ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
జరాసంధునియొద్దకుఁ జండకౌశికుండు వచ్చుట (సం. 2-17-8)
వ. ఇట్లు జరాసంధుండు పెరుగుచున్నఁ గొండొక కాలంబునకు నొక్కనాఁడు చండకౌశికుం డందులకు వచ్చిన నతిముదంబుతోఁ బుత్త్ర కళత్ర మిత్రభృత్యామాత్య సహితుండయి బృహద్రథుం డెదురువోయి యమ్మునీంద్రునకు నమస్కరించి తోడ్కొనివచ్చి యుచితాసనంబున నునిచి యడుగులు గడిగి యర్ఘ్యపాద్యాది విధులం బూజించి తనరాజ్యంబుతోడ సర్వస్వంబును నివేదించి కొడుకుం జూపినం జూచి సంతసిల్లి మునివరుం డిట్లనియె. 156
క. జరయను రాక్షసి నీకుం | గర ముపకారంబు సేసె ఘనముగ దీనిన్‌
ధరణీశ! యే నెఱింగితి | నిరుపమ నిరతిశయ యోగ నిష్ఠిత బుద్ధిన్‌.
157
వ. ‘ఇక్కుమారుండు కుమారునంతియ శక్తి సంపన్నుండయి త్రిపురాంతకు నంతకహరుం బరమేశ్వరుం దనకు సన్నిహితుంజేయు; నెంత బలవంతు లయ్యును వైరివీరులు వీనిం దాఁకి యగ్నిఁ దాఁకిన శలభంబులుంబోలె నడంగుదురు; గరుడనిగతి నన్యవిహంగంబు లనుగమింప నోపనియట్లు మానవులు వీనివీర్యంబు ననుగమింపనోపరు; తేజస్వులలోన నాదిత్యుండు వెలుంగునట్లు వీఁడు మూర్ధాభిషిక్తులలోన మిగిలి వెలుంగు; నదీరయంబులు మహాపర్వతంబుల ఛేదింప నోపనియట్లు దివ్యాస్త్రంబులు వీని దేహంబు భేదింప నోపవు; సముద్రంబు మహానదులం జేకొనునట్లు వీఁడు పరమహీపతుల సంపదలు చేకొను’నని జరాసంధు సామర్థ్యంబు చెప్పి చండకౌశికుం డరిగిన. 158
క. తనయుని నభినవయౌవను | ననుపము నభిషిక్తుఁ జేసి యవనీభర మా
తనిఁ బూన్చి సభార్యుండయి | యనఘ! తపోవనమునకు బృహద్రథుఁ డరిగెన్‌.
159
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )