నగ్నియపోలెన్‌.
155
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )