ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
జరాసంధుఁడు శ్రీకృష్ణ భీమార్జునుల కెదురు వచ్చుట (సం. 2-19-29)
ఆ. అర్ధరాత్ర మయిన నభ్యాగత ద్విజ | స్నాతకులకు నెదురుచని కరంబు
భక్తిఁ బూజలిచ్చు పరమవ్రతుం డప్పు | డెదురు వచ్చి వారి కిష్టమెసఁగ.
180
క. ధీయుతుఁ డయి మధుపర్కము | సేయఁగ సమకట్టి దానిఁ జేకొనని మహో
పాయుల గర్వంబు నభి | ప్రాయంబు నెఱింగి మగధపతి యి ట్లనియెన్‌.
181
తే. స్నాతకులరేని పూవులుఁ జందనంబుఁ | జనునె బలిమిమైఁగొని తాల్పఁ? జైత్యకాద్రి
తటము మీ రిట్లు వ్రచ్చి దోర్దర్ప మెసఁగఁ | జులుక నద్వారమునఁ బ్రోలు సొరఁగనగునె?
182
వ. ‘మఱియు నా కావించిన మధుపర్కంబు ప్రతిగ్రహింపనొల్లమి యిది యేమి? మీరలు వేషధారుల కావలయు; మీ వేషంబున బ్రాహ్మణత్వంబును మహాసత్త్వ దీర్ఘబాహు పృథులవక్షోలక్షణంబుల క్షత్త్రియత్వంబును బ్రకాశించుచున్న యవి’ యనిన వానికి నారాయణుం డి ట్లనియె. 183
క. స్నాతకులు పుణ్యకర్మస | నాతను లగుచున్న బ్రాహ్మణ క్షత్త్రియ వి
డ్జాతులయందును క్షత్త్రియ | జాతి స్నాతకుల మేము జనవినుత! మతిన్‌.
184
వ. ద్వారంబున మిత్త్రనివాసంబును నద్వారంబున నమిత్త్రనివాసంబును జొచ్చుట యిది బాహువీర్య సంపన్నులయిన క్షత్త్రియులకుం గర్తవ్యంబు; మఱి గంధమాల్యంబులయందు లక్ష్మి యుండుం గావున బలాత్కారంబున గంధ మాల్యంబులు గొంటిమి; నీయందుల మాకు నొండు కార్యంబు గలుగుటం జేసి నీయిచ్చు నర్ఘ్యంబు గొన నొల్ల’ మనిన జరాసంధుం డి ట్లనియె. 185
ఆ. మీరు నాకు నేను మీకు నెన్నండు ము | న్నహిత మాచరించినదియు లేదు;
మీకు నేల నే నమిత్త్రుండ నైతి? ని | రాగసుండ సద్గుణాన్వితుండ.
186
క. ‘సురమునివరులకు వసుధా | మరులకు భక్తుండ నుత్తమక్షత్త్రకులా
చరితుండ’ ననిన ధరణీ | ధరుఁ డమ్మగధేశ్వరునకుఁ దా ని ట్లనియెన్‌.
187
క. కులరక్షార్థ మఖిల నృప | కులోద్వహునియోగమున నకుంఠితశత్రు
ప్రళయవిధాయుల మయి యిం | దులకున్‌ వచ్చితిమి దుష్టదూషణబుద్ధిన్‌.
188
సీ. కడఁగి యత్యుత్తమ క్షత్త్రియ చరితంబు | నందు వర్తిల్లుదు నంటి, జనుల
కెవ్వరి కెన్నండు నెగ్గొనరింప నే | నంటి, సత్‌క్షత్త్రియు లవని నొరులు
నీయట్లు క్రూరులై నృపతులఁ జెఱఁబెట్టి | పశువరించుచుఁ బశుపతి నుమేశు
వరదుఁ బూజించిన వారును గలరె? ము | న్నింతకు నగ్గలం బెద్ది యెగ్గు?
 
ఆ. కారణంబు లేక దారుణుఁ డయి సాధు | హింస సేయు కుజనుఁ డెల్లవారి
కప్రియుండ కాక యప్రియలక్షణం | బొండు గలదె తలఁప నుత్తములకు?
189
వ. నిర్దయుండై సవర్ణుండు నిర్దోషు లైన సవర్ణుల వధియించునంతకంటె మిక్కిలి పాతకం బొం డెద్ది? నీయట్టి పాపకర్ముల నుపేక్షించిన నఖిల ధర్మ రక్షణ క్షములమైన మమ్ముఁ దత్పాపంబు వొందు నని పాపభయంబున నిన్ను నిగ్రహింప వచ్చితిమి; నాకంటె నధికుండైన క్షత్త్రియుండు లేఁడని గర్వించి యొరుల నవమానించి పలుక వలదు. 190
క. అవినీతులయి మహాత్ముల | కవమానము సేసి మును జయద్రథ దంభో
ద్భవ కార్తవీర్యులనువా | రవజితులయి రొరులచే మహాబలులయ్యున్‌.
191
తరలము. అతుల విక్రమ సంపదన్‌ రణయజ్ఞ దీక్షితులై రిపు
ప్రతతి నోర్చిన వీరు, లుగ్రతపంబు సేసినవారు స
ద్గతికిఁ బోదురు గాక; యి ట్లపకారదారుణవృత్తి ను
ద్ధతిని భైరవపూజ సేసిన దాన సద్గతి గల్గునే?
192
తరలము. చెడక నా వచనంబు సేయుము; చెచ్చెరన్‌ ధరణీశులన్‌
విడిచి పుచ్చుమ; యేను గృష్ణుఁడ, వీఁడు భీముఁడు, వాఁడు గ
వ్వడి; భవత్కృత దారుణం బను వహ్ని యార్పఁగ నున్న య
క్కడిఁది వీరులు వీర లిద్దఱు గర్వితుల్‌ కురుసింహముల్‌.
193
క. కడుఁ గ్రూరుఁడవయి నృపతుల | విడువనినాఁ డాజిఁ బాండవేయులు నీయు
క్కడఁచి భుజశక్తి యేర్పడ | విడిపింతురు గడిమి నిఖిల విషయాధిపులన్‌.
194
వ. అనిన విని జరాసంధుండు సటాసముత్పాటన కుపితకుంజర వైరియుంబోలెఁ గడునలిగి పటు కుటిల భ్రుకుటి ఘటిత నిటలుం డగుచుఁ బురుషోత్తమున కి ట్లనియె. 195
క. అమితపరాక్రమమున నా | క్రమించి పరనృపుల నోర్చి గర్వించుట దో
సమె? యిది సత్‌క్షత్త్రియ ధ | ర్మమ; యే నెప్పుడుఁ బరాక్రమవ్రతుఁడ నిలన్‌.
196
క. దేవార్థముగాఁ దెచ్చిన | యీ వసుధాధిపుల నేల యే విడుతుఁ బ్రతా
పావజితరిపుఁడఁ గావున | నీ వెఱుఁగవె తొల్లి ధారుణీధర! నన్నున్‌?
197
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )