ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
శ్రీకృష్ణుఁడు భీమార్జునులను దనతోఁ బంపు మని ధర్మజు నడుగుట (సం. 2-17-25)
వ. ఆ జరాసంధుండును నాయుధ నిహతులుగాని హంస డిభకులు దనకు సహాయులుగా నపరాజితంబయిన పరాక్రమంబునం బరచక్రపతుల భంజించుచు. 160
చ. అయన విహీనుఁడౌ సవితృనట్లు, విఖండిత పక్షతిద్వయుం
డయిన ఖగేంద్రునట్లు, మఱి హంసుఁడు నా డిభకుండు నంతక
క్షయ గతులైన నిప్డు గతగర్వమునన్‌ మగధేశ్వరుండు ని
శ్చయమతి నున్నవాఁడు నిజసంక్షయకాలవిశంకితాత్ముఁడై.
161
ఉ. అమ్మగధేశు నుగ్రబలు నాయుధయుద్ధమునన్‌ జయింపఁగా
నిమ్మహి నోప రెవ్వరు, నుమేశ్వరుఁ డట్టి వరమ్ము వానికిన్‌
నెమ్మిన యిచ్చెఁ, గావున వినీతుఁడు వాయుసుతుండు మల్లయు
ద్ధమ్మున నోర్చు నాతని నుదగ్రమహాభుజశక్తి యేర్పడన్‌.
162
క. బలిమిమెయిఁ బార్థురక్షా | బలమును బవనసుతు బాహుబలమును నా ని
ర్మలనీతిబలము నీకుం | గలుగ నసాధ్యంబు గలదె కౌరవనాథా!
163
చ. తడయక యేఁగి నీతి బలదర్పము లొప్పఁగ వాని డాసి, క
వ్వడియును నేను భీముఁడు నవశ్యముఁ బోర బృహద్రథాత్మజుం
గడిఁది రిపున్‌ జయింతుము జగన్నుత! న న్నెద నమ్ముదేని యి
ల్లడయిడు భీము నర్జును నలంఘ్యబలాఢ్యుల నావశంబునన్‌.
164
వ. అని నిశ్చయించి పలికిన నారాయణుని, విజయశ్రీ విభాసిత ముఖులైన భీమార్జునులం జూచి సంతుష్టాంత రంగుండయి ధర్మతనయుం డిట్లనియె. 165
చ. ప్రియహితసత్యవాక్య! యరిభీషణ! కృష్ణ! భవన్నిదేశ సం
శ్రయమున నున్న మా కధికశత్రుజయం బగు టేమి పెద్ద, ని
శ్చయముగ నింక మోక్షితుల సర్వమహీశులు, నిమ్మహాధ్వర
క్రియయును సిద్ధిఁబొందెన యకిల్బిషకీర్తి వెలుంగుచుండఁగన్‌.
166
క. ధరణీధర! సర్వగుణా | కర! కరుణానిరత! సర్వకార్యైకధురం
ధర! నినుఁ బడసిన మాకును | హరివిక్రమ! పడయరానియవియుం గలవే!
167
వ. అని సంతసిల్లి మఱియు నాత్మగతంబున. 168
క. నయనములు నాకుఁ బవనత | నయ విజయులు, మనము కమలనాభుఁడు; వీరిం
బ్రియహితులఁ బాసి నిమిషం | బయినను నెట్లుండ నేర్తు నవిచేష్టుఁడనై.
169
వ. ‘అయినను నా హృదయంబు గరంబు హృద్యంబగుచున్నయది; కృష్ణార్జునులం దలంచినవారికి శ్రీ విజయంబు లగు ననిన నమ్మహాత్ములఁ దనకు సహాయులఁగాఁ బడసిన భీమసేనునకు శ్రీ విజయంబు లగుట యేమి సందేహం?’బని నిశ్చయించి ‘మీకుఁ గార్యసిద్ధి యయ్యెడు మరుగుం’ డని పంచిన. 170
క. ఘోరరిపుఁ జంప నరిగెడు | వీరుల వార్‌ష్ణేయపాండవేయుల సింహా
కారులఁ జూచి మనంబున | ధీరుఁడు ముదమందె నయ్యుధిష్ఠిరుఁ డంతన్‌.
171
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )