ఇతిహాసములు భారతము సభాపర్వము - ప్రథమాశ్వాసము
జరాసంధుండు యుద్ధమునకు భీమునిఁ గోరుకొనుట (సం. 2-20-28)
సీ. ‘సమకట్టి సైన్యంబు సైన్యంబుతో నొండెఁ, | దొడరి మీ మువ్వురతోడ నొండె.
నిద్దఱతో నొండె, నెక్కటి యొక్కని | తో నొండెఁ, బొడిచెద దోర్బలమున
నే యాయుధంబున నెమ్మెయిఁ బోరంగ | నిష్ట మయ్యది యుత్సహింపుఁ’ డనిన,
‘నొక్కనితోఁ బల్వు రుద్ధతులయి పూని | యుద్ధంబు సేయుట యుచితమగునె?
 
ఆ. యధిక బాహుబలులమయిన మా మువ్వుర | యందు నొక్కరుని మహాబలాఢ్యుఁ
గోరికొనుము; వాఁడు ఘోరాజిలో నిన్ను | మొనసి మల్లయుద్ధమున జయించు.’
198
క. అనిన మురవైరి పలుకులు | విని బార్హద్రథుఁడు భూరివీర్యు మరున్నం
దనుఁ గోరికొనియె ‘నీతం | డని నెన యగు నాకు’ ననుచు నతిదర్పితుఁడై.
199
వ. ఇట్లు జరాసంధుండు భీమసేనుతో మల్లయుద్ధంబు సేయ నిశ్చయించి తన తనయు సహదేవుని రాజ్యంబున కభిషిక్తుంజేసి పురోహిత కృత స్వస్త్యయనుండై. 200
ఆ. బలియుఁ డపుడు వెండ్రుకలు పాచి ముడిచి గం | టెసఁగఁ దాల్చి వీరరసికవృత్తి
నుద్ధతుండు మల్లయుద్ధ ప్రసాధనం | బమర నిలిచె వేడ్క నమితబలుఁడు.
201
వ. భీమసేనుండును వానికి నక్కజంబుగా మల్లయుద్ధ సన్నద్ధుం డయి ప్రతిభటించి నిలిచె నంత. 202
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )