ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
శ్రీకృష్ణభీమార్జునులు జరాసంధునిఁ జంపఁబోవుట (సం. 2-18-26)
వ. కృష్ణభీమపార్థులు కృతకస్నాతకులయి చని, యేక పర్వత ప్రభవంబులైన కాల కూట శోణ గండకీ సదానీరలను నేఱుల లంఘించి, సరయూనదియునుం బూర్వకోసల మిథిలా దేశంబులును గంగయుం గడచి, పూర్వాభిముఖులయి నిత్య ప్రయాణంబుల నమ్మగధదేశంబు సొచ్చి గోరథం బనుపర్వతం బెక్కి. 172
చ. ఉరుతర హర్మ్యమాలికల నొప్పు గిరివ్రజ మన్పురంబుఁ గాం
చిరి నవసౌరభప్రసవచిత్రవనావళి గల్గుదాని నె
వ్వరికి దురాసదంబు లగు వజ్రమయోన్నతవప్రచారు గో
పురముల దాని నయ్యలకఁ బోలెడు దాని మహార్థసంపదన్‌.
173
వ. కని దాని యపూర్వ రామణీయక సమృద్ధి కచ్చెరువడి యచ్యుతుండు భీమార్జునుల కిట్లనియె. 174
క. గోరథమును ఋషభము వై | హారము ఋషిగిరియుఁ జైత్యకాద్రియు ననఁగా
భూరిగిరు లేను దీనికి | శూరభటులువోలెఁ గాచి చుట్టును నుండున్‌.
175
వ. ‘దానన చేసి యిప్పురంబు గిరివ్రజంబు నాఁబరఁగె; నిందుఁ దొల్లి గౌతముం డౌశీనరి యను శూద్రయందుఁ గాక్షీవాదుల సృజియించె; నట్టి గౌతమానుగ్రహంబునను నీ దుర్గ బలంబుననుం జేసి యిమ్మాగధుల నెవ్వరును జయింప నోప’ రనుచుఁ దద్ద్వారంబునం బురంబు సొరనొల్లక చైత్యకగిరి శృంగంబున కరిగి యందున్న మూఁడు భేరులం జూపి, ‘తొల్లింటి మాగధులు మానుషాదంబను ఋషభంబు వధియించి దాని చర్మంబున వీని నిర్మించి; రివి యిప్పురంబు వింతవారు చొచ్చునప్పు డమ్మునిశక్తిం జేసి మ్రోయు’ ననిన. 176
ఉ. దారుణ వజ్రచారు భుజదండములన్‌ బలవద్విచార గం
భీరులు ధీరు లాక్షణమ భేరులు మూఁటిని వ్రచ్చి చైత్యక
స్ఫార నితంబదేశమును భగ్నము సేసి గిరివ్రజంబు న
ద్వారమునందుఁ జొచ్చి రతిదర్పితు లా యదుకౌరవోత్తముల్‌.
177
క. ఘోరాకారులు మాలా | కార గృహంబులకు గంధిక గృహంబునకున్‌
దా రరిగి మువ్వురు బలా | త్కారంబునఁ గొనిరి పుష్పగంధము లొప్పన్‌.
178
వ. అందు మాల్యాలంకృతమౌళులుఁ జందనాగరు రూషితహస్తులు విస్మయమాన మాగధ నిరీక్ష్యమాణులు నయి రాజమార్గంబు గదియం జని, యనవరతంబును బ్రాహ్మణులకు సుప్రవేశంబగుచున్న జరాసంధు మందిరంబు గోవాసంబు హిమవత్సింహంబులు సొచ్చునట్లు యాదవ పాండవ సింహంబులు సొచ్చిన. 179
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )